సాక్షి బెంగళూరు: కాంగ్రెస్ – జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు ఈ నాలుగు అంశాలే కారణంగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు మంత్రి హెచ్‌డీ రేవణ్ణ అన్ని శాఖల్లో జోక్యం చేసుకోవడం. దేవెగౌడ కుటుంబసభ్యుల కనుసన్నల్లో పరిపాలన ఉండడం. కుమారస్వామి మంత్రులు, ఎమ్మెల్యేల ఎవరి అభిప్రాయాలు వినడం లేదు. తనదైన శైలిలో సాగిపోతున్నారు. దేవెగౌడ, కుమారస్వామి ఆలోచనల మధ్య విభేదాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో నిర్ణయం ప్రకటించడంతో కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు. వీరితో సిద్ధరామయ్యకు పొసగడం లేదు.
దళపతికి గోపాలయ్య షాక్
బెంగళూరులో మహలక్ష్మీ లేఔట్ జేడీఎస్ ఎమ్మెల్యే కె.గోపాలయ్య.. దళపతి దేవెగౌడకు అత్యంత స న్నిహితుడు. అయితే ఆయన కూడా రెబెల్‌గా మారి రాజీనామా చేయడంతో దేవెగౌడకు షాక్ తగిలింది. ఓడిన నాయకులకు పార్టీ పదవినిచ్చి తనను పట్టించుకోలేదనే గోపాలయ్య రాజీనామా చేశార ని సమాచారం.కె.గోపాలయ్యను రెండు రోజుల క్రితం దేవేగౌడ రాష్ట్ర జేడీఎస్ సి నియర్ ఉపాధ్యక్షునిగా నియమించారు.
మునిరత్న లేఖను చించేసిన డీకే
రాజరాజేశ్వరినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్న కూడా రాజీనామా చేయాలని విధానసౌధకు వెళ్లారు. ఆయన రాజీనామా లేఖను గమనించిన మంత్రి డికే శివకుమార్ లేఖను తీసుకుని చించేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల జతలో మంత్రి రాజీసూత్రంపై చర్చలు జరిపారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. కావాలంటే మునిరత్న పోలీసులకు ఫిర్యాదు చేసినా పర్వాలేదని, తనపై ఇప్పటికే ఉన్న అనేక కేసుల్లో ఇదొకటి అవుతుందని డీకే అన్నారు.
వారికెంత ముట్టిందీ తెలుసు
రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలను బుజ్జగిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి డికే శివకుమార్ తెలిపారు. రాజీనామాల వెనుక బీజేపీ కుట్ర ఉందన్నారు. అందుకే బీజేపీ నాయకులు మౌనంగా ఉన్నారని, ఆ ఎమ్మెల్యేలకు రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుండి ఎంత డబ్బులు ముట్టిందీ తనకు తెలుసన్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై తనకు ఎంతో విశ్వాసం ఉందన్నారు.
బాధగా ఉన్నా.. తప్పడం లేదు
కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళడం చా లా బాధగా ఉంది, కానీ తప్పడం లేదు, నాకు కాంగ్రెస్ నేతలపై అసంతృప్తి లేదు అని మాజీ హోం మంత్రి, బీటీఎం లేఔట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి అన్నారు. శనివారం రెబెల్ ఎమ్మెల్యేల తో కలిసి ఆయన విధానసౌధలో మీడియాతో మా ట్లాడారు. మొదటి నుంచి కూడా పార్టి కోసం కృషి చేశానని, కానీ ప్రస్తుతం తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ కార్యధ్యక్షుడు ఈశ్వర్‌ఖండ్రే తనను కలిసి పార్టీకి పెద్దద్ద దిక్కుగా ఉన్న వారు మీరే రాజీనామా చేస్తే ఎలా అని అన్నారని చెప్పారు. తాను రాజీనామా చేయడంపై పార్టీ పెద్దలకు చాలా సార్లు వివరణనిచ్చానని తెలిపారు. కాంగ్రెస్‌ను వీడడానికీ కన్నీళ్లు వస్తున్నా గత్యంతరం లేదన్నారు. తాను మాత్రం రాజీనామా చేస్తున్నానని, కూతురు సౌమ్యారెడ్డి విషయం నాకు తెలియదని అన్నారు.
అనుమానాస్పదంగా దేవనహళ్లి ఎమ్మెల్యే తీరు
శనివారం రాజధాని బెంగళూరులో జేడీఎస్, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు రాజీనామా పేరుతో హైడ్రామాకు తెరలేపగా ఇటు బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్లి జేడీఎస్ ఎమ్మెల్యే నిసర్గ నారాయణస్వామి హఠాత్తుగా మొబైల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికీ దొరక్కుండా వెళ్లిపోయారు. ఇటు నిసర్గ నారాయణస్వామి కూడా రాజీనామా ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే సంకీర్ణప్రభుత్వంపై ఆయన కూడా తీవ్ర అసంతప్తితో ఉన్నారు. మొదట నిసర్గ నారాయణస్వామిని బెంగళూరు విమానాశ్రయం అభివద్ధి మండలి అధ్యక్షుడిగా నియమించి కేవలం ఒకటిన్నర నెల రోజుల్లోనే ఆ పదవిని వెనక్కు లాక్కున్నారు. ఇది చాలదన్నట్టు దొడ్డబళ్లాపురం ఎమ్మెల్యే (కాంగ్రెస్) వెంకటరమణయ్యకు అదే బయాప అధ్యక్ష పదవి కట్టబెట్టారు. దీంతో నిసర్గ నారాయణస్వామి అసంతప్తితో రగిలిపోయారు. దీంతో ఆయనకు బీజేపీ గాలం వేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలతో కలిసిపోయారా? అని నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment