legal battles
-
ఆటుపోట్లను అధిగమిస్తూ...
చెన్నై, సాక్షి ప్రతినిధి: జయలలిత.. ఈ పేరు ఒకప్పుడు సాధారణ నటిది. కానీ నేడు జాతీయ స్థాయిలో ఒక ఉక్కుమహిళగా పేరుగాంచిన అన్నా డీఎంకే అధినేత్రిది. 33 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను అధిగమించిన చరిత్ర ఆమెది. తమిళనాడు ప్రజలతో అమ్మ అని పిలిపించుకోవడంలోనే ఆమె సమ్మోహనాస్త్రముంది. 1948 ఫిబ్రవరి 24న జన్మించిన జయలలిత నటిగా వెలుగొందుతున్న కాలంలో ఎం.జి.రామచంద్రన్ ఆమెలోని ప్రతిభా పాటవాలను గుర్తించి 1982లో పార్టీలోకి ఆహ్వానించారు. 1983లో పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా ఎంజీఆర్ వద్ద ఆమె మంచి మార్కులు కొట్టేశారు. జయ ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని మెచ్చుకున్న ఎంజీఆర్ 1984లో ఆమెను రాజ్యసభ సభ్యురాలిని చేశారు. 1987 డిసెంబరు 24న ఎంజీఆర్ మరణానంతరం తొలిసారిగా జయకు రాజకీయకష్టాలు మొదలయ్యాయి. ఎంజీఆర్ అంత్యక్రియల ఊరేగింపు నుంచి జయను ఆ పార్టీ నేతలే తోసివేశారు. పార్టీ ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ వర్గం, జయ వర్గంగా విడిపోయింది. ఎంజీఆర్ వారసురాలిగా 93 మంది సభ్యుల మద్దతుతో 1988 జనవరి 7వ తేదీన జానకి సీఎం పదవిని అధిష్టించినా అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ రాజ్యాంగంలోని 356 సెక్షన్‌తో ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో రాష్ట్రపతి పాలన వచ్చింది. అన్నా డీఎంకే పగ్గాలు జయ చేతికి రాగా 1989 నాటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో తొలి మహిళా విపక్ష నేతగా నిలిచారు. జయను ప్రతిపక్ష నేతగా సహించలేని డీఎంకే సభ్యులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెపై మైక్‌లు విసిరివేసి తీవ్రంగా అవమానించి కన్నీళ్లు పెట్టుకుంటూ అసెంబ్లీ వదిలి వెళ్లిపోయేలా చేశారు. సీఎంగా అవతరణ..ఎంజీఆర్‌ను కోల్పోయిన అన్నా డీఎంకేకు జయ చుక్కానిగా మారారు. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని తొలిసారి సీంగా ఐదేళ్లు పాలించారు. 2001లో రెండోసారి సీఎంగా పగ్గాలు చేపట్టారు. అయితే ఆ ఏడాది సెప్టెంబర్‌లో టాన్సీ(తమిళనాడు చిన్నతరహా పరిశ్రమల సంస్థ) కేసులో దోషిగా తేలినందున సీఎం పదవికి రాజీనామా చేశారు. అప్పుడు తన అనుచరుడు పన్నీర్‌సెల్వంను సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. తర్వాత 2002లో నిర్దోషిగా తేలడంతో మరోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. 2014 సెప్టెంబర్‌లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిందికోర్టు దోషిగా ప్రకటించడంతో మళ్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు. అప్పుడు కూడా పన్నీర్‌సెల్వంను సీఎం కుర్చీలో కూర్చొబెట్టారు. 21 రోజులు జైల్లో ఉండి, సుప్రీం బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. జయను వెంటాడిన డీఎంకే.. అన్నా డీఎంకే అధినేత్రిగా జయ ఏకు మేకైందని భావించిన డీఎంకే తాను అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఆమెపై అనేక కేసులు పెట్టింది. జయ వాటి నుంచి బయటపడుతూ వచ్చారు. జయ నాటి నుంచి నేటి వరకు 14 కేసులతో ఆటుపోట్లను అధిగమించి ఉక్కు మహిళగా నిలిచారు. టాన్సీ, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, ప్లజెంట్ స్టే హోటల్ కేసు ఇలా14 కేసుల నుంచి బయటపడి పేరులోనే కాదు జీవితంలోనూ జయమేనని నిరూపించారు. ఈ కేసులన్నీ 1996-2001 మధ్య డీఎంకే ప్రభుత్వ హయాంలో మోపినవే. 2001లో జయ మళ్లీ సీఎం అయిన తర్వాత ఒక్కొక్కటిగా కేసుల నుంచి బయటపడ్డారు. కోర్టుల్లో ఆరోపణలు నిరూపణ కాకపోవడంతో అన్ని కేసుల్లో నిర్దోషిగా మిగిలారు. 13కేసుల్లో నిరపరాధిగా నిరూపించుకున్నారు. బలమైన కేసు... గతంలో ఎదుర్కొన్న కేసుల కంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అత్యంత బలమైనది. 1991-96 మధ్య సీఎంగా జయ అక్రమాస్తులు కూడగట్టారని అప్పటి జనతా పార్టీ చీఫ్ సుబ్రహ్మణ్యస్వామి(ప్రస్తుతం బీజేపీ నేత) 1996 జూన్ 14న మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పట్లో తమిళనాడు గవర్నర్‌గా ఉన్న మర్రి చెన్నారెడ్డి అనుమతి తీసుకుని మరీ పిటిషన్ వేశారు. విచారణలో రూ. 66.65 కోట్లు అక్రమార్జనగా జయపై అభియోగం మోపారు. కేసులో ఆధారాలు బలంగా ఉన్నాయని ప్రత్యర్థులు ప్రచారం చేసినట్లుగానే ప్రత్యేక కోర్టులో జయకు శిక్షపడింది. కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసుకోవడం ద్వారా డీఎంకే పెట్టిన అన్ని కేసుల నుంచి జయ నిర్దోషిగా నిలిచినట్లయింది. జయ విజయ రహస్యం... సినీ వ్యక్తులను రాజకీయంగా సైతం ఆరాధించే తమిళనాడులో జయ ప్రత్యేక ఆకర్షణ. ఎంజీఆర్ మరణించి 30 ఏళ్లు దాటినా ఆయనపై తరగని అభిమానం ఉంది. ఎంజీఆర్ బతికున్నప్పుడే పార్టీ భవిష్య నాయకురాలిగా జయను తెరపైకి తేవడాన్ని ప్రజలు నేటికీ గుర్తుంచుకున్నారు. డీఎంకేకు ప్రత్యామ్నాయం అన్నాడీఎంకే మాత్రమే అనే రీతిలో ఎంజీఆర్ తీర్చిదిద్దగా అదే బాటలో జయ సైతం నడవడం మరింత బలాన్ని చేకూర్చింది. జయ తాత మైసూరు మహారాజు సంస్థానంలో సర్జన్‌గా పనిచేసినందున ఉన్నత కుటుంబ నేపథ్యంతో పాటు విద్యాధికురాలిగా ఆమెను గుర్తించారు. ఇంగ్లిష్తో పాటు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. ఎంజీఆర్‌ను పురచ్చితలైవర్ (విప్లవ నాయకుడు) అని పిలుచుకునే తమిళనాడు ప్రజలు జయను పురచ్చితలైవి(విప్లవనాయకురాలు)గా పిలవడం ప్రారంభించారు. అమ్మ అంటే జయ అంటూ అక్కున చేర్చుకున్నారు. ప్రధానంగా ఆమె తెచ్చిన పథకాలు ఆమెను ప్రజలకు మరింత చేరువ చేశాయి. జయకు జైలు శిక్షపడిన నాటి నుంచి తాజా తీర్పు వరకు 233 మంది బలవన్మరణాలకు పాల్పడటం ప్రజలకు ఆమెపై ఉన్న అభిమానానికి తార్కాణం. -
రైతుల పక్షాన న్యాయపోరాటాలు
ఏపీ రాజధానిపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు రాజధాని ప్రాంత రైతుల్లో ధైర్యం నింపేందుకు అన్ని పక్షాలు కలసిరావాలని పిలుపు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ బాధ్యత తీసుకోవాలని తీర్మానం సాక్షి, హైదరాబాద్: ఖాకీల నీడలో మానవ హక్కుల్ని హరిస్తూ రాజధాని ప్రాంత రైతుల్ని భయభ్రాంతుల్ని చేస్తున్న ప్రభుత్వ విపరీత పోకడలను ఉద్యమ రూపంలో ఎదుర్కోవాల్సి ఉందని ఏపీ రాజధానిపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం అభిప్రాయపడింది. అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చి రైతుల్లో మనోధైర్యం నింపాల్సిన చారిత్రక అవసరం ఏర్పడిందని పేర్కొంది. న్యాయపోరాటాలతో పాటు ప్రజా పోరాటాలు నిరాటంకంగా కొనసాగించాలని, కరపత్రాలతో ప్రచారం చేయాలని, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో విశాల సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ దుశ్చర్యల్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని అభిప్రాయపడింది. ఇందుకు అభ్యుదయవాదులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం అందించాలని, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షపార్టీ వైఎస్సార్ సీపీ బాధ్యత తీసుకోవాలని వక్తల ఏకాభిప్రాయంతో తీర్మానించింది. సమావేశంలో పాల్గొన్న