అన్యాయం
- కార్మిక చట్టాలను మార్చడంపై మల్లికార్జున ఖర్గే ఆగ్రహం
- కార్పొరేట్ వర్గాలు, వ్యాపారవేత్తలకే లబ్ధి అని ఆరోపణ
- కేంద్ర ప్రభుత్వ చర్యలపై మండిపాటు
- కార్మికుల సంక్షేమంపై తమకూ ప్రత్యేక శ్రద్ధ ఉందన్న కేంద్ర మంత్రి అనంతకుమార్
సాక్షి, బెంగళూరు : అనేక సంవత్సరాలుగా ఉన్న కార్మిక చట్టాల్లో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించడంపై కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంటు సభ్యుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. కార్మిక చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలచిన మార్పుల వల్ల కార్మికులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని విమర్శించారు. కార్పొరేట్ వర్గాలు, వ్యాపారవేత్తలకు ప్రయోజనం చేకూర్చేలా కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
కార్మిక చట్టాల్లో మార్పులకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే పై విధంగా స్పందించారు. శుక్రవారమిక్కడి వసంతనగర్‌లో నవీకరించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్‌ల కాలంలో రూపొందించినవని చెప్పారు. ఈ చట్టాల్లో ఏవైనా చిన్నపాటి సవరణలు చేయవచ్చు కానీ పూర్తిగా చట్టాలనే మార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇక ఇప్పుడున్న కార్మిక చట్టాలతోనే జీడీపీ 10 శాతం నుంచి 12 శాతానికి పెరిగిందని, జీడీపీ నెపాన్ని చూపుతూ కార్మిక చట్టాల్లో మార్పులకు సన్నద్దం కావడం సరికాదని అన్నారు. కార్మిక చట్టాల్లో మార్పుపై మరోసారి ఆలోచించాల్సిందిగా ప్రధానికి సూచించాలని అదే వేదికపై ఉన్న కేంద్ర మంత్రి అనంతకుమార్‌ను ఖర్గే కోరారు. అనంతరం కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ...నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తోందని అన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ టీ అమ్ముకుంటూ ప్రధాని స్థానానికి చేరుకున్నారని, అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తున్న ఈఎస్‌ఐ ఆస్పత్రుల గురించి త్వరలోనే కేంద్ర కార్మికశాఖ మంత్రితో చర్చిస్తానని అనంతకుమార్ వెల్లడించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర మంత్రి ఆంజనేయ తదితరులు పాల్గొన్నారు.