మేమే నంబర్‌ వన్‌ | GHMC Elections 2020: Uttam Kumar Reddy Hopes To Win Maximum Seats | Sakshi
Sakshi News home page

మేమే నంబర్‌ వన్‌

Published Sat, Nov 28 2020 2:12 AM | Last Updated on Sat, Nov 28 2020 5:36 AM

GHMC Elections 2020: Uttam Kumar Reddy Hopes To Win Maximum Seats - Sakshi

జీహెచ్‌ఎంసీనే కాదు.. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌ పార్టీ నంబర్‌ వన్‌ కోసమే పోటీ పడుతుందని.. రాష్ట్రంలో తమ పార్టీకి ఉన్న కేడర్, పట్టు అలాంటిదని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ వెంటే నగర ప్రజలు ఉన్నారని, ఎవరూ ఊహించనన్ని స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ పార్టీయేనని, టీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిందేమీ లేదని, గ్రేటర్‌ అభివృద్ధికి బీజేపీ రూపాయి కూడా తేలేదని విమర్శించారు. మత విద్వేషాలను హైదరాబాద్‌తో పాటు తెలంగాణ ప్రజానీకం సహించదని, నగర ప్రశాంతతను చెడగొట్టాలని చూస్తే కాంగ్రెస్‌ చూస్తూ ఊరుకోదని ఆయన అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. ఆ విశేషాలివి..     
–సాక్షి, హైదరాబాద్‌

మాతోనే ఎవరికైనా పోటీ...
‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీలు కొత్త నాటకాలు మొదలుపెట్టాయి. ఓటర్లలో కంగాళీ సృష్టించేందుకు ఎంఐఎంతో జతకట్టి డ్రామాలు ఆడుతున్నాయి. పోటీ ఆ పార్టీల మధ్యనే ఉన్నట్లు, కాంగ్రెస్‌ పార్టీ పోటీనే కాదన్నట్లు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నాయి. కానీ, గ్రేటర్‌ ఎన్నికల్లో ఇతర పార్టీలు మాతోనే పోటీ పడుతున్నాయి. క్షేత్రస్థాయికి వెళితే అది అర్థమవుతుంది. టీఆర్‌ఎస్, బీజేపీలు అన్ని అంశాల్లో ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ ఎన్నికల్లో తామేదో శత్రువులమన్నట్లు గగ్గోలు పెడుతున్నాయి. ఇక, బీజేపీ–ఎంఐఎం సంబంధం అందరికీ తెలిసిందే. దేశంలో ఎక్కడ బీజేపీ గెలవాలన్నా ఆ పార్టీ ప్రయోగించే అస్త్రం ఎంఐఎం. ఎందుకంటే ఎంఐఎం పోటీ చేస్తేనే హిందుత్వ ఓట్లు బీజేపీకి పడతాయి. సెక్యులర్‌ ఓట్లలోని మైనార్టీ ఓట్లను ఎంఐఎం తీసుకుని ప్రతిపక్ష ఓట్లలో చీలిక తెస్తుంది. అప్పుడు బీజేపీ గెలుస్తుంది. బిహార్‌లో జరిగిందిదే. దుబ్బాకలో గెలిచినంత మాత్రాన బీజేపీకి రాష్ట్రంలో పట్టున్నట్లు కాదు. ఇక్కడే కాదు... రాష్ట్రంలో ఎక్కడ, ఎప్పుడు ఎన్నిక జరిగినా కాంగ్రెస్‌ పోటీ తొలిస్థానం కోసమే.’

ఎందుకు విచారణ జరపరు?
రాష్ట్రంలో అవినీతి పేట్రేగిపోతోందని కేంద్ర మంత్రులు అనేకసార్లు చెప్పారు. సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, ఆ పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వారిపై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు. తమ సంతకాలు ఫోర్జరీ చేశారని గగ్గోలు పెట్టే బీజేపీ రాష్ట్ర నాయకులు ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తీసుకురారో ప్రజలే అర్థం చేసుకోవాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్న కిషన్‌రెడ్డి ఫిర్యాదులు ఇచ్చే బదులు విచారణకు ఆదేశించవచ్చు కదా.. కానీ, అలా చేయరు. ఎందుకంటే ఆ రెండు పార్టీలూ ఒకటే. బీజేపీ టీఆర్‌ఎస్‌ను కాపాడితే... టీఆర్‌ఎస్‌ బీజేపీకి మద్దతిస్తుంది. ఇద్దరిదీ ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ.

మత సామరస్యానికి ప్రతీక...
‘మతాల మధ్య చిచ్చుపెట్టి, విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది బీజేపీ మొదటి నుంచీ అనుసరించే వ్యూహం. ఎంఐఎందీ ఇదే వ్యవహారం. కానీ ఈ నగరం మతసామరస్యానికి ప్రతీక. నేనూ ఈ నగరంలోనే జన్మించా. అసలుసిసలు హైదరాబాదీని. ఇక్కడ మతసామరస్యాన్ని చెడగొట్టాలని చూస్తే కాంగ్రెస్‌ చూస్తూ ఊరుకోదు. హైదరాబాద్‌ అభివృద్ధి కాంగ్రెస్‌ హయాంలోనే జరిగింది కాబట్టి మమ్మల్ని గెలిపించాలని ప్రజలను కోరుతున్నాం. చీకట్లో రాజీ పడే ఆ మూడు పార్టీలను మూసీలో కలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.’

నిర్ణయించాల్సింది అధిష్టానమే..
‘టీపీసీసీ అధ్యక్షుడి మార్పు వ్యవహారం మా పార్టీ అధిష్టానం పరిధిలోనిది. ఈ పదవిని నిర్వహించగలిగిన నేతలు చాలామంది ఉన్నారు. వారిలో ఎవరిని నియమించినా అందరం కాంగ్రెస్‌ను తెలంగాణలో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తాం. మా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జితో పాటు అధిష్టానానికి కూడా ఈ విషయం చెప్పా. నిర్ణయం తీసుకోవాల్సింది ఢిల్లీ పెద్దలే. ’

అన్నీ లెక్కలేసుకున్నాం
మా పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి దూసుకెళుతోంది. మేం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చదగినవే. ఏవి ఎలా చేయాలో మాకు తెలుసు. చేయాలనే చిత్తశుద్ధి ఉంది కాబట్టి. ఇక, మేనిఫెస్టోలో పెట్టిన హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందో, జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ ఎంతో అన్నీ లెక్కలేసుకునే హామీలిచ్చాం. అయినా, రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ శాతం హైదరాబాద్‌ నుంచి వస్తుంది కాబట్టి నగర అభివృద్ధికి ఆ మేరకు నిధులు వెచ్చించాలన్నది మా ప్రధాన నినాదం. ఆ నినాదంతోనే మేం జీహెచ్‌ఎంసీని ముందుకు నడిపిస్తాం. ప్రజలు అవకాశం ఇస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement