సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో కనీసం హైదరాబాద్‌లోని రోడ్లపై ఉన్న గుంతలైనా పూడ్చగలిగారా అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు ఈ నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం చేసిందని అడిగారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పీఆర్పీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన పీవీ అశోక్‌కుమార్ తన అనుచరులతో కలసి ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. గాంధీభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ్‌తో పాటు మాజీ ఎంపీ వీహెచ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ హయాంలో కించిత్ అభివృద్ధి కూడా జరగలేదని ఉత్తమ్ ఆరోపించారు.
రాజధాని ప్రజలకు కృష్ణాజలాల ద్వారా తాగునీరు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రోరైలు, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే, ఔటర్ రింగురోడ్డు తదితర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రారంభించిన పనులకు నిధులు కేటాయించి అంతా తామే చేశామని గొప్పలు చెప్పుకోవడమే టీఆర్‌ఎస్ నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. గత నాలుగేళ్లుగా అడ్డగోలుగా కమీషన్లు తిని మున్సిపల్ మంత్రి కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హైదరాబాద్‌లో తుడిచిపెట్టుకు పోతుందని, ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. పార్టీలో అశోక్ చేరడం వల్ల రాజధానిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్, ఎంఐఎంలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సమాయత్తం కావాలని, ముందస్తు ఎన్నికల అంచనా నేపథ్యంలో పార్టీ నేతలు సమన్వయంతో ముందుకెళ్లి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
రోడ్ల గుంతలైనా పూడ్చారా..?: ఉత్తమ్
Published Mon, Jul 2 2018 1:11 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment