
ముంబై : వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీయే నుంచి అకాలీదళ్ బయటకు రావడాన్ని విపక్షాలు స్వాగతించాయి. అకాలీదళ్ నిర్ణయాన్ని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ సమర్ధించారు. అకాలీదళ్ నేతలు సుఖ్బీర్ సింగ్ బాదల్, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన హర్‌సిమ్రత్ బాదల్‌లు రైతుల పక్షాన గట్టిగా నిలబడి పోరు సాగించారని శరద్ పవార్ ప్రశంసించారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ నిబద్ధతతో పోరాడారని పవార్ ట్వీట్ చేశారు. ఇక రైతుల ప్రయోజనాలకు కట్టుబడి ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుంటూ అకాలీదళ్ తీసుకున్న నిర్ణయాన్ని శివసేన ప్రశంసిస్తోందని ఆ పార్టీ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.
మరోవైపు రైతులను కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాలని సుఖ్బీర్ సింగ్ బాదల్ పిలుపు ఇచ్చారు. రైతుల ఆర్థిక దయనీయ స్థితి దేశ ఆర్థిక వ్యవస్ధను ప్రభావితం చేస్తుందని, దేశ విస్తృత ప్రయోజనాలను కాపాడేందుకు తాము పోరాడుతున్నామని పంజాబ్‌లో పార్టీ కార్యకర్తలు, రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ బాదల్ పేర్కొన్నారు. కాగా పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం ఆమోదముద్ర వేశారు. చదవండి : కంగనా వివాదం : పవార్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment