Jagdish settar
-
ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరతారు
యడ్యూరప్ప వెల్లడి సాక్షి, బెంగళూరు (కలబుర్గి): ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరడం ఖాయమని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప తెలిపారు. కలబుర్గిలో శనివారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. కాగా, కృష్ణకు బీజేపీలో ఉన్నత స్థానాన్ని కల్పించనున్నట్లు అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత జగదీశ్ శెట్టర్ తెలిపారు. తెలివైన నాయకులు ఎవరూ కాంగ్రెస్‌లో ఉండబోరని ఎంఎస్కృష్ణ అంశాన్ని ఉద్దేశించి కేంద్రమంత్రి వెంకయ్య బెంగళూరులో వ్యాఖ్యానించారు. ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది నేతలు కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో చేరారని పేర్కొన్నారు. -
మరో వివాదంలో సిద్ధు
కుమారుడి ద్వారా శాంత ఇండస్ట్రీస్‌కు రూ.150 కోట్ల విలువైన భూమి ధారదత్తం ఆధారాలను బయటపెట్టిన ఆర్టీఐ కార్యకర్త సంకటస్థితిలో సిద్దు బెంగళూరు: పుత్ర వాత్సల్యానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మరో బాంబు పడింది. తన కుమారుడి కోసం ఆయన రూ.150 కోట్ల మేర విలువైన బీడీఏ భూమిని ధారాదత్తం చేశారన్న వార్తలు సీఎం సిద్ధరామయ్యను మరింత చిక్కుల్లో పడేశాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను బెంగళూరుకు చెందిన ఆర్టీఐ కార్యకర్త కోదండరామ్ గురువారం సాయంత్రమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నగరంలోని మహాలక్ష్మీ లే అవుట్లో సర్వే నెంబర్ 174, 175లోని శాంత ఇండస్ట్రీస్ అనే సంస్థకు చెందిన భూమిని 1977లో బీడీఏ స్వాధీనం చేసుకుంది. ఆ భూమికి పరిహారం కూడా ఇస్తామని తెలిపింది. అయితే ఇందుకు నిరాకరించిన శాంత ఇండస్ట్రీస్ సంస్థ ఆ స్థలానికి బదులుగా మరో ప్రాంతంలో తమకు స్థలాన్ని కేటాయించాల్సింగా కోరుతూ వస్తోంది. ఈ విషయంపై సదానందగౌడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత జగదీష్ శెట్టర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బీడీఏలో విన్నవించారు. అయితే అప్పటి న్యాయనిపుణులు శాంత ఇండస్ట్రీస్ విన్నపం భూస్వాధీన న్యాయసూత్రాలకు విరుద్ధమని తేల్చి చెప్పారు. దీంతో శాంత ఇండస్ట్రీస్ ఫైల్ అక్కడితో ఆగిపోయింది. అయితే సీఎం సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర తన స్నేహితుడైన రాజేష్గౌడ శాంత ఇండస్ట్రీస్‌లో భాగస్వామిగా చేరారు. దీంతో మూలన పడిన ఈ శాంత ఇండస్ట్రీస్ ఫైల్ వేగంగా కదిలింది. హెబ్బాళలోని 2.19 ఎకరాల స్థలాన్ని బీడీఏ ద్వారా ఉచితంగా 2016 జనవరిలో కట్టబెట్టారు. తద్వారా రూ.150 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా పొందారు’ అని కోదండరామ్ వెల్లడించారు. ఈ విషయంపై ఈనెల 5న ఏసీబీకి సైతం ఫిర్యాదు చేసినట్లు కోదండరామ్ తెలిపారు. ఇదిలా ఉండగా రాజేష్గౌడ డెరైక్టర్‌గా ఉన్న మ్యాట్రిక్స్ సంస్థలో సిద్ధరామయ్య కుమారుడైన డాక్టర్ యతీంద్ర డెరైక్టర్‌గా చేరడం, అదే మ్యాట్రిక్స్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసే కాంట్రాక్టును కట్టబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇలా యతీంద్ర భాగస్వామిగా ఉన్న సంస్థలకు సిద్ధరామయ్య ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వందల కోట్ల విలువ చేసే భూములను, కాంట్రాక్టులను కట్టబెడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. -
గొంతులు కూడా తడపలేరా?
= గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వ వైఫల్యం = నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలన్న విపక్షనేత శెట్టర్ బెంగళూరు: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కేంద్రాలను మార్చి చివరిలోగా ఏర్పాటు చేస్తామన్న తన హామీని నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విపక్షనేత జగదీష్ శెట్టర్ మండిపడ్డారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి హెచ్.కె.పాటిల్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో బుధవారం జరిగిన చర్చా కార్యక్రమంలో జగదీష్ శెట్టర్ మాట్లాడారు. ‘గ్రామీణ ప్రాంత వాసుల దాహార్తిని తీర్చేందుకు ఏడు వేల తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, లేదంటే పదవికి రాజీనామా చేస్తానని గత ఏడాది మీరే చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 1,500తాగునీటి కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేయగలిగారు. మీకే మాత్రం నైతికత ఉన్నా ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయండి’ అంటూ డిమాండ్ చేశారు. ‘ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు, మీకూ మధ్య అభిప్రాయ బేధాలున్నాయో లేక నిధులు విడుదల కాలేదో! అవేవీ మాకు తెలియదు. మాకు కేవలం ఫలితాలే ముఖ్యం’ అని జగదీష్ శెట్టర్ పేర్కొన్నారు. అనంతరం మంత్రి హెచ్.కె.పాటిల్ మాట్లాడుతూ.... రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల తాగునీటి కేంద్రాల స్థాపనకు టెండర్లను పిలిచామని, అయితే అధికారుల లోపం, కాంట్రాక్టర్ల తప్పుల కారణంగా 4000 కేంద్రాలకు సంబంధించిన టెండర్లను తిరస్కరించామని వివరించారు. ఈ కేంద్రాల స్థాపనకు సంబంధించి మరో సారి టెండర్లను పిలవాల్సి రావడంతో ఈ ప్రక్రియ కాస్తంత ఆలస్యమైందని పేర్కొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ అక్రమాలపై దర్యాప్తుకు.. సీబీ‘ఐ’.
బెంగళూరు : రాష్ట్రంలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ అక్రమాలకు సంబంధించి సీబీఐతో విచారణ చేయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని విధానసభలో రాష్ట్ర హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ ప్రకటించారు. సభాకార్యక్రమాల్లో భాగంగా విపక్షనాయకుడు జగదీష్ శెట్టర్ శాసనసభలో శుక్రవారం ప్రస్తావించిన విషయానికి సంబంధించి జార్జ్ స్పందిస్తూ రాష్ట్రంలో క్రికెట్ బెట్టింగ్ హుబ్లీ, ధార్వాడలకు మాత్రమే పరిమితం కాలేదని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా జరుగుతోందన్నారు. గతంలో బాంబే, ఢిల్లీ వంటి పెద్దపెద్ద నగరాలకు, పట్టణాలకు పరమితమైన ఈ బెట్టింగ్ ఇటీవల చిన్నచిన్న గ్రామాలకు సైతం వ్యాపించడం కలవరపెడుతోందని అన్నారు. హుబ్లీలో క్రికెట్ బెట్టింగ్ బయటకు వచ్చిన వెంటనే ఈ అక్రమ దందాలో భాగస్వాములుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డీసీపీ, కానిస్టేబుల్స్‌తో పాటు పలువురు హోంశాఖ సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రభుత్వం క్రికెట్ బెట్టింగ్‌పై ఉదాసీనతతో వ్యవహరించబోదన్నారు. అయితే ఈ విషయంలో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. కేవలం ప్రచారం కోసమే కొంత మంది రాజకీయ నాయకులు ఈ క్రికెట్ బెట్టింగ్‌ను పట్టుకుని వేలాడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో అధికార, విపక్ష నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్పీకర్ కాగోడు తిమ్మప్ప కల్పించుకుని పరిస్థితిని సరిదిద్దారు. కాగా, అంతకు ముందు శెట్టర్ మాట్లాడుతూ...‘క్రికెట్ బెట్టింగ్ విషయంలో రాష్ట్రంలోని చాలా మంది సీనియర్ పోలీసు అధికారులకు భాగస్వామ్యం ఉంది. ఈ విషయంలో నిస్పక్షపాత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది.’ అని శాసనసభలో పేర్కొన్నారు. -
ఏం సాధించారని సాధన సమావేశాలు: జగదీష్
బెంగళూరు: రెండేళ్లలో అసలు ఏం సాధించారని కాంగ్రెస్ నేతలు సాధన సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ మండిపడ్డారు. శనివారం ఇక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇంతటి నిర్లక్ష్య, నిర్లిప్త ప్రభుత్వాన్ని తన జీవితంలో చూడనే లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ‘సర్వోదయ’ పేరుతో సమావేశాన్ని నిర్వహించడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. తమకెంతో మేలు చేస్తారని వెనకబడిన వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే, అయితే వారి ఆశలన్నింటినీ సిద్ధరామయ్య తుంచివేశారని ఆరోపించారు. సిద్ధరామయ్య అధికారాన్ని చేపట్టాక పాలనా వ్యవహారాల్లో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, ఇసుక, గనుల మాఫియాలు ప్రభుత్వ అధికారులనే బెదిరించే స్థాయికి చేరుకున్నాయని విమర్శించారు. రాష్ట్రంలోని రైతులు ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లేక కన్నీరుపెట్టే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇవన్నీ ఏవీ పట్టించుకోకుండా కేవలం రెండేళ్లు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడమే పెద్ద ఘనకార్యం అన్నట్లు సిద్దరామయ్య సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదమని జగదీష్ శెట్టర్ పేర్కొన్నారు. -
ప్రజలకు దక్కింది ‘ప్రకటనల భాగ్య’
ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ విమర్శలు సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ బడ్జెట్లో ప్రజలకు అవసరమైన ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రకటించలేదని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ విమర్శించారు. ప్రభుత్వం గత బడ్జెట్లో ప్రకటించిన సంక్షేమ పథకాలు సైతం కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యాయని, తద్వారా రాష్ట్ర ప్రజలకు కేవలం ‘ప్రకటనల భాగ్య’ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దక్కిందని ధ్వజమెత్తారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విధానసభలో మంగళవారం జరిగిన చర్చా కార్యక్రమంలో జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ.... రాష్ట్రంలోని ప్రజలందరికి సమాన న్యాయం అందజేయడమే తమ లక్ష్యమన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏ వర్గం వారికి సంక్షేమ పథకాలను ప్రకటించకుండా సమాన న్యాయం పాటించారని వ్యంగ్య మాడారు. వెనక బడిన వర్గాలకు చెందిన ప్రజలకు విద్య, ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను పెంచే విషయంలో ఏమాత్రం శ్రద్ధ వహించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తోందని విమర్శించారు. గత ఏడాది బడ్జెట్లో వ్యవసాయానికి చేసిన కేటాయింపుల కంటే ఈ ఏడాది కేటాయింపులను మరిం తగా తగ్గించి రైతులను సైతం నిర్లక్ష్యం చేశారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. -
‘బీజేపీ ముక్త కర్ణాటక’ సిద్ధుకు కలే...
మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ బెంగళూరు : బీజేపీ ముక్త కర్ణాటక అనేది ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కలగానే మిగిలిపోతుందని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ పేర్కొన్నారు. శనివారమిక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. 2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని తెలిపారు. తమ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదాన్ని ప్రకటించిందని, అదే విధంగా కాంగ్రెస్ ముక్త కర్ణాటక కోసం బీజేపీ రాష్ట్ర నేతలు కలిసికట్టుగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే తమ నినాదం నిజం కూడా కానుందని అన్నారు. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం తన ఖాతాను సైతం తెరవలేకపోయిందని విమర్శించారు. అలాంటిది 2018లో కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామనుకోవడం కాంగ్రెస్ నేతల పగటి కల అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తప్పక విజయాన్ని సాధిస్తుందని జోష్యం చెప్పారు. -
... ఆ బిల్లు వెనక్కు
చివరి రోజు విధానసభలో ఆర్కావతి వేడి బెంగళూరు: నూతన సంవత్సరానికి సంబంధించిన మొదటి అసెంబ్లీ సమావేశాల చివరి రోజున కర్ణాటక హిందూ ధార్మిక సంస్థల నియంత్రణ(సవరణ) బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. బెళగావిలో జరిగిన శీతాకాల సమావేశాల్లో రాష్ట్రంలోని మఠాలపై నియంత్రణను పొందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లుపై రాష్ట్రంలోని వివిధ మఠాధిపతులు, విపక్షాలతో పాటు స్వపక్షం నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తడంతో ఈ సమావేశాల్లో బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. శాసనసభ కార్యకలాపాల్లో భాగంగా శుక్రవారం రోజున విధానసభలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర ఈ బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో అన్ని పక్షాలు ఇందుకు అంగీకారం తెలిపాయి. ఇక శుక్రవారం రోజున సైతం విధానసభలో ఆర్కావతి వాగ్యుద్ధం కనిపించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రతిపక్ష నాయకుడు జగదీష్ శెట్టర్‌ల మధ్య ఆర్కావతి అంశానికి సంబంధించి ఆరోపణలు, ప్రత్యారోపణలతో విధానసభ దద్దరిల్లింది. గవర్నర్ ప్రసంగానికి కృతజ్ఞతలు తెలియజేయడంపై జరుగుతున్న చర్చ సందర్భంలో ఆర్కావతి అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం ప్రారంభమైంది. దీంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప సభను సాయంత్రం 4గంటలకు వాయిదా వేశారు. అనంతరం సభా కార్యక్రమాలు సాయంత్రం 7గంటల వరకు కొనసాగాయి. వివిధ అంశాలపై చర్చ కొనసాగిన అనంతరం స్పీకర్ కాగోడు తిమ్మప్ప అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు. -
దద్దరిల్లిన అసెంబ్లీ
చెరుకు రైతులకు బకాయిపై ప్రభుత్వాన్ని నిలదీసిన విపక్షాలు రెండేళ్లుగా బకాయిలు చెల్లించ లేదని మండిపాటు నెలలోపు బకాయిలు చెల్లిస్తామన్న మంత్రి డీకేశి బెంగళూరు : రైతాంగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ విపక్షాలు మండిపడ్డాయి. రెండేళ్లుగా చెరుకు రైతులకు బకాయిలు చెల్లించకపోవడంపై నిప్పులు చెరిగాయి. దీంతో గురువారం అసెంబ్లీ కార్యకలాపాలు దద్ధరిల్లాయి. ఈ నేపథ్యంలో ఏర్పడిన గందరగోళాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు సభను ఏకంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాసనసభలో గురువారం సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే విపక్ష నేత జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ... చెరుకు రైతులకు చక్కెర కర్మాగారాల యజమానులు రెండేళ్లుగా బకాయిపడ్డారని, ఈ మొత్తాన్ని చెల్లించడంలో యాజమాన్యలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. దీంతో కుటుంబ పోషణ భారమైన అన్నదాతలు రోడ్డుపై చేరుకుని ఆందోళనలు చేపట్టాల్సిన దుర్గతిని ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. చక్కెర కర్మాగారాల యజమానుల నుంచి చెరుకు రైతులకు రూ.1,700 కోట్లు అందాల్సి ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో శెట్టర్ వాదనలకు బీజేపీతో పాటు పలువురు జేడీఎస్ సభ్యులు మద్దతు పలికారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.శివమూర్తి జోక్యం చేసుకుంటూ బీజేపీకి చెందిన ప్రభాకర్‌కోరే, మురుగేష్ నిరాణి, ఉమేష్ కత్తిలాంటి వారే రైతులకు రూ. కోట్లు బకాయి ఉన్నారని ఆరోపించారు. చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీసే బదులు వారి నుంచి రైతుల బకాయిలు ఇప్పించవచ్చు గదా అని హితవు పలికారు. శివమూర్తి వాదనకు అధికార పక్షం సభ్యులు గొంతు కలిపారు. దీంతో సభలో వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో సభను పదిహేను నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ స్థానంలో ఉన్న శివశంకర్‌రెడ్డి ప్రకటించారు. నెలలోపు బాకీ మొత్తం చెల్లిస్తాం అనంతరం సభ ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టాయి. దాదాపు పది నిమిషాల పాటు ఈ పర్వం కొనసాగింది. అనంతరం ఇంధన శాఖ మంత్రి డీ.కే శివకుమార్ మాట్లాడుతూ....‘నెల లోపు రైతుల బాకీ మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తాం. చెరుకు కర్మాగారాల్లో నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇందుకు వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెరుకు రైతులకు అందజేస్తాం. ఈ మొత్తం ప్రక్రియ ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది.’ అని స్పష్టం చేశారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందిన విపక్షాలు ధర్నాను విరమించుకున్నాయి. -
హాస్యాస్పదం!
డీ నోటిఫికేషన్‌పై సీఎంని నిలదీసిన శెట్టర్ మొరాయించిన మైకులు పది నిమిషాల పాటు సభ వాయిదా బెంగళూరు : రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక్క ఇంచు భూమి కూడా డీనోటిఫై చేయలేదని చెప్పడం హాస్యాస్పందంగా ఉందని విపక్ష నేత జగదీష్ శెట్టర్ ఎద్దేవా చేశారు. శాసనసభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ... అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్కావతికి సంబంధించిన భూములే కాకుండా మరో మూడు ప్రాంతాల్లోని భూములను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డీనోటిఫై చేశారని తెలిపారు. ‘లాల్‌బాగ్‌కు దగ్గరగా ఉన్న సిద్ధపుర ప్రాంతంలో 2.39 ఎకరాలను, బనశంకరి 6, 5వ క్రాస్‌లో వరుసగా 7.15 ఎకరాలు, 2.6 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా సిద్ధరామయ్య డీ నోటిఫై చేశారు. అప్పటి ఐఏఎస్ అధికారి సత్యమూర్తి ఈ అక్రమాల్లో భాగస్వామి’ అని వివరించారు. ఈ మూడు చోట్ల డీ నోటిఫికేషన్‌కు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరగాలని శెట్టర్ డిమాండ్ చేశారు. ఆర్కావతి డీ నోటిఫికేషన్‌కు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్న న్యాయమూర్తి కెంపణ్ణ కమిషన్ అడిగిన దాఖలాలను ఫిబ్రవరి చివరిలోపు ప్రభుత్వం అందజేయాలని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. మొరాయించిన మైక్ జగదీష్ షెట్టర్ ప్రసంగించే సమయంలో పదేపదే మైక్ మొరాయించింది. అదేవిధంగా జేడీఎస్ ఫ్లోర్‌లీడర్ కుమారస్వామి మాట్లాడే సమయంలో కూడా మైక్ సరిగా పనిచేయలేదు. దీంతో స్పీకర్ పదినిమిషాల పాటు శాసనసభను వాయిదా వేయాల్సి వచ్చింది. -
ఇరుకున పెట్టడమే లక్ష్యంగా...
బెంగళూరు : ప్రభుత్వాన్ని ఇరకున పెట్టడమే లక్ష్యంగా ప్రధాన విపక్షమైన బీజేపీ తన చర్యలను ముమ్మరం చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరు తెన్నులపై చర్చించేందుకు గాను బెంగళూరులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం రాత్రి ఆ పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యంగా ఆర్కావతి డీనోటిఫికేషన్, కేపీఎస్సీ అధ్యక్ష సిఫారసులు, చెరుకు రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఈ సమావేశంలో నేతలు నిర్ణయించారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి, శాసనసభ పక్ష నేత జగదీష్ శెట్టర్ , కేఎస్, ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు. -
సీఎంపై కమలం సమరం !
బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ప్రధాన విపక్షమైన భారతీయ జనతా పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. అర్కావతి డీ నోటిఫికేషన్ ప్రధాన అస్త్రంగా సమరానికి సిద్ధమవుతోంది. శాసనసభ విపక్ష నాయకుడు జగదీష్ శెట్టర్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు ప్రహ్లాద్ జ్యోషి, ఎమ్మెల్యే సురేష్‌కుమార్, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సోమణ్ణ, తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... నిబంధనలకు విరుద్ధంగా సిద్ధరామయ్య అర్కావతి డీ నోటిఫికేషన్ చేశారని, ఈ విషయంపై కేసు దాఖలు చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా బీజేపీ శాసనసభ్యులు గవర్నర్ వజుభాయ్ రుడాబాయ్ పటేల్‌ను కోరనున్నారు. అంతకుముందు డీ నోటిషికేషన్‌కు సంబంధించిన దాఖలాలు అన్నీ ఆయనకు ఇవ్వనున్నారు. డీ నోటిఫికేషన్‌కు సంబంధించి దాదాపు రూ.900 కోట్ల అక్రమాలు జరిగాయని, దీనిపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థల ద్వారా విచారణ జరిపించాల్సిందిగా హైకోర్టును కూడా ఆశ్రయించాలని కమలనాథు లు భావిస్తున్నారు. ఈ విషయమై న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు. ఇప్పటికే బీజేపీ పెద్దలు డీ నోటిఫికేషన్ తర్వాత అక్కడ సామాజికంగా, ఆర్థికంగా జరిగిన అభివృద్ధి, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణాలకు సంబంధించిన విషయాలను ప్రముఖ సర్చ్ ఇంజన్ ద్వారా దా ఖలాలు రాబట్టారు. ఈ నిర్మాణాలు ఎవరెవరి పేరుపై ఉన్నాయన్న విషయం కూడా కూపీలాగారు. ఈ విషయాలన్నింటినీ పార్టీ ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి అనుమతి పొం దారు. పండుగ తర్వాత ఎప్పుడైనా గవర్నర్ అనుమతి పొంది అర్కావతి ఢీ నోటిఫికేషన్ ఆధారంగా సిద్ధరామయ్యపై న్యాయపోరాటం చేయడానికి కమల నాథులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. -
సిద్ధూ వేస్ట్..
ఆయనో అసమర్థ ముఖ్యమంత్రి చెరుకు రైతుకు అందని మద్దతు ధర దివాళా దిశగా రాష్ట్ర ఆర్థిక స్థితి కరువు బాధితులను ఆదుకోవడం పూర్తిగా విఫలం మాజీ సీఎం, ఎంపీ యడ్యూరప్ప ధ్వజం సాక్షి,బెంగళూరు : రాష్ట్రంలో పాలన గాడితప్పిందని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసమర్థతే అందుకు కారణమని మాజీ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యుడు యడ్యూరప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హుబ్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బెల్గాంలో గతంలో జరిగిన శీతాకాల శాసనసభ సమావేశాల్లో ప్రకటించిన చెరుకు మద్దతు ధర ఇప్పటికీ రైతులకు అందలేదన్నారు. మొదట ఆ బాకీ మొత్తాన్ని చెల్లించిన తర్వాతే సిద్ధరామయ్య త్వరలో జరగబోయే బెల్గాం చట్టసభల్లో పాల్గొనాలని ఘాటు వాఖ్యలు చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో పన్నుల వసూలులో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుండటంతో అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడుతోందని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళాతీసే స్థితిలో ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో రాష్ట్రం అభివృద్ధిలో తిరోగమనంలో ప్రయాణిస్తోందని విమర్శించారు. అతివృష్టి వల్ల పంటలు, పశువులు, ఇళ్లను కోల్పోయిన రైతులను, ప్రజలను ఆదుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. కరువు తాలూకాలు ప్రకటనకు మాత్రమే పరిమితమయ్యాయని తెలిపారు. కరువు ప్రాంతాల్లో ప్రజలకు మేలుచేకూరే పనులు ఒక్కటి కూడా జరగడం లేదని విమర్శించారు. అధికారులపై తరుచుగా ఆగ్రహం వ్యక్తం చేసే బదులు వారి ఆలోచనలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని యడ్యూరప్ప సీఎం సిద్ధరామయ్యకు సలహా ఇచ్చారు. ఇదే సమయంలో శాసనసభ ప్రతిపక్ష నాయకుడు జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో జలాశయాలు దాదాపు గరిష్ట నీటిమట్టాన్ని కలిగి ఉండి అందుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా కూడా ప్రజలు విద్యుత్ కోతలు ఎదుర్కొంటుండటం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. ఇందుకు ప్రజలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఇంధనశాఖ మంత్రి డీకే శివకుమార్ సమాధానం చెప్పితీరాలని శెట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సమర సన్నాహాలు
అర్కావతిపై న్యాయ పోరాటం చేయాలని బీజేపీ నిర్ణయం సీఎం ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి కోరాలని తీర్మానం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని అర్కావతి లేఔట్ డీనోటిఫికేషన్ వ్యవహారంపై న్యాయ పోరాటం చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి తెలిపారు. మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీనోటిఫికేషన్‌పై ఇప్పటి వరకు సాగుతున్న ఆందోళనకు కొనసాగింపుగా న్యాయ పోరాటం చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్‌ను కోరాలని నిర్ణయించినట్లు కూడా చెప్పారు. ఇప్పటికే దీనిపై రాజకీయ పోరాటం సాగుతున్నదని గుర్తు చేశారు. డీనోటిఫికేషన్ వ్యవహారంపై పరిశీలన జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సురేశ్ కుమార్ నాయకత్వంలో కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. న్యాయ పోరాటానికి అవసరమైన డాక్యుమెంట్లను సేకరించాల్సిందిగా కూడా కమిటీకి సూచించామని చెప్పారు. మేయర్ అభ్యర్థిపై చర్చ బీబీఎంపీకి కొత్త మేయర్, ఉప మేయర్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే విషయమై సమావేశంలో చర్చించామని జోషి తెలిపారు. అభ్యర్థుల విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. కాగా కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రులు అనంత కుమార్, డీవీ. సదానంద గౌడ, మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ యడ్యూరప్ప, శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రులు కేఎస్. ఈశ్వరప్ప, ఆర్. అశోక్‌లు పాల్గొన్నారు. -
సీఎంకు జైలు ఖాయం
అర్కావతి లేఔవుట్ దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తే... రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి సాక్షి, బళ్లారి : అర్కావతి లే అవుట్లో చోటు చేసుకున్న అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు జైలు శిక్ష తప్పదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి జోష్యం చెప్పారు. బళ్లారిలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్కావతి లే అవుట్ అక్రమాలపై తమ వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ విపక్షనేత జగదీష్ శెట్టర్ పేర్కొంటున్నప్పటికీ సీబీఐ దర్యాప్తునకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. వాస్తవాలు వెలుగు చూస్తే తనకు జైలు శిక్ష తప్పదని తెలుసుకునే సీబీఐ దర్యాప్తునకు ముఖ్యమంత్రి వెనుకంజ వేస్తున్నారని ఎద్దేవా చేశారు. తన కుమారుడితో ఇసుక మాఫియాను నడుపుతున్న ముఖ్యమంత్రికి ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే అర్హత లేదని అన్నారు. ఉప ఎన్నికల సందర్భంగా బళ్లారిలో అధికారదుర్వినియోగానికి తెరలేపారని మండిపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టడం ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు చేయాలంటూ ఓటర్లకు జగదీష్ శెట్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సదానందగౌడ, అనంత్‌కుమార్, బళ్లారి ఎంపీ శ్రీరాములు, కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి, బళ్లారి మాజీ ఎంపీ శాంత, మాజీ మేయర్ ఇబ్రహీంబాబు పాల్గొన్నారు. -
