సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి గురువారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. చర్చ అనంతరం సభలో విశ్వాస పరీక్ష చేపట్టి.. బలాబలాలు అంచనా వేసే అవకాశముంది. చర్చ ఈ రోజు ముగుస్తుందా? ఈ రోజంతా కొనసాగి.. రేపటికి కూడా పొడిగించబడుతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది.
ఇక, కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా విశ్వాస పరీక్షకు డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బెంగళూరులోని విండ్‌ఫ్లవర్ ప్రకృతి రిసార్ట్‌లో బస చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ అనూహ్యంగా గత రాత్రి ముంబై చేరుకున్నారు. అనంతరం ఛాతిలో నొప్పి వస్తుందంటూ.. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు విశ్వాస పరీక్షకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్-జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు ఇటీవల ముంబైలోనే బస చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ముంబైలోని ఆస్పత్రిలో చేరడంతో సంకీర్ణ కూటమి సంఖ్యాబలం ఇంకా తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది.
(చదవండి: సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా.. లేకున్నా: కుమారస్వామి ఉద్వేగం)
Comments
Please login to add a commentAdd a comment