సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక రాష్ట్రంలో జనతా దళ్ (సెక్యులర్), కాంగ్రెస్ పార్టీలకు చెందిన 14 మంది శాసనసభ్యులు అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్‌కు శుక్రవారం రాజీనామాలు సమర్పించిన నేపథ్యంలో కుమార స్వామి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలి పోతుందా ? కూలిపోతే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా ? అసలు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారా ? ఆమోదించకపోతే ఏమవుతుంది ? రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకుంటారా ? కర్ణాటక అసెంబ్లీ భవిష్యత్తు ఏమిటీ ?
చదవండి: తెరపైకి కాంగ్రెస్ ప్లాన్-బీ.. మంత్రులంతా రాజీనామా
2018, మే నెలలో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 224 సీట్లకుగాను బీజేపీకి 105 సీట్లు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ఏడు సీట్లు తగ్గాయి. కాంగ్రెస్ పార్టీకి 78 సీట్లు, జనతాదళ్ (సెక్యులర్)కు 37 సీట్లు వచ్చాయి. బీజేపీని అధికారంలోకి రాకుండా నివారించడం కోసం కాంగ్రెస్, జనతాదళ్ పార్టీలు అంగీకారానికి వచ్చి ఒక బీఎస్పీ సభ్యుడు, ఇద్దరు స్వతంత్ర సభ్యుల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పటి నుంచి సంకీర్ణ ప్రభుత్వాన్ని నెట్టుకురావడంలో జేడీఎస్ నాయకుడైన కుమార స్వామి ఒత్తిడికి గురవుతున్నారు. కేబినెట్ బెర్తుల కోసం కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, ప్రభుత్వాన్ని నడపడంలో వారు ఏ మాత్రం సహకరించడంలోదని కుమార స్వామి బహిరంగంగానే కన్నీళ్లు పెట్టుకున్నారు.
మంత్రి పదవుల కోసం సొంత పార్టీ శాసన సభ్యుల నుంచి కూడా ఒత్తిళ్లు ఉండడంతో ఆయన ఎవరికి న్యాయం చేయలేకపోయారు. ఏలోగా లోక్‌సభ ఎన్నికలు రావడం ఆ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రం నుంచి కూడా అఖండ విజయాన్ని సాధించడంతో ప్రభుత్వంలో కొనసాగడం వల్ల పెద్ద ప్రయోజనం లేదని భావించిన ఇరు పార్టీలకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారి చర్య వెనక బీజేపీ ప్రలోభాలు కూడా ఉండవచ్చు. డబ్బుల ఆశ చూపినట్లు ఇప్పటికే ఇద్దరు శాసన సభ్యులు బహిరంగంగానే ఆరోపించిన విషయం తెల్సిందే. బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ కంపెనీకి చెందిన ఓ విమానంలో ముంబైకి వెళ్లిన పది మంది తిరుగుబాటు శాసన సభ్యులు అక్కడ హోటల్లో మకాం వేయడం కూడా ఈ అనుమానాలను బలపరుస్తోంది.
ఏం జరగబోతోంది?
14 మంది శాసన సభ్యుల రాజీనామాలపై శుక్రవారం నాడు ఎలాంటి నిర్ణయం తీసుకోని స్పీకర్ రమేశ్ కుమార్ మంగళవారం నాడు తాను ఆఫీసుకు వచ్చినప్పుడు వాటిని పరిశీలిస్తానని చెప్పారు. వారి రాజీనామాలు నిర్ణీత ఫార్మైట్‌లో వాటిని ఆమోదించడం మినహా స్పీకర్‌కు మరో గత్యంతరం ఉండదు. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆయన వాటిని తొక్కిపట్టి ఉంచవచ్చు. ఈ విషయంలో కోర్టులు కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేవు. అలాంటప్పుడు రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకొని ప్రస్తుతం ప్రభుత్వాన్ని విశ్వాస తీర్మానం కోరవచ్చు. అప్పుడు కుమార స్వామి అసెంబ్లీ విశ్వాసాన్ని పొందడం కష్టం అవుతుంది.
ఒకవేళ 14 మంది రాజీనామాలను స్పీకర్ ఆమోదించినట్లయితే అసెంబ్లీ సభ్యుల సంఖ్య మొత్తం 110. అవుతుంది. అప్పుడు జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం సంఖ్య 104కు పడిపోతుంది. బీజేపీకి 105 స్థానాలు ఉన్నాయి కనుక ఇంకా ఒక్కరి మద్దతు అవసరం అవుతుంది. బీజేపీకి ఏకైక బీఎస్పీ సభ్యుడు మద్దతు ఇవ్వడానికి గానీ, బీజేపీలో చేరిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. కనుక బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 14 అసెంబ్లీ సీట్లకు జరిగే ఉప ఎన్నికల్లో ఎక్కువ సీట్లను గెలుచుకోవడం ద్వారా బీజేపీ బలాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంది. ఈ కారణంగా సంకీర్ణ పక్షాల చర్చలకు అవకాశం ఇవ్వడానికి స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారు. రెబెల్స్‌కు పదవులను ఆఫర్ చేయడం ద్వారా వారిని రాజీనామాల ఉపసంహరణకు అటు కాంగ్రెస్–ఇటు జేడీఎస్ పార్టీలు సంప్రతింపులు జరుపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment