నా తెలంగాణా?.. మన తెలంగాణా? | Words War between TRS and congress in the Assembly | Sakshi
Sakshi News home page

నా తెలంగాణా?.. మన తెలంగాణా?

Published Wed, Dec 21 2016 2:16 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

నా తెలంగాణా?.. మన తెలంగాణా? - Sakshi

నా తెలంగాణా?.. మన తెలంగాణా?

అసెంబ్లీలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం
- ‘నా తెలంగాణ’ అన్న టీఆర్‌ఎస్‌ నేతల మాటలపై జానారెడ్డి ఆగ్రహం
- కాంగ్రెస్‌ లేకుండా మీరు తెలంగాణ తెచ్చేవారా అని నిలదీత


సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత తమదంటే తమదంటూ అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మంగళవారం శాసనసభలో మాటల యుద్ధానికి దిగాయి. అటు మంత్రి కేటీఆర్‌.. ఇటు సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమారెడ్డిల మధ్య మాటల తూటాలు పేలాయి. మంగళవారం ‘మిషన్‌ భగీరథ’పై జరిగిన చర్చలో ప్రతిపక్షం తరఫున మాట్లాడిన భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలను ఖండిస్తూ.. మంత్రి ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలతో ‘తెలంగాణ’ వివాదం తలెత్తింది. ఈ అంశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా జోక్యం చేసుకోవడంతో సభ దద్దరిల్లింది.

ఈటల వ్యాఖ్యలపై..
తొలుత ఈ చర్చలో భట్టి మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. టెండర్ల ప్రక్రియ, డీపీఆర్‌లపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. అనంతరం దీనిని ఖండిస్తూ మంత్రి కేటీఆర్, ఆ తర్వాత ఈటల రాజేందర్‌ మాట్లాడారు. ‘‘గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే ఫ్లోరైడ్‌ వల్ల కాళ్లు చేతులు చచ్చుబడిపోయిన వారిని తీసుకెళ్లి ప్రధాని ముందు పడుకోబెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. నా తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చేందుకు మేం ప్రయత్నిస్తుంటే దానిని విమర్శించడం తగదు..’’ అని ఈటల పేర్కొన్నారు. అయితే ఈటెల తన ప్రసంగంలో పలుమార్లు ‘నా తెలంగాణ’ అంటూ మాట్లాడడంపై సీఎల్పీ నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవేశంగా లేచి.. ‘‘నా తెలంగాణ.. నాతెలంగాణ అంటున్నవు. నువ్వు తెచ్చినవా తెలంగాణను.

మాటిమాటికీ అలా మాట్లాడడం తగదు. మన బిడ్డలు.. మన తెలంగాణ.. మన అభివృద్ధి అనండి. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షల కోసం తెలంగాణ ఏర్పడింది. టీఆర్‌ఎస్‌ కన్నా గొప్పగా మేం ముందుండి తెలంగాణను ఏర్పాటు చేశాం..’’ అని జానా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వమే లేకపోతే మీకు అక్కడ కూర్చుని మాట్లాడే అవకాశం వచ్చేదా? అని ప్రశ్నించారు. మీ ఒక్కళ్లే అనే భావన మంచిది కాదని, మీరు చేసిన పనులన్నీ మెచ్చుకునే వేదిక ఇది కాదని, సభలో వచ్చిన సద్విమర్శలు, సలహాలను తీసుకుని ముందుకెళ్లడం ప్రభుత్వానికి మంచిదని సూచించారు.

అందుకే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు
జానారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిందని జానారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 1956లో ఆంధ్రాతో బలవంతపు పెళ్లి చేసి, 1969 ఉద్యమంలో 370 మందిని కాల్చి చంపి, 2004 నుంచి 2014 వరకు తాత్సారం చేసి.. విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌ తెలంగాణను ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ‘‘మీకు మీరు సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం మంచిది కాదు. ప్రజలు ఎవరేం చేశారో గుర్తించారు. అందుకే మిమ్మల్ని అక్కడ (ప్రతిపక్షంలో) కూర్చోబెట్టి మమ్మల్ని ఇక్కడ (అధికారంలో) కూర్చోబెట్టారు..’’ అని పేర్కొన్నారు.

ఉత్తమ్‌తో మళ్లీ మొదలు
జానారెడ్డి, కేటీఆర్‌ల వాగ్యుద్ధం ముగిశాక కేటీఆర్‌ ‘మిషన్‌ భగీరథ’పై ఇచ్చిన వివరణలో ఉత్తమ్‌పై ఆరోపణలు చేశారు. ఆ పథకాన్ని ప్రారం భించేందుకు రావొద్దంటూ ప్రధానికి లేఖలు రాసిన దుస్థితికి కాంగ్రెస్‌ చేరిందని విమర్శించారు. దీనిపై ఉత్తమ్‌ తీవ్ర స్థాయిలో కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. ప్రధానికి తాను లేఖ రాసిన మాట వాస్తవమేనని.. ఏమీ చేయకుండా తామే అన్నీ చేశామని చెప్పు కుంటున్న పథకాన్ని ప్రారంభించేందుకు ప్రధాని హోదాలో రావాలో, వద్దో ఆలోచించుకోవాలంటూ లేఖరాశానని  చెప్పారు. తామేదో ఆంధ్రా పాలకులకు వత్తాసు పలుకు తున్నట్టు కేటీఆర్‌ మాట్లాడు తున్నారని.. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆంధ్రా ప్రాంత కాంట్రాక్టర్లకు టెండర్లు ఇవ్వడం లేదాని నిలదీశారు.

సీడీఆర్‌ నిబంధన కింద టెండర్లను పిలవడంలో అవకతవకలు జరిగాయని, దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి లేఖ రాసిన మాట వాస్తవం కాదా అని  ప్రశ్నించారు. ఉత్తమ్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ కూడా ఆవేశంగా స్పందించారు. తమపై అడ్డగోలుగా అవి నీతి ఆరోపణలు చేయవద్దని, స్వీయ మానసిక ఆం దోళనలను ప్రజలపై రుద్దాలనుకుంటే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. మంత్రి పదవులు వదులుకోలేక ఇళ్లలో కూర్చుని సంతకాలు పెట్టిన వారు కూడా మమ్మల్ని విమర్శిస్తారా అని ఎద్దేవా చేశారు. దీంతో ఉత్తమ్‌ మరోసారి ఫైరయ్యారు. ‘‘ఒక్క ఎంపీ ఉన్న టీఆర్‌ఎస్‌ వల్ల తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిందా? భగీరథలో  1,800 కోట్లతో నిర్మిస్తున్న ఇన్‌టేక్‌ వెల్స్‌ టెండర్లలో కేటీఆర్‌ నిబంధనలను మార్చి అవకతవకలకు పాల్ప డ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ సభ ముందు పెట్టండి. అక్రమాలను నిరూపించకపోతే ఏ శిక్షకైనా సిద్ధం..’’ అని సవాల్‌చేశారు.  టీఆర్‌ఎస్‌ సభ్యులు గొడవ చేయడంతో.. ‘ఒక కుటుం బాన్ని సమర్థిస్తే మీకేనష్టం..’ అంటూ వ్యాఖ్యానించారు.