వక్తలంతా ప్రభుత్వం భూములు సమీకరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జరీబు భూముల్ని రాజధాని నిర్మాణానికి మినహాయించాలని తీర్మానం చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన భవన్లో మంగళవారం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంగా ఎంపికచేసిన మండలాల్లో వైవిధ్యం గల పంటల ఫొటో ఎగ్జిబిషన్, ఏపీ రాజధానిపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. తొలుత జస్టిస్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రైతులు భూ సమీకరణకు ఒప్పుకోకుంటే బలవంతపు భూ సేకరణ చేపడతామని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, అయితే కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్‌లో రాజధాని నిర్మాణానికి బలవంతపు సేకరణకు అవకాశం లేదని చెప్పారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య మాట్లాడుతూ మన దేశ సంస్థలే ఇతర దేశాల్లో భారీ నిర్మాణాలు చేస్తుంటే సింగపూర్ సహకారం ఎందుకని ప్రశ్నించారు. రైతుల పక్షాన ఉంటాం: వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ భూములు ఇవ్వనన్నాడనే కారణంతో ఆ ప్రాంతానికి చెందిన రైతు శ్రీనాథ్చౌదరిని పోలీసులు తీసుకెళ్లారని, వారం రోజులుగా ఆయన జాడ లేదని చెప్పారు. పోలీసుల దాష్టీకాన్ని ప్రపంచానికి చెప్పేందుకు అన్ని రాజకీయ పక్షాలు కలసి ఉద్యమ బాట పట్టాలన్నారు. వైఎస్సార్ సీపీ రైతుల పక్షాన కడవరకు పోరాడుతుందని చెప్పారు. రైతు ఉద్యమనేత అనుమోలు గాంధీ మాట్లాడుతూ ఇక్కడి పొలాల్లో 120 రకాల పంటలను పండిస్తున్నారని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణ విధానం చట్టవిరుద్ధమైందన్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం కన్వీనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ 2011లో రైతుల భూముల జోలికొస్తే ఖబడ్దార్ అన్న బాబు ఇప్పుడు భూ సమీకరణకు అడ్డువస్తే ఖబడ్దా ర్ అంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కిసాన్‌సెల్ నేత కోదండరెడ్డి మాట్లాడుతూ రైతులకు ఏ విషయంలోనైనా నష్టం జరుగుతుందంటే సీఎంగా ఉన్న సమయంలో వైఎస్సార్ రైతులకు అనుకూలంగా నిర్ణయా లు తీసుకునే వారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి, సీపీఐ ఎం.ఎల్. నేత గుర్రం విజయకుమార్, హైకోర్టు న్యాయవాది జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడారు. ఆకట్టుకున్న ఫొటో ఎగ్జిబిషన్ జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంటల ఫొటో ఎగ్జిబిషన్ పలువురిని ఆకట్టుకుంది. సమావేశానికి ముందు జస్టిస్ లక్ష్మణరెడ్డి ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఫొటోల్లో పంటలను రైతు నాయకుడు ఎ.గాంధీ వివరించారు. -
సమర సన్నాహాలు
అర్కావతిపై న్యాయ పోరాటం చేయాలని బీజేపీ నిర్ణయం సీఎం ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి కోరాలని తీర్మానం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని అర్కావతి లేఔట్ డీనోటిఫికేషన్ వ్యవహారంపై న్యాయ పోరాటం చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి తెలిపారు. మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీనోటిఫికేషన్‌పై ఇప్పటి వరకు సాగుతున్న ఆందోళనకు కొనసాగింపుగా న్యాయ పోరాటం చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్‌ను కోరాలని నిర్ణయించినట్లు కూడా చెప్పారు. ఇప్పటికే దీనిపై రాజకీయ పోరాటం సాగుతున్నదని గుర్తు చేశారు. డీనోటిఫికేషన్ వ్యవహారంపై పరిశీలన జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సురేశ్ కుమార్ నాయకత్వంలో కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. న్యాయ పోరాటానికి అవసరమైన డాక్యుమెంట్లను సేకరించాల్సిందిగా కూడా కమిటీకి సూచించామని చెప్పారు. మేయర్ అభ్యర్థిపై చర్చ బీబీఎంపీకి కొత్త మేయర్, ఉప మేయర్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే విషయమై సమావేశంలో చర్చించామని జోషి తెలిపారు. అభ్యర్థుల విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. కాగా కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రులు అనంత కుమార్, డీవీ. సదానంద గౌడ, మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ యడ్యూరప్ప, శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రులు కేఎస్. ఈశ్వరప్ప, ఆర్. అశోక్‌లు పాల్గొన్నారు. -
కార్తీక్ నా భర్త
వర్ధమాన నటి మైత్రేయి న్యాయం జరిగే వరకూ పోరాటం మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు 420 సెక్షన్ కింద కార్తీక్‌పై కేసు నమోదు వాస్తవమని తేలితే చర్యలు తప్పవు : సిద్ధు సాక్షి, బెంగళూరు : కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడ తన భర్త అని వర్ధమాన నటి మైత్రేయి స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని ఆమె తేల్చి చెప్పారు. గురువారం మీడియాతో ఆమె మాట్లాడారు. రెండున్నరేళ్ల క్రితమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, అయితే తాజా ఘటనకు తాను కాంగ్రెస్ కార్యకర్త కావడానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇటీవల తనకు దూరంగా ఉంటున్న కార్తీక్ ఫోన్ చేసి ‘వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయింది, ఇకపై నీతో కలిసి ఉండేందుకు వీలుకాదు. మీడియా ముందుకు వెళ్లొద్దు. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తా’నని చెప్పారని వివరించారు. అయితే తనను భార్యగా అంగీకరించేంత వరకూ న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. కాగా, తనకు జరిగిన అన్యాయంపై బుధవారం రాత్రి ఆర్టీ నగర పోలీస్ స్టేషన్లో మైత్రేయి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కార్తీక్‌గౌడపై ఐపీసీ 376, 420 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం మైత్రేయికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వాస్తవమని తేలితే చర్యలు తప్పవు ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ... మైత్రేయికి అన్యాయం జరిగినట్లు తేలితే దోషులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి తారతమ్యం ఉండబోదని స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించి సదానందగౌడను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వివరణ కోరినట్లు సమాచారం. మైత్రేయికు నోటీస్ జారీ ఫిర్యాదుకు సంబంధించి తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను అందించేందుకు గురువారం మధ్యాహ్నాం 12.30 గంటలకు పోలీస్ స్టేషన్‌కు రావాలని మైత్రేయికి బుధవారం రాత్రి పోలీసులు సూచించారు. అయితే సాయంత్రం మూడు గంటలు దాటిపోయినా ఆమె పోలీస్ స్టేషన్‌కు చేరుకోలేదు. దీనిపై వివరణ కోరుతూ మైత్రేయికి ఆర్టీ నగర పోలీసులు నోటీస్ జారీ చేశారు. కాగా, ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి మాట్లాడుతూ... దర్యాప్తు పూర్తి అయిన తర్వాత వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. ఈ విషయంపై సదానందగౌడతో మాట్లాడినట్లు చెప్పారు. కార్తీక్ గౌడ ఎలాంటి తప్పు చేయలేదని ఆయన వివరించారని పేర్కొన్నారు.