- ఆయనో అసమర్థ ముఖ్యమంత్రి
- చెరుకు రైతుకు అందని మద్దతు ధర
- దివాళా దిశగా రాష్ట్ర ఆర్థిక స్థితి
- కరువు బాధితులను ఆదుకోవడం పూర్తిగా విఫలం
- మాజీ సీఎం, ఎంపీ యడ్యూరప్ప ధ్వజం
సాక్షి,బెంగళూరు : రాష్ట్రంలో పాలన గాడితప్పిందని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసమర్థతే అందుకు కారణమని మాజీ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యుడు యడ్యూరప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హుబ్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బెల్గాంలో గతంలో జరిగిన శీతాకాల శాసనసభ సమావేశాల్లో ప్రకటించిన చెరుకు మద్దతు ధర ఇప్పటికీ రైతులకు అందలేదన్నారు. మొదట ఆ బాకీ మొత్తాన్ని చెల్లించిన తర్వాతే సిద్ధరామయ్య త్వరలో జరగబోయే బెల్గాం చట్టసభల్లో పాల్గొనాలని ఘాటు వాఖ్యలు చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో పన్నుల వసూలులో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుండటంతో అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడుతోందని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళాతీసే స్థితిలో ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో రాష్ట్రం అభివృద్ధిలో తిరోగమనంలో ప్రయాణిస్తోందని విమర్శించారు. అతివృష్టి వల్ల పంటలు, పశువులు, ఇళ్లను కోల్పోయిన రైతులను, ప్రజలను ఆదుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు.
కరువు తాలూకాలు ప్రకటనకు మాత్రమే పరిమితమయ్యాయని తెలిపారు. కరువు ప్రాంతాల్లో ప్రజలకు మేలుచేకూరే పనులు ఒక్కటి కూడా జరగడం లేదని విమర్శించారు. అధికారులపై తరుచుగా ఆగ్రహం వ్యక్తం చేసే బదులు వారి ఆలోచనలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని యడ్యూరప్ప సీఎం సిద్ధరామయ్యకు సలహా ఇచ్చారు.
ఇదే సమయంలో శాసనసభ ప్రతిపక్ష నాయకుడు జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో జలాశయాలు దాదాపు గరిష్ట నీటిమట్టాన్ని కలిగి ఉండి అందుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా కూడా ప్రజలు విద్యుత్ కోతలు ఎదుర్కొంటుండటం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. ఇందుకు ప్రజలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఇంధనశాఖ మంత్రి డీకే శివకుమార్ సమాధానం చెప్పితీరాలని శెట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.