తీవ్ర హెచ్చుతగ్గులు
♦ చివరకు సెన్సెక్స్ 81 పాయింట్లు డౌన్
♦ 25 పాయింట్లు తగ్గిన నిఫ్టీ
ముంబై: అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన భారత్ స్టాక్ మార్కెట్ చివరకు క్షీణతతో ముగిసింది. గత రాత్రి అమెరికా మార్కెట్ పతనం కావడం, అదేరీతిలో ఆసియా మార్కెట్లు పడిపోవడంతో గురువారం తొలుత బీఎస్‌ఈ సెన్సెక్స్ 300 పాయింట్ల వరకూ క్షీణించి 24,473 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమయ్యింది.
ఇన్ఫోసిస్ ఫలితాలు ఉత్సాహపర్చడం, చైనా మార్కెట్ రికవరీ కావడంతో మధ్యాహ్న సెషన్‌లో కోలుకుని 25,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. అయితే అటుతర్వాత యూరప్ మార్కెట్లు పతనబాటపట్టడంతో చివరకు 81 పాయింట్ల తగ్గుదలతో 24,773 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,440-7,600 పాయింట్ల మధ్య ఊగిసలాడి చివరకు 25 పాయింట్ల నష్టంతో 7,537 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. రూపాయి రెండున్నరేళ్ల కనిష్టస్థాయికి పడిపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపర్చింది. చైనా మినహా మిగిలిన ప్రపంచ ప్రధాన మార్కెట్లు బలహీనంగా ట్రేడ్‌కావడంతో సెన్సెక్స్ లాభాల్ని నిలబెట్టుకోలేకపోయిందని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు.
వెలుగులో ఇన్ఫో సిస్, లోహ, బ్యాంకింగ్ షేర్లు పతనం....
ఇన్ఫోసిస్ ఫలితాలు మార్కెట్ అంచనాల్ని మించడం, పూర్తి ఆర్థిక సంవత్సరానికి గెడైన్స్ పెంచడంతో ఆ షేరు 5 శాతం వరకూ ర్యాలీ జరిపింది. ఇదేబాటలో టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్‌లు స్వల్పంగా పెరిగాయి. ప్రపంచ ట్రెండ్‌ను అనుసరిస్తూ లోహ షేర్లు పతనమయ్యాయి. అధిక రుణభారం కారణంగా టాటా స్టీల్‌ను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ డౌన్‌గ్రేడ్ చేయడంతో ఆ షేరు 3.3 శాతం క్షీణించింది. వేదాంత, హిందాల్కోలు 2.5 శాతం వరకూ తగ్గాయి. జిందాల్ ఐరెన్ అండ్ స్టీల్ 8 శాతం పతనమయ్యింది. మరోవైపు యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 1-4 శాతం మధ్య తగ్గాయి. చైనా షాంఘై సూచి 2 శాతం వరకూ పెరిగింది.
సెన్సెక్స్ 22,000కు..: ఆంబిట్ అంచనా
దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్నదని, ఫలితంగా వచ్చే కొద్దిరోజుల్లో సెన్సెక్స్ 22,000 స్థాయికి పడిపోతుందని బ్రోకరేజ్ సంస్థ ఆంబిట్ క్యాపిటల్ అంచనావేసింది. బలహీన కార్పొరేట్ ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహకరణ ఈ పతనానికి దారితీస్తుందని ఆంబిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఈక్విటీస్) సౌరభ్ ముఖర్జియా చెప్పారు. బొగ్గు, సిమెంటు ఉత్పత్తి, ద్విచక్ర వాహన విక్రయాలు, గ్రామీణ వేతనాలు, విద్యుదుత్పత్తి, చమురుయేతర బ్యాంకు రుణాలు, డిపాజిట్లు తగ్గుతున్నాయని ముఖర్జియా తెలిపారు. ఈ అంశాలు ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్నదనడానికి సంకేతాలన్నారు.