
ధన్‌బాద్/రాంచీ: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్ జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ మృతి కేసుకు సంబంధించి పోలీసులు 243 అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతోపాటు, 17 మందిని అరెస్టు చేశాయి. మరో 250 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ ఎస్‌పీ సంజీవ్ కుమార్ సోమవారం వెల్లడించారు. జడ్జి మృతి ఘటన దృశ్యాలున్న సీసీటీవీ ఫుటేజీని బహిర్గతం చేయడం తదితర కారణాలతో ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఘటనపై ఏర్పాటైన సిట్ బృందం..వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం దాడులు నిర్వహించి 243 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతోందన్నారు.
జిల్లాలోని 53 హోటళ్లలో సోదాలు జరిపి, జడ్జి మృతికి సంబంధమున్న 17 మందిని అరెస్టు చేసి, కేసులు పెట్టామన్నారు. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన సమయంలో జడ్జిని ఢీకొట్టిన ఆటోను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామంటూ ఆయన..ప్రత్యేకంగా చేపట్టిన డ్రైవ్‌లో ఎటువంటి పత్రాలు లేని 250 ఆటోలను పట్టుకున్నట్లు వివరించారు. మృతి ఘటన సీసీ టీవీ ఫుటేజీని బహిర్గత పరిచినందుకు పోలీస్ సబ్ ఎన్‌స్పెక్టర్ ఆదర్శ్ కుమార్‌ను, ఆటో చోరీ ఫిర్యాదుపై రెండు రోజుల తర్వాత కేసు నమోదు చేసినందుకు గాను పథర్ది పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ఉమేశ్ మాంఝిని సస్పెండ్ చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు గురువారం ఆటో డ్రైవర్ లఖన్ వర్మ, అతని సహాయకుడు రాహుల్ వర్మను అరెస్ట్ చేశారు. కాగా, జడ్జి మృతిపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment