సమర సన్నాహాలు
- అర్కావతిపై న్యాయ పోరాటం చేయాలని బీజేపీ నిర్ణయం
- సీఎం ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి కోరాలని తీర్మానం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని అర్కావతి లేఔట్ డీనోటిఫికేషన్ వ్యవహారంపై న్యాయ పోరాటం చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి తెలిపారు. మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీనోటిఫికేషన్‌పై ఇప్పటి వరకు సాగుతున్న ఆందోళనకు కొనసాగింపుగా న్యాయ పోరాటం చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు వెల్లడించారు.
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్‌ను కోరాలని నిర్ణయించినట్లు కూడా చెప్పారు. ఇప్పటికే దీనిపై రాజకీయ పోరాటం సాగుతున్నదని గుర్తు చేశారు. డీనోటిఫికేషన్ వ్యవహారంపై పరిశీలన జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సురేశ్ కుమార్ నాయకత్వంలో కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. న్యాయ పోరాటానికి అవసరమైన డాక్యుమెంట్లను సేకరించాల్సిందిగా కూడా కమిటీకి సూచించామని చెప్పారు.
మేయర్ అభ్యర్థిపై చర్చ
బీబీఎంపీకి కొత్త మేయర్, ఉప మేయర్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే విషయమై సమావేశంలో చర్చించామని జోషి తెలిపారు. అభ్యర్థుల విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. కాగా కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రులు అనంత కుమార్, డీవీ. సదానంద గౌడ, మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ యడ్యూరప్ప, శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రులు కేఎస్. ఈశ్వరప్ప, ఆర్. అశోక్‌లు పాల్గొన్నారు.