అసెంబ్లీలో అభివాదం చేస్తున్న సీఎం కుమారస్వామి. చిత్రంలో డిప్యూటీ సీఎం, మంత్రులు
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి కర్ణాటక సీఎం కుమారస్వామి రూ.34వేల కోట్ల రైతు రుణమాఫీని ప్రకటించారు. జేడీఎస్–కాంగ్రెస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను గురువారం ఆయన ప్రవేశపెట్టారు. ఇందులో రైతు రుణమాఫీ చేస్తున్నట్టు కుమారస్వామి ప్రకటించారు. ఇదే సమయంలో పెట్రోల్, విద్యుత్‌పై పన్నులను పెంచాలని ప్రతిపాదించారు. ఆర్థిక శాఖను కూడా తన వద్దే ఉంచుకున్న కుమారస్వామి పెట్రోల్, డీజిల్, విద్యుత్, మద్యంపై పన్నులను పెంచడం ద్వారా వచ్చే ఆదా యంతో రైతు రుణమాఫీ వల్ల ప్రభుత్వంపై పడే భారాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు.
అయితే రూ.2 లక్షల వరకూ మాత్రమే రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించామని, అంతకంటే ఎక్కువ మొత్తం రుణాలను మాఫీ చేయడం సరికాదన్నారు. తొలి విడతగా 2017 డిసెంబర్ 31 వరకూ బకాయి ఉన్న అన్ని వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. రుణాలు సకాలంలో చెల్లించిన ప్రతి రైతుకు వారు చెల్లించిన మొత్తం లేదా రూ.25 వేల వరకూ ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలో వేస్తామని చెప్పారు. అయితే ప్రభుత్వ అధికారుల కుటుంబీకులు, సహకార రంగంలో ఉన్న వారు, గత మూడేళ్లుగా ఆదాయపన్ను చెల్లిస్తున్న రైతులను రుణమాఫీ పథకానికి అనర్హులుగా నిర్ణయించారు.
భారం దించుకునేందుకు పన్నుల పెంపు
అయితే పెట్రోల్‌పై లీటర్‌కు పన్నును రూ.1.14, డీజిల్‌పై పన్నును రూ.1.12 పెంచాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. విద్యుత్‌పై పన్నును ప్రస్తుతం ఉన్న 6 శాతం నుంచి 9 శాతానికి పెంచాలని ప్రతిపాదిం చారు. అదేవిధంగా దేశంలో తయారయ్యే విదేశీ మద్యంపై అదనపు ఎక్సైజ్ డ్యూటీని 4 శాతం పెంచారు. అలాగే వాణిజ్య వాహనాలపై మోటారు వాహనాల పన్నును 50% పెంచారు. కాగా, రుణమాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు పన్నులు పెంచాలనే నిర్ణయానికి రావడంపై విమర్శలు వస్తున్నాయి.
చైనాతో పోటీపడదాం..
చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులకు పోటీగా ‘కంపీట్ విత్‌చైనా’(చైనాతో పోటీ పడదాం) అనే పథకాన్ని సీఎం కుమారస్వామి బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ పథకాన్ని మరో పారిశ్రామిక విప్లవంగా అభివర్ణించారు. వచ్చే ఏడాది ప్రభుత్వం రూ.14 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఈ పథకం ద్వారా 8 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించొచ్చని కుమారస్వామి చెప్పారు. దీనిలో భాగంగా విడి భాగాలను గ్రామ స్థాయిలో, వస్తువులను తాలూకా స్థాయిలో తయారుచేస్తామని, వాటి మార్కెటింగ్ కోసం ప్రత్యేక సముదాయాలను తెరుస్తామని తెలిపారు. అలాగే, ఆర్థికంగా వెనకబడిన బ్రాహ్మణుల అభివృద్ధి కోసం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment