బెంగళూరు: రాజ్యసభ ఎన్నికలతో కర్ణాటకలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. ప్రధాన పార్టీలు నువ్వా-నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. కర్ణాటక నుంచి ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యంగా నాలుగో సీటును దక్కించుకునేందుకు అధికార, విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార బీజేపీ రెండు సీట్లు సులభంగా గెలుస్తుంది. మూడో సీటు కాంగ్రెస్ ఖాతాలో చేరే అవకాశముంది. ఇక నాలుగో స్థానంపై జేడీ(ఎస్) ఆశలు పెట్టుకుంది. అయితే కాంగ్రెస్, బీజేపీ కూడా పోటీలో ఉండటంతో ఉత్కంఠ నెలకొంది.
రెండో ప్రాధాన్యత ఓట్లతో..
బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ తమకు మద్దతు ఇవ్వాలని జేడీ(ఎస్) అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి కోరుతున్నారు. లౌకికవాద శక్తులను బలోపేతం చేసేందుకు తన పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, రెండో ప్రాధాన్యత ఓట్లు వేస్తే తమ అభ్యర్థి గెలుస్తారని కాంగ్రెస్‌ను అభ్యర్థించారు. అయితే కర్ణాటక కాంగ్రెస్ నాయకులపై తమకు నమ్మకం లేదని జాతీయ నేతలు చొరవ తీసుకుని తమ విజయానికి మద్దతు ఇవ్వాలని మీడియా ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు.
బీజేపీ, కాంగ్రెస్‌లతో పొత్తు ఉండదు
తమ అభ్యర్థికే జేడీ(ఎస్) మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అంటోంది. గతంలో తాము చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పే సమయం ఇప్పుడు వచ్చిందని పేర్కొంది. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ 2020లో తమ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికయ్యారని హస్తం పార్టీ గుర్తు చేసింది. కుమారస్వామి ఈ వాదనను వ్యతిరేకించారు. అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప.. బీజేపీ నుంచి ఎవరినీ నామినేట్ చేయకపోవడంతో కాంగ్రెస్ తమకు మద్దతు ఇచ్చిందన్నారు. ఒకవేళ బీజేపీ పోటీ చేసివుంటే కాంగ్రెస్ కచ్చితంగా బరిలోకి దిగేదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ప్రజలు విసిగి పోయారని.. ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని కుమారస్వామి తాజాగా స్పష్టం చేశారు.
ఒక్క సీటు.. మూడు పార్టీలు!
ఇక తాజా రాజ్యసభ ఎన్నికల్లో గెలిచే బలం లేనప్పటికీ నాలుగో స్థానంలో మూడు పార్టీలు పోటీకి దిగాయి. ఒక అభ్యర్థి గెలవడానికి 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కర్ణాటక శాసనసభలో బీజేపీకి 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో బీజేపీ రెండు సీట్లు సునాయాసంగా గెలుస్తుంది. స్వతంత్ర అభ్యర్థితో సహా కాంగ్రెస్‌కు 70 మంది ఉండటంతో.. వారికి ఒక సీటు ఖాయం. ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులు (నిర్మలా సీతారామన్, జగ్గేష్) ఎన్నికైన తర్వాత, బీజేపీకి అదనంగా 32 ఎమ్మెల్యే ఓట్లు మిగిలిపోతాయి. జైరాం రమేష్‌ను ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్‌కు 24 ఎమ్మెల్యే ఓట్లు మిగులుతాయి. జేడీ(ఎస్)కు 32 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ బలం ఒక సీటు గెలవడానికి సరిపోదు కాబట్టి కాంగ్రెస్ మద్దతును జేడీ(ఎస్) కోరుతోంది. (క్లిక్: రాజ్యసభ ఎన్నికలు.. ఎన్సీపీ నేతలకు షాక్)
క్రాస్ ఓటింగ్ భయం..
అయితే తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ పాల్పడే అవకాశముందని జేడీ(ఎస్) అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అందుకే తమ ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించినట్టు కుమారస్వామి స్వయంగా వెల్లడించారు. కాంగ్రెస్ ఎలాంటి వైఖరి అవలంభిస్తుంది? బీజేపీ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై జేడీ(ఎస్) విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికలు జూన్ 10న జరగనున్నాయి. అదేరోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ఉంటుంది.
నాలుగో స్థానానికి పోటీలో ఉన్న అభ్యర్థులు
డి. కుపేంద్ర రెడ్డి- జేడీ(ఎస్)
మన్సూర్ అలీఖాన్- కాంగ్రెస్
లహర్ సింగ్ సిరోయా- బీజేపీ
Comments
Please login to add a commentAdd a comment