సాక్షి, బెంగళూరు : కన్నడ రాజకీయ సంక్షోభంపై నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి చెందిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామా విషయమై స్పీకర్ రమేష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 14 మందిలో ఎనిమిది మంది ఎమ్మెల్యేల రాజీనామాలను మంగళవారం ఆయన తిరస్కరించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో ముగ్గురికి ఈనెల 12న, మరో ఇద్దరికి 15న అపాయింట్‌మెంట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా ఎమ్మెల్యేల రాజీనామా విషయమై స్పీకర్ రమేష్ మాట్లాడుతూ.. పోస్టులో పంపిన రాజీనామాలను ఆమోదించనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు... ‘పోస్టులో పంపిన రాజీనామాలను పంపితే స్పీకర్ కార్యాలయంలో నేనెందుకు. వారిలో ఏ ఒక్క ఎమ్మెల్యే నన్ను సంప్రదించలేదు. ఎవరైనా సరే నన్ను నేరుగా కలవొచ్చు. నేను రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు.
ఇక స్పీకర్ రాజీనామాలు ఆమోదించకుండా.. తిరస్కరించిన నేపథ్యంలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి కొంత సమయం దొరికినట్టు అయింది. ఈ క్రమంలో మరోవైపు అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కాంగ్రెస్-జేడీఎస్ పెద్దలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎమ్మెల్యేలను బుజ్జగించి తమవైపు రప్పించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ముంబై వెళ్లారు. ముంబైలో మకాం వేసిన రెబెల్ ఎమ్మెల్యేలతో టచ్‌లోకి వచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
ఇక, రెబెల్ ఎమ్మెల్యేల మంత్రి పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్-జేడీఎస్ మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఒకవైపు సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్ సర్వశక్తులు ఒడ్డుతున్నా.. మరోవైపు ఎమ్మెల్యేలు జారిపోతూనే ఉన్నారు. సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పారు. దీంతో కుమారస్వామి సర్కార్ మైనారిటీలో పడిందని, వెంటనే కుమారస్వామి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కుమారస్వామి రాజీనామాకు డిమాండ్ చేస్తూ.. సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమాలకు దిగింది.
Comments
Please login to add a commentAdd a comment