ఢీ అంటే ఢీ
- డీనోటిఫికేషన్‌పై పట్టు వీడని బీజేపీ
- ఆరోపణపై సీబీఐతో దర్యాప్తునకు డిమాండ్
- న్యాయ విచారణ చేయిస్తామని సీఎం ప్రకటన
- సమ్మతించని విపక్షాలు.. సాగని సభ
- ధర్నా మధ్యే ద్రవ్య వినియోగ బిల్లుకు ఆమోదం
- శాసన సభ నిరవధిక వాయిదా
నగరంలోని అర్కావతి లేఔట్‌లో బీడీఏ భూముల డీనోటిఫికేషన్‌కు సంబంధించి వచ్చిన ఆరోపణలపై సీబీఐతో దర్యాప్తునకు బీజేపీ పట్టు వీడలేదు. పోడియం వద్ద సోమవారం కూడా ధర్నా చేపట్టింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శాసన సభలో ప్రకటించినా సమ్మతించలేదు. 2003లో 3,839 ఎకరాలకు ప్రాథమిక నోటిఫికేషన్ వెలువరించినప్పటి నుంచి ఇటీవల హైకోర్టుకు సవరణ మార్పుల పథకాన్ని సమర్పించినంత వరకు విచారణ జరుగుతుందని సీఎం చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే సభ ద్రవ్య వినియోగ, మూడు సవరణ బిల్లులను కాంగ్రెస్ ఆమోదించుకోవడంపై విపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ ధర్నా కొనసాగడంతో సభను నిరవధికంగా వాయిదా వేశారు.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని అర్కావతి లేఔట్‌లో బీడీఏ భూముల డీనోటిఫికేషన్‌కు సంబంధించి వచ్చిన ఆరోపణలపై న్యాయ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం శాసన సభలో వెల్లడించారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి విచారణ జరుపుతారని తెలిపారు. 2003లో 3,839 ఎకరాలకు ప్రాథమిక నోటిఫికేషన్ వెలువరించినప్పటి నుంచి ఇటీవల హైకోర్టుకు సవరణ మార్పుల పథకాన్ని సమర్పించినంత వరకు విచారణ జరుగుతుందని చెప్పారు.
ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష బీజేపీ, ఇటీవల 541 ఎకరాల బీడీఏ భూముల డీనోటిఫికేషన్‌పై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలన్న తన డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. శనివారం చేపట్టిన ధర్నాను కొనసాగించింది. సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఇందులో భారీ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించింది. అయితే సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం తిరస్కరించింది. అర్కావతి లేఔట్ కోసం సేకరించిన 541 ఎకరాల భూమిని హైకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వం డీనోటిఫై చేసిందని ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ ఆరోపించారు.
డీనోటిఫికేషన్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోక్యం ఉందని ఆరోపిస్తూ బీజేపీ సభ్యులు ధర్నాను కొనసాగించారు. మరో వైపు నగరంలో చెరువుల ఆక్రమణలపై దర్యాప్తు జరపడానికి సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని జేడీఎస్ ధర్నా చేపట్టింది. ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే సభ ద్రవ్య వినియోగ బిల్లును ఆమోదించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బీజేపీ తీరుపై విరుచుకు పడ్డారు. జగదీశ్ శెట్టర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2013 ఫిబ్రవరి 12న బీజేపీ ప్రభుత్వం 541 ఎకరాల ప్రభుత్వ భూమిని డీనోటిఫై చేసిందని ఆరోపించారు. బీజేపీ హయాంలో కాంగ్రెస్ 20 సందర్భాల్లో సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసినప్పటికీ తిరస్కరించారని గుర్తు చేశారు.
ఇప్పుడు కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున, ఆ పార్టీ ఇక్కడ సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప సభను భోజన విరామం కోసం వాయిదా వేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు బీజేపీ ధర్నా కొనసాగడంతో డిప్యూటీ స్పీకర్ శివశంకర రెడ్డి గంట సేపు వాయిదా వేశారు.
అంతకు ముందు మూడు సవరణ బిల్లులను సభ ఆమోదించింది. తిరిగి ఆరు గంటలకు సభ సమావేశమైనప్పుడు కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్పీకర అర గంట పాటు వాయిదా వేశారు. తిరిగి ఏడు గంటలకు సమావేశమైనప్పుడు కూడా బీజేపీ ధర్నా కొనసాగడంతో నిరవధికంగా వాయిదా వేశారు.