ఆటుపోట్లను అధిగమిస్తూ... | legal battles, several ups and downs in jayalalitha political career | Sakshi
Sakshi News home page

ఆటుపోట్లను అధిగమిస్తూ...

Published Tue, May 12 2015 2:21 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM

ఆటుపోట్లను అధిగమిస్తూ...

ఆటుపోట్లను అధిగమిస్తూ...

 చెన్నై, సాక్షి ప్రతినిధి: జయలలిత.. ఈ పేరు ఒకప్పుడు సాధారణ నటిది. కానీ నేడు జాతీయ స్థాయిలో ఒక ఉక్కుమహిళగా పేరుగాంచిన అన్నా డీఎంకే అధినేత్రిది. 33 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను అధిగమించిన చరిత్ర ఆమెది. తమిళనాడు ప్రజలతో అమ్మ అని పిలిపించుకోవడంలోనే ఆమె సమ్మోహనాస్త్రముంది. 1948 ఫిబ్రవరి 24న జన్మించిన జయలలిత నటిగా వెలుగొందుతున్న కాలంలో ఎం.జి.రామచంద్రన్ ఆమెలోని ప్రతిభా పాటవాలను గుర్తించి 1982లో పార్టీలోకి ఆహ్వానించారు. 1983లో పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా ఎంజీఆర్ వద్ద ఆమె మంచి మార్కులు కొట్టేశారు. జయ ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని మెచ్చుకున్న ఎంజీఆర్ 1984లో ఆమెను రాజ్యసభ సభ్యురాలిని చేశారు. 1987 డిసెంబరు 24న ఎంజీఆర్ మరణానంతరం తొలిసారిగా జయకు రాజకీయకష్టాలు మొదలయ్యాయి. ఎంజీఆర్ అంత్యక్రియల ఊరేగింపు నుంచి జయను ఆ పార్టీ నేతలే తోసివేశారు. పార్టీ ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ వర్గం, జయ వర్గంగా విడిపోయింది. ఎంజీఆర్ వారసురాలిగా 93 మంది సభ్యుల మద్దతుతో 1988 జనవరి 7వ తేదీన జానకి సీఎం పదవిని అధిష్టించినా అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ రాజ్యాంగంలోని 356 సెక్షన్‌తో ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో రాష్ట్రపతి పాలన వచ్చింది. అన్నా డీఎంకే పగ్గాలు జయ చేతికి రాగా 1989 నాటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో తొలి మహిళా విపక్ష నేతగా నిలిచారు. జయను ప్రతిపక్ష నేతగా సహించలేని డీఎంకే సభ్యులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెపై మైక్‌లు విసిరివేసి తీవ్రంగా అవమానించి కన్నీళ్లు పెట్టుకుంటూ అసెంబ్లీ వదిలి వెళ్లిపోయేలా చేశారు.


 సీఎంగా అవతరణ..ఎంజీఆర్‌ను కోల్పోయిన అన్నా డీఎంకేకు జయ చుక్కానిగా మారారు. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని తొలిసారి సీంగా ఐదేళ్లు పాలించారు. 2001లో రెండోసారి సీఎంగా పగ్గాలు చేపట్టారు. అయితే ఆ ఏడాది సెప్టెంబర్‌లో టాన్సీ(తమిళనాడు చిన్నతరహా పరిశ్రమల సంస్థ) కేసులో దోషిగా తేలినందున సీఎం పదవికి రాజీనామా చేశారు. అప్పుడు తన అనుచరుడు పన్నీర్‌సెల్వంను సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. తర్వాత 2002లో నిర్దోషిగా తేలడంతో మరోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. 2014 సెప్టెంబర్‌లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిందికోర్టు దోషిగా ప్రకటించడంతో మళ్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు. అప్పుడు కూడా పన్నీర్‌సెల్వంను సీఎం కుర్చీలో కూర్చొబెట్టారు. 21 రోజులు జైల్లో ఉండి, సుప్రీం బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు.
 జయను వెంటాడిన డీఎంకే..  అన్నా డీఎంకే అధినేత్రిగా జయ ఏకు మేకైందని భావించిన డీఎంకే తాను అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఆమెపై అనేక కేసులు పెట్టింది. జయ వాటి నుంచి బయటపడుతూ వచ్చారు. జయ నాటి నుంచి నేటి వరకు 14 కేసులతో ఆటుపోట్లను అధిగమించి ఉక్కు మహిళగా నిలిచారు. టాన్సీ, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, ప్లజెంట్ స్టే హోటల్ కేసు ఇలా14 కేసుల నుంచి బయటపడి పేరులోనే కాదు జీవితంలోనూ జయమేనని నిరూపించారు. ఈ కేసులన్నీ 1996-2001 మధ్య డీఎంకే ప్రభుత్వ హయాంలో మోపినవే. 2001లో జయ మళ్లీ సీఎం అయిన తర్వాత ఒక్కొక్కటిగా కేసుల నుంచి బయటపడ్డారు. కోర్టుల్లో ఆరోపణలు నిరూపణ కాకపోవడంతో అన్ని కేసుల్లో నిర్దోషిగా మిగిలారు. 13కేసుల్లో నిరపరాధిగా నిరూపించుకున్నారు.


 బలమైన కేసు... గతంలో ఎదుర్కొన్న కేసుల కంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అత్యంత బలమైనది. 1991-96 మధ్య సీఎంగా జయ అక్రమాస్తులు కూడగట్టారని అప్పటి జనతా పార్టీ చీఫ్ సుబ్రహ్మణ్యస్వామి(ప్రస్తుతం బీజేపీ నేత) 1996 జూన్ 14న మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పట్లో తమిళనాడు గవర్నర్‌గా ఉన్న మర్రి చెన్నారెడ్డి అనుమతి తీసుకుని మరీ పిటిషన్ వేశారు.  విచారణలో రూ. 66.65 కోట్లు అక్రమార్జనగా జయపై అభియోగం మోపారు. కేసులో ఆధారాలు బలంగా ఉన్నాయని ప్రత్యర్థులు ప్రచారం చేసినట్లుగానే ప్రత్యేక కోర్టులో జయకు శిక్షపడింది. కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసుకోవడం ద్వారా డీఎంకే పెట్టిన అన్ని కేసుల నుంచి జయ నిర్దోషిగా నిలిచినట్లయింది.


 జయ విజయ రహస్యం... సినీ వ్యక్తులను రాజకీయంగా సైతం ఆరాధించే తమిళనాడులో  జయ ప్రత్యేక ఆకర్షణ. ఎంజీఆర్ మరణించి 30 ఏళ్లు దాటినా ఆయనపై తరగని అభిమానం ఉంది. ఎంజీఆర్ బతికున్నప్పుడే పార్టీ భవిష్య నాయకురాలిగా జయను తెరపైకి తేవడాన్ని ప్రజలు నేటికీ గుర్తుంచుకున్నారు. డీఎంకేకు ప్రత్యామ్నాయం అన్నాడీఎంకే మాత్రమే అనే రీతిలో ఎంజీఆర్ తీర్చిదిద్దగా అదే బాటలో జయ సైతం నడవడం మరింత బలాన్ని చేకూర్చింది. జయ తాత మైసూరు మహారాజు సంస్థానంలో సర్జన్‌గా పనిచేసినందున ఉన్నత కుటుంబ నేపథ్యంతో పాటు విద్యాధికురాలిగా ఆమెను గుర్తించారు. ఇంగ్లిష్‌తో పాటు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. ఎంజీఆర్‌ను పురచ్చితలైవర్ (విప్లవ నాయకుడు) అని పిలుచుకునే తమిళనాడు ప్రజలు జయను పురచ్చితలైవి(విప్లవనాయకురాలు)గా పిలవడం ప్రారంభించారు.  అమ్మ అంటే జయ అంటూ అక్కున చేర్చుకున్నారు. ప్రధానంగా ఆమె తెచ్చిన పథకాలు ఆమెను ప్రజలకు మరింత చేరువ చేశాయి. జయకు జైలు శిక్షపడిన నాటి నుంచి తాజా తీర్పు వరకు 233 మంది బలవన్మరణాలకు పాల్పడటం ప్రజలకు ఆమెపై ఉన్న అభిమానానికి తార్కాణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement