టీఆర్‌ఎస్ ఓడితే రాజీనామా చేస్తా
♦ పాలేరులో కాంగ్రెస్ ఓడితే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా
♦ ఉత్తమ్‌కు కేటీఆర్ సవాల్
♦ కాంగ్రెస్ నేతలు నైతిక విలువల గురించి మాట్లాడటం శోచనీయం
ఖమ్మం: పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే నైతిక బాధ్యత వహించి తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని... అదే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తారా అని మంత్రి కె.తారకరామారావు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని.. వారు నైతిక విలువల గురించి మాట్లాడడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ఆదివారం ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాలకు సాగునీరు అందుతుందని.. ప్రభుత్వంపై అపార నమ్మకంతో టీఆర్‌ఎస్‌ను ప్రజలు గెలిపించబోతున్నారని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలేరు ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, వారు కేసీఆర్ రెండేళ్ల పాలనను మెచ్చి టీఆర్‌ఎస్‌ను గెలిపించబోతున్నారని చెప్పారు. ప్రచారంలో తానేనాడూ వ్యక్తిగత విమర్శలకు పోలేదని.. కావాలనే కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులపై అంత ప్రేముంటే శ్రీకాంతాచారి తల్లిపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎందుకు పోటీ చేశారో చెప్పాలన్నారు. ఆ ఎన్నికల్లో డబ్బు పంచుతూ పట్టుపడిన మాట నిజం కాదా..? అని నిలదీశారు. రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో ఉంటే ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చిందన్నారు.
కానీ కొందరు అనవసర రాజకీయాలు చేస్తూ ఆయన సతీమణిని ఎండలో తిప్పుతున్నారని వ్యాఖ్యానించారు. అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్‌ను గాడిలో పెట్టి, తెలంగాణ ఖ్యాతిని చాటిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకే ఆ పార్టీ గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. ఆయన మరణించాక కూడా రాజకీయాలు చేశారని, వారికి నైతిక విలువలు ఉండవని విమర్శించారు. టీఆర్‌ఎస్‌కు ప్రజల మద్దతు ఉందని, అందుకే ప్రతి ఎన్నికల్లో విజయం సాధిస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు, ఈవీఎంలపై అభ్యంతరాల వంటివి కాంగ్రెస్ కుంటిసాకులు మాత్రమేనని స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని హితవుపలికారు.