Dinotiphikesan
-
సమర సన్నాహాలు
అర్కావతిపై న్యాయ పోరాటం చేయాలని బీజేపీ నిర్ణయం సీఎం ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి కోరాలని తీర్మానం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని అర్కావతి లేఔట్ డీనోటిఫికేషన్ వ్యవహారంపై న్యాయ పోరాటం చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి తెలిపారు. మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీనోటిఫికేషన్‌పై ఇప్పటి వరకు సాగుతున్న ఆందోళనకు కొనసాగింపుగా న్యాయ పోరాటం చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్‌ను కోరాలని నిర్ణయించినట్లు కూడా చెప్పారు. ఇప్పటికే దీనిపై రాజకీయ పోరాటం సాగుతున్నదని గుర్తు చేశారు. డీనోటిఫికేషన్ వ్యవహారంపై పరిశీలన జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సురేశ్ కుమార్ నాయకత్వంలో కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. న్యాయ పోరాటానికి అవసరమైన డాక్యుమెంట్లను సేకరించాల్సిందిగా కూడా కమిటీకి సూచించామని చెప్పారు. మేయర్ అభ్యర్థిపై చర్చ బీబీఎంపీకి కొత్త మేయర్, ఉప మేయర్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే విషయమై సమావేశంలో చర్చించామని జోషి తెలిపారు. అభ్యర్థుల విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. కాగా కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రులు అనంత కుమార్, డీవీ. సదానంద గౌడ, మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ యడ్యూరప్ప, శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రులు కేఎస్. ఈశ్వరప్ప, ఆర్. అశోక్‌లు పాల్గొన్నారు. -
ఢీ అంటే ఢీ
డీనోటిఫికేషన్‌పై పట్టు వీడని బీజేపీ ఆరోపణపై సీబీఐతో దర్యాప్తునకు డిమాండ్ న్యాయ విచారణ చేయిస్తామని సీఎం ప్రకటన సమ్మతించని విపక్షాలు.. సాగని సభ ధర్నా మధ్యే ద్రవ్య వినియోగ బిల్లుకు ఆమోదం శాసన సభ నిరవధిక వాయిదా నగరంలోని అర్కావతి లేఔట్లో బీడీఏ భూముల డీనోటిఫికేషన్‌కు సంబంధించి వచ్చిన ఆరోపణలపై సీబీఐతో దర్యాప్తునకు బీజేపీ పట్టు వీడలేదు. పోడియం వద్ద సోమవారం కూడా ధర్నా చేపట్టింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శాసన సభలో ప్రకటించినా సమ్మతించలేదు. 2003లో 3,839 ఎకరాలకు ప్రాథమిక నోటిఫికేషన్ వెలువరించినప్పటి నుంచి ఇటీవల హైకోర్టుకు సవరణ మార్పుల పథకాన్ని సమర్పించినంత వరకు విచారణ జరుగుతుందని సీఎం చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే సభ ద్రవ్య వినియోగ, మూడు సవరణ బిల్లులను కాంగ్రెస్ ఆమోదించుకోవడంపై విపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ ధర్నా కొనసాగడంతో సభను నిరవధికంగా వాయిదా వేశారు. సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని అర్కావతి లేఔట్లో బీడీఏ భూముల డీనోటిఫికేషన్‌కు సంబంధించి వచ్చిన ఆరోపణలపై న్యాయ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం శాసన సభలో వెల్లడించారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి విచారణ జరుపుతారని తెలిపారు. 2003లో 3,839 ఎకరాలకు ప్రాథమిక నోటిఫికేషన్ వెలువరించినప్పటి నుంచి ఇటీవల హైకోర్టుకు సవరణ మార్పుల పథకాన్ని సమర్పించినంత వరకు విచారణ జరుగుతుందని చెప్పారు. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష బీజేపీ, ఇటీవల 541 ఎకరాల బీడీఏ భూముల డీనోటిఫికేషన్‌పై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలన్న తన డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. శనివారం చేపట్టిన ధర్నాను కొనసాగించింది. సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఇందులో భారీ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించింది. అయితే సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం తిరస్కరించింది. అర్కావతి లేఔట్ కోసం సేకరించిన 541 ఎకరాల భూమిని హైకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వం డీనోటిఫై చేసిందని ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ ఆరోపించారు. డీనోటిఫికేషన్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోక్యం ఉందని ఆరోపిస్తూ బీజేపీ సభ్యులు ధర్నాను కొనసాగించారు. మరో వైపు నగరంలో చెరువుల ఆక్రమణలపై దర్యాప్తు జరపడానికి సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని జేడీఎస్ ధర్నా చేపట్టింది. ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే సభ ద్రవ్య వినియోగ బిల్లును ఆమోదించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బీజేపీ తీరుపై విరుచుకు పడ్డారు. జగదీశ్ శెట్టర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2013 ఫిబ్రవరి 12న బీజేపీ ప్రభుత్వం 541 ఎకరాల ప్రభుత్వ భూమిని డీనోటిఫై చేసిందని ఆరోపించారు. బీజేపీ హయాంలో కాంగ్రెస్ 20 సందర్భాల్లో సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసినప్పటికీ తిరస్కరించారని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున, ఆ పార్టీ ఇక్కడ సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప సభను భోజన విరామం కోసం వాయిదా వేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు బీజేపీ ధర్నా కొనసాగడంతో డిప్యూటీ స్పీకర్ శివశంకర రెడ్డి గంట సేపు వాయిదా వేశారు. అంతకు ముందు మూడు సవరణ బిల్లులను సభ ఆమోదించింది. తిరిగి ఆరు గంటలకు సభ సమావేశమైనప్పుడు కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్పీకర అర గంట పాటు వాయిదా వేశారు. తిరిగి ఏడు గంటలకు సమావేశమైనప్పుడు కూడా బీజేపీ ధర్నా కొనసాగడంతో నిరవధికంగా వాయిదా వేశారు.