2020 నాటికి 40 లక్షల ఐటీ ఉద్యోగాలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రస్తుతం ఐటీ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మంది ఉపాధి పొందుతుండగా, 2020 నాటికి ఈ సంఖ్య రెండింతలు కానుందని ఐటీ, బీటీ శాఖ మంత్రి ఎస్ఆర్. పాటిల్ వెల్లడించారు. ఐటీ, బీటీ రంగంలో కొత్త పరిణామాల గురించి తెలియజేయడానికి మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ఐటీ ఎగుమతుల్లో మూడో వంతు కర్ణాటక నుంచే సాగుతోందని తెలిపారు. గత ఏడాది రూ.1.65 లక్షల ఐటీ ఎగుమతులు జరిగాయని చెబుతూ, 16 నుంచి 17 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించామని గుర్తు చేస్తూ, కెంగేరి, శివాజీ నగర, జయ నగర, బనశంకరి, విజయనగర బస్సు స్టేషన్లకు కూడా ఇటీవల ఈ సదుపాయాన్ని విస్తరించామని చెప్పారు. ఏడాదిలోగా మొత్తం బెంగళూరుతో పాటు జిల్లా కేంద్రాలకు ఈ సదుపాయాన్ని విస్తరించదలిచామని వెల్లడించారు. దీనిపై ఆసక్తి కలిగిన కంపెనీలను ఆహ్వానించగా, ఆరు సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు, ఇతర ప్రక్రియలను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కాగా పారిశ్రామికాసక్తి, నవ కల్పనలను ప్రోత్సహించడానికి మైసూరు, తుమకూరు, గుల్బర్గ, ధార్వాడ, బిజాపుర, బాగలకోటె, ఉడిపి, బెల్గాం, శివమొగ్గల్లోని తొమ్మిది ఇంజనీరింగ్ కళాశాలకు కొత్త తరం ఇన్క్యుబేషన్ సెంటర్లను మంజూరు చేశామని తెలిపారు. ఈ కేంద్రాలకు మూడేళ్ల పాటు రూ.40 లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని వెల్లడించారు. తమ అనుభవాలను, బోధనలను పంచుకోవడానికి ఈ కేంద్రాలన్నిటినీ అనుసంధానం చేస్తామని కూడా చెప్పారు. యువతకు ప్రయోజనం కలిగే విధంగా నైపుణృ్య అభివద్ధికి పలు కార్యక్రమాలను చేపట్టే దిశగా సాగుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. నగరంలోని ఎలక్ట్రానిక్స్ సిటీలో రూ.80 కోట్ల వ్యయంతో ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. ఇందులో కేంద్రం రూ.50 కోట్లు సమకూరుస్తుందన్నారు. మైసూరులో కూడా రూ.30 కోట్ల వ్యయంతో ఇలాంటి క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. తప్పు చేయకపోతే భయమెందుకు? విపక్ష బీజేపీ నేత జగదీష్ శెట్టర్ సవాల్ విసిరారు. బళ్లారి శివారులోని సంగనకల్లులో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 542 ఎకరాలకు సంబంధించిన అర్కావతి లే ఔట్లో ఎకరం రూ. 15 కోట్లకు పైబడి ధర పలుకుతోందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన 14 నెలలకు సంబంధించి బళ్లారి జిల్లా, రాష్ట్రంలో చేపట్టిన అభిృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బళ్లారికి సోనియా గాంధీ ప్రకటించిన రూ.33వేల కోట్ల ప్యాకేజీపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. కార్పొరేషన్లకు ప్రతి ఏటా రూ. వంద కోట్లను కేటాయించిన ఘనత బీజేపీకే దక్కుతుందని అన్నారు. కేపీఎస్సీ-11 నియామకాలు రద్దు చేయడం సబబు కాదని అన్నారు. కష్టపడి చదువుకుని ర్యాంకులు తెచ్చుకున్నవారి జీవితాలను బుగ్గిపాలు చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేపీఎస్సీ నియామకాల రద్దు వివాదాన్ని పునఃపరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ డీసీఎం అశోక్, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప, విధాన పరిషత్ సభ్యుడు మృత్యుంజయ జినగ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నేమిరాజ్ నాయక్, మాజీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు విరుపాక్షిగౌడ, జిల్లా బీజేపీ యువమోర్చా నాయకుడు సుధీర్, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మురారీగౌడ పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి : శెట్టర్
సాక్షి, బళ్లారి : బళ్లారి గ్రామీణ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి ఓబుళేసు తరుఫున సోమవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బళ్లారికి వచ్చారు. ఈ సందర్భంగా శెట్టర్‌కు గాలి సోమశేఖరరెడ్డి, బీజేపీ అభ్యర్థి ఓబుళేసు, పలువురు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అల్లీపురం మహాదేవ తాత మఠం నుంచి వినాయకనగర్, కువెంపునగర్, కౌల్‌బజార్, బెళగల్లు క్రాస్, రైల్వే ఫస్ట్ గేట్ తదితర ప్రాంతాల్లో భారీ రోడ్డు షో చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో శెట్టర్ మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు మినహా ఇక్కడ జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. నిత్యం అందుబాటులో ఉండే బీజేపీ అభ్యర్థినే గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు బళ్లారి ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరుఫున పాల్గొనేందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్‌శెట్టర్ వచ్చిన సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం సాయంత్రం ఆయన బెంగళూరు నుంచి నేరుగా బళ్లారి చేరుకుని నగర శివార్లలోని అల్లీపురం నుంచి రోడ్డు షో చేపట్టారు. రోడ్డు షోకు ముందు బీజేపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపడుతుండగా బైక్ ర్యాలీకి అనుమతి పత్రాలు చూపించాలని ఎన్నికల అధికారి నఫీసా అడ్డుకుని, మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో యువకులు బైక్‌ర్యాలీలు జరపడం సహజమేనని, ఇది అన్ని పార్టీలలో జరుగుతుందని గుర్తు చేశారు. అయితే కేవలం బీజేపీని అడ్డుకోవడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, విధాన పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. -
మాజీ సీఎం శెట్టర్‌ను అరెస్టు చేయలేం
ఆధారాలు సేకరించిన తర్వాతే చర్యలు బదిలీ అయిన తర్వాత విలేకరుల సమావేశంలో ఏడీజీపీ ఆర్పీ శర్మ బెంగళూరు : అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ భూములు అనర్హులకు కట్టబెట్టారని ఆరోపిస్తు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్‌పై కేసు నమోదైందని, అయితే ఆయనను అరెస్టు చేయడం లేదని బీఎంటీఎఫ్ (బెంగళూరు మెట్రో పాలిటన్ టాస్క్ ఫోర్స్) చీఫ్, ఏడీజీపీ ఆర్.పీ. శర్మ తెలిపారు. బీఎంటీఎఫ్ చీఫ్ స్థానం నుంచి ఆర్పీ శర్మను బదిలీ చేస్తూ గురువారం పోద్దుపోయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదైన వారందరినీ అరెస్టు చేయాలని నిబంధనలు లేవన్నారు. దర్యాప్తు పూర్తి చేయడానికి ఆరు నెలల సమయం ఉంటుందని చెప్పారు. అన్ని వివరాలు పరిశీలించి ఆధారాలు సేకరించి తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటారన్నారు. బెంగళూరు నగరంలో మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూమి (పోరంబోకు భూములు) అనర్హులకు కట్టబెట్టారని గుర్తు చేశారు. బెంగళూరు దక్షిణ, ఉత్తర విభాగాలలో 1999 నుంచి 2003 సంవత్సరాల మధ్య ఈ అక్రమాలు జరిగాయని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారి పేర్లు చెప్పడం తనకు ఇష్టం లేదని, దర్యాప్తు చేసి నివేదిక సమర్పించినట్లు చెప్పారు. అక్రమంగా భూములు ఎవరు మంజూరు చేశారు అని విలేకరులు ప్రశ్నించగా ప్రభుత్వ భూములను కేటాయించే కమిటీ అధ్యక్షుడిగా స్థానిక శాసన సభ్యుడు ఉంటారని గుర్తు చేశారు. బెంగళూరు ఉత్తర నియోజక వర్గం (అప్పుట్లో, ప్రస్తుతం ఆర్. అశోక్ పద్మనాభనగర నియోజక వర్గం శాసన సభ్యుడు) శాసన సభ్యుడిగా, డిప్యూటి సీఎంగా ఉన్న ఆర్. అశోక్ అక్రమంగా భూములు అనర్హులకు కట్టబెట్టారని పరోక్షంగా చెప్పి విలేకరుల సమావేశం ముగించిన ఆర్పీ శర్మ అక్కడి నుండి వెళ్లిపోయారు. -
ఢీనోటిఫికేషన్
కాంగ్రెస్ పార్టీ నిధుల కోసమేనంటూ బీజేపీ ధ్వజం సీబీఐ దర్యాప్తునకు పట్టు అరుపులతో దద్దరిల్లిన అసెంబ్లీ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసంచేస్తానంటూ సీఎం సవాల్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని అర్కావతి లేఔట్లో 541 ఎకరాల భూమిని డీనోటిఫికేషన్ చేయడంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ ప్రతిపక్ష బీజేపీ శనివారం శాసన సభను స్తంభింపజేసింది. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఈ అంశంపై పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పాలక, ప్రతిపక్ష సభ్యుల అరుపులతో సభ దద్దరిల్లింది. డీనోటిఫికేషన్ వ్యవహారం కోట్ల రూపాయల కుంభకోణం కనుక సీబీఐ చేత దర్యాప్తు చేయించాల్సిందేనని శెట్టర్ పట్టుబట్టారు. గత జూన్ 18న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డీనోటిఫికేషన్‌కు ఆమోదం తెలిపారని ఆరోపించారు. భూసేకరణను విరమించుకోవడం హైకోర్టు ఆదేశాలను ఉల్లఘించడమే అవుతుందని తెలిసినప్పటికీ, సీఎం అంగీకరించారని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే డీనోటిఫికేషన్‌కు సంబంధించిన ఫైల్ తన వద్దకు వచ్చిందని చెప్పారు. అయితే హైకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్నందున తాను అంగీకరించలేదని వెల్లడించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పార్టీ నిధుల కోసం ముఖ్యమంత్రి డీనోటిఫికేషన్‌కు అంగీకరించారని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, 541 ఎకరాల డీనోటిఫికేషన్‌కు సంబంధించి బీడీఏ 2013లోనే తీర్మానాన్ని ఆమోదించిందని, దీనినే ప్రభుత్వానికి కూడా సిఫార్సు చేసిందని వెల్లడించారు. అప్పట్లో సీఎంగా ఉన్న శెట్టర్ తీర్మానం ఆమోదం పొందకుండా ఎందుకు అడ్డుకోలేక పోయారని ప్రశ్నించారు. డీనోటిఫికేషన్‌కు సంబంధించి సిఫార్సులు చేయడానికి బీడీఏ తరఫున అధికారులను కూడా గత బీజేపీ హయాంలోనే నియమించారని గుర్తు చేశారు. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారమే డీనోటిఫికేషన్ జరిగినందున, ఇందులో చట్ట వ్యతిరేకమేదీ లేదని సమర్థించుకున్నారు. వారంలోగా డీనోటిఫికేషన్ చేయకపోతే కోర్టు ధిక్కరణ కేసును నమోదు చేయాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించిందని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో తమకు వేరే ప్రత్యామ్నాయమే లేకుండా పోయిందని వివరణ ఇచ్చారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007, 2010 మధ్య 198 ఎకరాల బీడీఏ భూమిని డీనోటిఫై చేసిన విషయాన్ని గుర్తు చేయడం ద్వారా ముఖ్యమంత్రి బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టడానికి ప్రయత్నించారు. శెట్టర్, యడ్యూరప్ప ప్రభృతులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. కోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి ఉంటే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టం చేశారు. తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాలు విసిరారు. దీనిపై సీఐడీ దర్యాప్తునకు సిద్ధమేనని ప్రకటించారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు సీబీఐ చేత దర్యాప్తు చేయించాలంటూ నినాదాలు చేశారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ సభ్యులు కూడా కేకలు వేశారు. ఇలా అరుపులు, కేకలతో ఎంతకూ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప సభను సోమవారానికి వాయిదా వేశారు. -
మళ్లీ దద్ధరిల్లిన అసెంబ్లీ
అత్యాచార ఘటనపై ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహజ్వాల పాలక, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం బీజేపీ సభ్యుల వాకౌట్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని ఫ్రేజర్ టౌన్లో పీజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచార సంఘటన శాసన సభను రెండో రోజూ కుదిపేసింది. కేసు దర్యాప్తు జరుగుతున్న తీరుపై ప్రతిపక్ష బీజేపీ ప్రభుత్వాన్ని దులిపేసింది. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం చోటు చేసుకుంది. బీజేపీ సభ్యుల ధాటికి పాలక పక్షం ఆత్మ రక్షణలో పడింది. ఈ సంఘటనపై జరుగుతున్న దర్యాప్తు తీరును హోం మంత్రి కేజే. జార్జ్ వివరిస్తున్నప్పుడు బీజేపీ సభ్యులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. వారిని నిలువరించడానికి మంత్రులు టీబీ. జయచంద్ర, కృష్ణ బైరేగౌడ, దినేశ్ గుండూరావు ప్రభృతులు చేసిన ప్రయత్నాలతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు గంటన్నర సేపు సభ హోరెత్తింది. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించడం లేదని ఆరోపించారు. బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వస్తున్నా, వారికి రక్షణ కల్పించడం లేదని విమర్శించారు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు ఇంకా సఫలం కాలేదని దెప్పి పొడిచారు. ఇతర బీజేపీ సభ్యులు కూడా ఆయనకు మద్దతుగా మాట్లాడారు. హోం మంత్రి వారి ఆరోపణలను తిప్పి కొడుతూ, తామీ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, చట్ట రీత్యా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మొత్తం సభ తనకు అధికారాన్ని ధారాదత్తం చేస్తే మీరు చెప్పినట్లే చేస్తానని అన్నారు. బీజేపీ సభ్యుడు కేజీ. బోపయ్య మాట్లాడుతూ... ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించినట్లయితే ఇన్స్పెక్టర్ ఇప్పటికే జైలుకు వెళ్లాల్సి ఉండేదని అన్నారు. మరో బీజేపీ సభ్యుడు అరవింద లింబావళి మాట్లాడుతూ తన నియోజక వర్గంలో ఓ బాలికపై లైంగిక దాడి జరిగిందంటూ విబ్‌గ్యార్ స్కూలు సంఘటనను ప్రస్తావించారు. దీనిపై ఇంకా చర్యలు చేపట్టలేదని విమర్శించారు. మీ హయాంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయని, కేవలం ప్రచారం కోసం మాట్లాడవద్దని హోం మంత్రి ప్రత్యుత్తరమిచ్చారు. ప్రభుత్వం ఎవరినీ రక్షించడం లేదని, చట్ట పరంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బాధిత యువతి కుటుంబానికి బెదిరింపు కాల్స్ వచ్చి ఉంటే, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే సందర్భంలో పాలక, ప్రతిపక్ష సభ్యులు పలుసార్లు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవేవీ రికార్డుల్లోకి వెళ్లవని తెలిపారు. అనంతరం మంత్రి ఈ సంఘటనపై సభలో ప్రకటన చేశారు. దీనిపై సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. -
సాయం కరువు
కరువును ఎదుర్కోవడంలో సర్కార్ వైఫల్యంపై విపక్ష నేత శెట్టర్ ధ్వజం కరువు పీడిత ప్రాంతాలో రుణాల వసూలు వాయిదా : సీఎం దీర్ఘకాలిక రుణాలుగా మధ్య కాలిక రుణాలు కరువును ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సిద్ధం ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందని విపక్షం సభ నుంచి బీజేపీ సభ్యుల వాకౌట్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం లేదని శాసనసభలో ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ మండిపడ్డారు. కరువును ఎదుర్కోవడంలో అవసరమైన సన్నాహాలు చేయడం లేదంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సభలో కరువుపై చర్చ మొదలైన వెంటనే ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని పలు తాలూకాల్లో మూడేళ్లుగా కరువు నెలకొందని తెలిపారు. జూన్, జులై మాసాల్లో వర్షపాతం తక్కువగా నమోదవుతోందన్న సమాచారం ముందుగా అందినప్పటికీ ముఖ్యమంత్రి నేతత్వంలోని విపత్తు నిర్వహణా కమిటీ సమావేశం జరగలేదని విమర్శించారు. వెంటనే కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణను రూపొందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రుణాల వసూలు వాయిదా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వ్యవసాయ రుణాల వసూలును వాయిదా వేయాలని సహకార సంఘాలు, బ్యాంకులకు సూచించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. రాష్ర్టంలో నెలకొన్న కరువు పరిస్థితులపై శుక్రవారం శాసన సభలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చకు రెవెన్యూ శాఖ మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్ సమాధానం ఇస్తున్న సందర్భంలో ఆయన జోక్యం చేసుకుంటూ, రైతుల నుంచి బలవంతంగా రుణాలను వసూలు చేయరాదని ఆదేశించినట్లు చెప్పారు. మధ్య కాలిక రుణాలను దీర్ఘ కాలిక రుణాలుగా, స్వల్ప కాలిక రుణాలను మధ్య కాలిక రుణాలుగా మార్పు చేయాలని సూచించామని చెప్పారు. కరువును ఎదుర్కోవడానికి ప్రభుత్వం సర్వ సిద్ధంగా ఉందని ప్రకటించారు. దీని కోసం రూ.564 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.126 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. తాగు నీటి కోసం కొత్తగా బోర్ల తవ్వకాలకు, తాగు నీటి సమస్య తీవ్రంగా ఉన్న వెయ్యి గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈ పనులకు నిధుల కొరత లేదని చెప్పారు. అయితే ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా రాష్ర్టంలో అంత తీవ్రంగా కరువు లేదని అన్నారు. కాగా ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. -
పారని పాచిక
మండలిలో చైర్మన్ పోస్ట్ బీజేపీకే జేడీఎస్ మద్దతు పొందేలా మొదట కాంగ్రెస్ వ్యూహం అనంతరం కుమారతో శెట్టర్ చర్చలు సఫలం బీజేపీకి మద్దతిచ్చిన జేడీఎస్ బదులుగా డిప్యూటీ పోస్ట్ పుట్టన్నకు నిప్పులు చెరిగిన విమలా గౌడ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన మండలిలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పోస్టులను నిలబెట్టుకునే ప్రయత్నంలో బీజేపీ, జేడీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుత చైర్మన్ డీహెచ్. శంకరమూర్తి కొనసాగుతారు. బీజేపీకి చెందిన ప్రస్తుత డిప్యూటీ చైర్పర్సన్ విమలా గౌడ రాజీనామా చేసి, ఆ స్థానాన్ని జేడీఎస్‌కు చెందిన పుట్టన్నకు ఇవ్వాలన్నది ఒప్పందం. శాసన సభ లాబీలో బుధవారం ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, జేడీఎస్ పక్షం నాయకుడు హెచ్డీ. కుమారస్వామి దీనిపై సుదీర్ఘంగా చర్చించి, ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. కాంగ్రెస్ ఎత్తు చిత్తు శాసన మండలిలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులను చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ పన్నిన వ్యూహం విఫలమైంది. జేడీఎస్ మద్దతుతో ఈ రెండు పదవులను కైవసం చేసుకోవడానికి ఆ పార్టీ వ్యూహ రచన చేసింది. చైర్మన్ పదవి తనకు, డిప్యూటీ చైర్మన్ పదవి జేడీఎస్‌కు... అని ఒప్పందాన్ని సిద్ధం చేసుకుంది. చివరి నిమిషంలో కుమారస్వామి బీజేపీ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ పాచిక పారలేదు. శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 75 కాగా బీజేపీ బలం 31. ఇటీవల జరిగిన ఎన్నికలు, నామినేటెడ్ పోస్టులతో కాంగ్రెస్ బలం 28కి పెరిగింది. ముగ్గురు స్వతంత్ర సభ్యులు కాంగ్రెస్ వైపే ఉన్నారు. మరో స్వతంత్రుడు తటస్థంగా ఉంటున్నారు. జేడీఎస్ సంఖ్యా బలం 12. ఈ నేపథ్యంలో ఇరు పదవులు ఖాయమనుకున్న కాంగ్రెస్, ఈ వారంలో చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాలనుకుని పథకం కూడా సిద్ధం చేసుకుంది. అయితే చివరి నిమిషంలో బీజేపీ, జేడీఎస్‌ల మధ్య కుదిరిన ఒప్పందంతో నిస్సహాయంగా మిగిలిపోయింది. విమలా గౌడ నిప్పులు డిప్యూటీ చైర్ పర్సన్ పదవి నుంచి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి తనను కోరారని విమలా గౌడ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ, జేడీఎస్ నాయకులపై నిప్పులు చెరిగారు. చైర్మన్ శంకరమూర్తి పదవి లేకుండా ఉండలేరని విమర్శించారు. ఆయన పదవిని కాపాడుకోవడానికి తనను రాజీనామా చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో చైర్పర్సన్, ప్రతిపక్ష నాయకురాలు పదవులను ఇస్తామని హామీ ఇచ్చిన తమ పార్టీ, అనంతరం మాట తప్పిందని విమర్శించారు. జేడీఎస్ నాయకులు ‘డీల్’ మాస్టర్లని నిప్పులు చెరిగారు. వారి బాగోతం ప్రజలకు తెలుసునని విమర్శించారు. మొత్తానికి ఓ ఒక్కలిగ మహిళకు అన్యాయం జరిగిందని ఆమె వాపోయారు. -
నిద్ర మత్తులో సిద్ధు సర్కార్
హొస్పేట : రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రమత్తులో జోగుతోందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత జగదీష్ శెట్టర్ తెలిపారు. సోమవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సిద్దరామయ్య గాఢనిద్రలో ఉన్నారని, వారిని వైద్యులకు చూపించాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో న్యాయాంగ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి పోయిందన్నారు. పోలీస్ అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కేసులు నమోదు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. హోంమంత్రి వారికి సరైన బుద్ధి చెప్పడం పోయి టీవీలలో ఇంటర్వ్యూలు ఇస్తూ చర్చల్లో పాల్గొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనైతిక కార్యకలాపాలు, అక్రమ ఇసుక మాఫీయాలు అధికమయ్యాయన్నారు. అక్రమ ఇసుక మాఫియా వెనుక మంత్రుల పుత్రుల హస్తముందన్నారు. సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యకలాపాలు జరగలేదన్నారు. రాష్ట్రంలోని అధికార పార్టీ చెరుకుకు కల్పించిన మద్దతు ధర రూ.2650లు ఇంత వరకు ఒక్క రైతుకు కూడా అందలేదన్నారు. ఈ శాన్య ఉపాధ్యాయుల విధాన పరిషత్ అభ్యర్థి శశీల్ జీ.నమోషి తరుపున కొప్పళ, బళ్లారి జిల్లాలో ప్రచారం చేశామన్నారు. శశీల్ జీ.నమోషి ఈశాన్య ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా నాలుగో సారి గెలువడం ఖాయమన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రవేశ పెట్టిన పథకాలను నేడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేయడం తమకెంతో బాధగా ఉందన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్.ఈశ్వరప్ప, మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప, మాజీ ఎమ్మెల్యే ఎన్టీ.బొమ్మన్న, బీజేపీ జిల్లాధ్యక్షుడు కే.నేమిరాజ్‌నాయక్, బీజేపీ నేతలు రామలింగప్ప, భరమలింగనగౌడ, సందీప్‌సింగ్, చంద్రకాంత్ కామత్ పాల్గొన్నారు. -
‘కోడ్’ సడలింపు
అత్యవసర సమస్యలపై సర్కార్ స్పందించవచ్చు అధికారులతో సమావేశాలకూ అనుమతి మంత్రులు జిల్లాల పర్యటనకు ఓకే ఎన్నికల విధులకు నియమించిన అధికారులతో సమావేశాలొద్దు యథావిధిగా కొనసాగనున్న ప్రభుత్వ కార్యకలాపాలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎన్నికల నియమావళిని కొద్దిగా సడలించారు. పోలింగ్ ముగిసిన సుమారు నెల తర్వాత ఓట్ల లెక్కింపు ఉన్నందున, అప్పటి వరకు నియమావళిని కొనసాగిస్తే అభివృద్ధి పనులు కుంటు పడతాయని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సీఈసీ నియమావళికి సడలింపునిస్తూ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. దాని ప్రకారం.. కరువు, తాగు నీటి సమస్య, అకాల వర్షం లాంటి అత్యవసర సందర్భాల్లో ప్రభుత్వం తగు చర్యలు చేపట్టవచ్చు. అధికారులతో సమావేశాలను కూడా నిర్వహించవచ్చు. శాఖల వారీగా కూడా సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అత్యవసర పనులను చేపట్టడానికి నియమావళి అడ్డుకాబోదు. మంత్రులు జిల్లాల పర్యటనకు వెళ్లవచ్చు. ఇప్పటికే చేపట్టిన పనుల ప్రగతిపై సమీక్షించవచ్చు. అయితే ఎన్నికల విధులకు నియమించిన అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేయరాదు. నియమావళి వర్తించే విషయాల్లో సైతం అత్యవసరంగా ఏవైనా పనులుంటే, సీఈసీ అంగీకారంతో చేపట్టవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ కుమార్ ఝా తెలిపారు. కాగా నియమావళి కారణంగా అభిృద్ధి కుంటు పడుతోందని, కనుక వెంటనే దానిని సడలించాలని ప్రతిపక్ష బీజేపీ కూడా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అవసరమైతే తాము కూడా సీఈసీకి లేఖ రాస్తామని ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ వెల్లడించారు. ప్రస్తుతం నియమావళి కారణంగా మంత్రులు ఉత్సవ విగ్రహాల్లాగా తయారయ్యారు. అధికారులతో మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విశ్రాంతి కోసం ఏకంగా కేరళకు వెళ్లారు. ప్రస్తుత సడలింపు కారణంగా ప్రభుత్వ కార్యకలాపాలు యథావిధిగా సాగనున్నాయి. -
మఠాల జోలికొస్తే మటాష్
మైసూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో మఠాల జొలికొచ్చే ఏ ప్రభుత్వాన్నైనా ప్రజలు ఇంటికి పంపిస్తారని ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ హెచ్చరించారు. ఇక్కడి జేఎస్ఎస్ ఆయుర్వేద ఆస్పత్రి, జేఎస్ఎస్ ఆస్పత్రి ప్రసూతి కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉంటాయని, వాటిని వదిలి మఠాలకు జోలికి రావడం సరికాదని హితవు పలికారు. విద్య, వైద్య రంగాల్లో మఠాలు అందిస్తున్న సేవలు ప్రభుత్వాలకు మార్గదర్శకం కావాలన్నారు. పురాతన వైద్య విధానాల్లో ఒకటైన ఆయుర్వేదం అంతర్థానమవుతుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అలోపతి వల్ల దేహమంతా రసాయనాలతో నిండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంస్కృతిని కాపాడడానికి మఠాలు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. జాతరకు జనమే జనం సుత్తూరు మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతరకు ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. యువకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. జాతర అంటే కేవలం పూజా పురస్కారాలు మాత్రమే కాదని, ఆట పాటలు కూడానని ఈ సందర్భంగా పలువురు స్వామీజీలు పేర్కొన్నారు. ఆరు రోజుల పాటు జరిగే జాతర జయప్రదం కావాలంటే, దాని వెనుక ఎంతటి శ్రమ ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ జాతర మహోత్సవం అంతర్జాతీయ స్థాయిలో మన సంస్కృతిని ప్రతిబింబిస్తుందని చెప్పారు. కాగా జాతరలో ఓ ఏనుగు కాసేపు అలజడి సృష్టించింది. మావటీ నియంత్రణ నుంచి తప్పించుకుని అటు ఇటు తిరుగుతూ ఆందోళనను కలిగించింది. అయితే ఎవరి పైకి దాడికి దిగకుండా తనదైన శైలిలో కలకలం రేపింది.