అసలు కథ ఇక్కడే మొదలు
అయితే మంత్రి కేటీఆర్‌ విమర్శలపై జానారెడ్డి మరింత ఆగ్రహంగా స్పందించారు. ‘‘కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించినప్పుడు.. ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అప్పుడు తెలంగాణను ఎలా కాపాడుకోవాలంటూ కేసీఆర్‌ నా దగ్గరకు వచ్చిన మాట వాస్తవం కాదా? తెలంగాణను కాపాడుకునేందుకు ఏదైనా చేస్తానని చెప్పి... తెలంగాణ నేతలందరి చేతా రాజీనామాలు చేయించింది నేను, కాంగ్రెస్‌ పార్టీ కాదా..? ఆ చర్యలతోనే కదా తెలంగాణ ఉద్యమ ఉధృతి కొనసాగింది..’’ అని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని, సోనియాకు కూడా ఎన్నోసార్లు రాష్ట్రం కోసం నచ్చజెప్పామని చెప్పారు. కానీ తామేమీ చేయలేదని పదేపదే అనడం బాధ కలిగిస్తోందని జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు వింటుంటే అసలు తాము పొరపాటు చేశామేమో అన్న బాధ కలుగుతోందన్నారు. అప్పుడు అక్కడా (కేంద్రంలో), ఇక్కడా (రాష్ట్రంలో) తమ ప్రభుత్వమే ఉందని.. మిమ్మల్ని అణచాలనుకుంటే నిమిషం పట్టేది కాదని వ్యాఖ్యానించారు. కానీ ప్రజాస్వామికవాదులుగా తామలా చేయలేదని, టీఆర్‌ఎస్‌ మాత్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

తెలంగాణ ఇవ్వడం పొరపాటా..?
పొరపాటు చేశామంటూ జానారెడ్డి పేర్కొనడంపై తిరిగి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. జానారెడ్డి తన హోదాకు, అనుభవానికి, గౌరవానికి తగినట్టు మాట్లాడడం లేదని విమర్శించారు. పొరపాటు ఎందుకు చేశారో జానారెడ్డి చెప్పాలని, తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్‌ చేసిన పొరపాటా అని ప్రశ్నించారు. ఎవరిని అణచివేయాలనుకున్నారని నిలదీశారు. ఇలాంటి ఫ్యూడల్‌ ధోరణితో కాంగ్రెస్‌ పాలించింది కనుకే జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్‌.. ఓ పెద్ద ప్రాంతీయ పార్టీగా మారిందని విమర్శించారు. వెంటనే జానా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన జానా... ప్రజాస్వామికంగా వ్యవహరించాలని చెప్పాలనుకున్నానే తప్ప తెలంగాణ ఇవ్వడం పొరపాటనేది తమ అభిమతం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ఇవ్వడం కాంగ్రెస్‌ విధి కనుకనే ఇచ్చిందన్నారు. ఎన్నిసార్లు రెచ్చగొట్టినా సంయమనం పాటించామని, అయినా తమను గౌరవించకుండా కామెంట్లు చేస్తున్నారని చెప్పి జానారెడ్డి కూర్చోవడంతో చర్చ ఆగిపోయింది.

మోతీలాల్‌ నుంచి రాహుల్‌ వరకు..
అయితే ‘ఒక కుటుంబం’ అంటూ ఉత్తమ్‌ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ మండిపడ్డారు. ‘‘మోతీ లాల్‌ నెహ్రూ కుమారుడు జవహర్‌లాల్‌ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీ, ఆమె కొడుకు రాజీవ్‌గాంధీ, ఆయన భార్య సోనియా గాం ధీ.. ఇలా కాంగ్రెస్‌లో అంతా వారసత్వమే. సోనియా కుమారుడు రాహుల్‌ ఆ పార్టీ ఉపాధ్యక్షుడు కూడా. అలాంటి పార్టీకి ఉత్తమ్‌ రాష్ట్ర అధ్యక్షుడు. ఉత్తమ్‌ సతీమణి కూడా ఎమ్మెల్యేగా సభకు రావచ్చు. కానీ మా కుటుంబం నుంచి రాకూడదా..?’’ అని వ్యాఖ్యానించారు. ఆధారా లుంటే ఆవేశం, హడావుడి ఉండవని.. అవినీతిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్‌ ప్రకటించారు. దీంతో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ఉత్తమ్‌ మరోసారి స్పష్టం చేస్తూ.. కూర్చోవడంతో మాటల యుద్ధం ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement