సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలు ఇస్తామని ఓట్లు వేయించుకుని యువతను బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు మోసం చేశాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివసేనారెడ్డితో పాటు కార్యవర్గం నేతలు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు భారీగా గాంధీభవన్‌కు రావడంతో ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ సీఎల్పీ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, అఖిల భారత యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ యాదవ్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.(చదవండి: పార్టీ మారడం లేదు : చిన్నపరెడ్డి)
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ యువతకు నిరుద్యోగ భృతిపై సీఎం కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. అప్పుడు యువతను మోసం చేసి, ఇప్పుడు ఉద్యోగులకు తక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చి మోసం చేశారని ధ్వజమెత్తారు. భట్టివిక్రమార్క మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ పైనే ఉందన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రాహుల్‌గాంధీ నాయకత్వంలో పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జానారెడ్డి కోరారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని శివసేనారెడ్డి ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్ ఎటువైపు ఉందో చెప్పాలి: మాణిక్యం ఠాగూర్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్‌తోపాటు మరో 15 పార్టీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ ఎటువైపు ఉంటుందో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ డిమాండ్ చేశారు. బీజేపీతో టీఆర్‌ఎస్ దోస్తీ కొనసాగుతోందా లేదా అన్న విషయం తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని గురువారం ట్విట్టర్‌లో ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment