మరో శిరోభారం | Another sirobharam | Sakshi
Sakshi News home page

మరో శిరోభారం

Published Mon, Nov 3 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

మరో శిరోభారం

మరో శిరోభారం

  •  ‘వర్క్ రిపోర్టు’ను అడగడంతో సీఎం సిద్ధుపై సీనియర్లు సీరియస్
  •  అధికారులు సహకరించకుండా, నిధులు రాకుండా పనులెలా
  •  చేస్తామంటూ సీఎంపై ఆగ్రహం
  • సాక్షి, బెంగళూరు :  ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరో తలనొప్పి వచ్చిపడింది. మంత్రుల పనితీరును తెలుసుకునేందుకు గాను సీఎం సిద్ధరామయ్య మంత్రులను ‘వర్క్ రిపోర్ట్’ను అడగడమే అందుకు కారణం. సిద్ధరామయ్య మంత్రివర్గంలోని కొందరు మంత్రులు ప్రజల సంక్షేమానికి సంబంధించిన ఎలాంటి పనులు చేయడం లేదని, అంతేకాక తమ శాఖల్లోని నిధులను సద్వినియోగం చేయడంపై సైతం దృష్టి సారించడం లేదనే విమర్శలు ఇటీవల ఎక్కువయ్యాయి.  

    ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం పెరిగిపోతుందని భావించిన పార్టీ హైకమాండ్ మంత్రుల పనితీరుకు సంబంధించిన నివేదికను రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆదేశించింది. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని మంత్రి వర్గంలో ఎలాంటి మార్పులు చేయాలి.. ఎవరెవరిని మంత్రి వర్గం నుంచి తొలగించాలి అన్న అంశాలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
     
    ‘వర్క్ రిపోర్ట్’ అందజేయండి....

    ఇక హైకమాండ్ ఆదేశాలతో తన మంత్రి వర్గ సహచరులను ‘వర్క్ రిపోర్ట్’ అందజేయాల్సిందిగా సిద్ధరామయ్య కోరారు. పదవిని చేపట్టిన అనంతరం మీ నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు?, ఎన్నిసార్లు కార్యకర్తలతో సమావేశమయ్యారు?, బడ్జెట్‌లో ప్రకటించిన పనులు ఎంత వరకు అమలు చేశారు? ఇలా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అందజేస్తూ ప్రతి మంత్రి నివేదికను అందజేయాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు.
     
    అధికారులు సహకరించట్లేదు....


    కాగా, తమని వర్క్ రిపోర్ట్ అడగడంపై మంత్రి వర్గంలోని కొందరు సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ పనితీరుపై నిఘా ఉంచేందుకు సిద్ధరామయ్య ప్రయత్నిస్తుండడం తమకెంతో ఇబ్బందికరంగా ఉందని వారు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. అంతేకాక ‘పని’ చేసేందుకు తమకున్న ఇబ్బందుల గురించి కూడా వారు సీఎంను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ‘మా శాఖల్లోని అధికారులు మాకు సహకరించట్లేదు.

    బడ్జెట్‌లో వివిధ అభివృద్ధి పథకాల కోసం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తోంది. బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఇంకా పూర్తిగా అందనేలేదు. ఇలాంటి సందర్భంలో మా నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులతో పాటు బడ్జెట్‌లో ప్రకటించిన పథకాలు ఎలా పూర్తవుతాయి.

    వీటన్నింటిని పరిగణలోకి తీసుకోకుండా మా పనికి సంబంధించిన ‘వర్క్ రిపోర్ట్’ను కోరడం, ఆ నివేదిక ద్వారా మా పనితీరును బేరీజు వేయడం ఎంత వరకు సమంజసం’ అని కొందరు సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రుల వర్క్ రిపోర్ట్‌ను అందజేయాల్సిందిగా హైకమాండ్ ఇచ్చిన ఆదేశాలను పాటించలేక, వర్క్ రిపోర్ట్ విషయమై సీనియర్ మంత్రులను సమాధాన పరచలేక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తలపట్టుకున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement