మరో వివాదంలో సిద్ధు
కుమారుడి ద్వారా శాంత ఇండస్ట్రీస్‌కు రూ.150 కోట్ల విలువైన భూమి ధారదత్తం
ఆధారాలను బయటపెట్టిన ఆర్‌టీఐ కార్యకర్త
సంకటస్థితిలో సిద్దు
బెంగళూరు: పుత్ర వాత్సల్యానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మరో బాంబు పడింది. తన కుమారుడి కోసం ఆయన రూ.150 కోట్ల మేర విలువైన బీడీఏ భూమిని ధారాదత్తం చేశారన్న వార్తలు సీఎం సిద్ధరామయ్యను మరింత చిక్కుల్లో పడేశాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను బెంగళూరుకు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త కోదండరామ్ గురువారం సాయంత్రమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నగరంలోని మహాలక్ష్మీ లే అవుట్‌లో సర్వే నెంబర్ 174, 175లోని శాంత ఇండస్ట్రీస్ అనే సంస్థకు చెందిన భూమిని 1977లో బీడీఏ స్వాధీనం చేసుకుంది. ఆ భూమికి పరిహారం కూడా ఇస్తామని తెలిపింది. అయితే ఇందుకు నిరాకరించిన శాంత ఇండస్ట్రీస్ సంస్థ ఆ స్థలానికి బదులుగా మరో ప్రాంతంలో తమకు స్థలాన్ని కేటాయించాల్సింగా కోరుతూ వస్తోంది. ఈ విషయంపై సదానందగౌడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత జగదీష్ శెట్టర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బీడీఏలో విన్నవించారు. అయితే అప్పటి న్యాయనిపుణులు శాంత ఇండస్ట్రీస్ విన్నపం భూస్వాధీన న్యాయసూత్రాలకు విరుద్ధమని తేల్చి చెప్పారు.
దీంతో శాంత ఇండస్ట్రీస్ ఫైల్ అక్కడితో ఆగిపోయింది. అయితే సీఎం సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర తన స్నేహితుడైన రాజేష్‌గౌడ శాంత ఇండస్ట్రీస్‌లో భాగస్వామిగా చేరారు. దీంతో మూలన పడిన ఈ శాంత ఇండస్ట్రీస్ ఫైల్ వేగంగా కదిలింది. హెబ్బాళలోని 2.19 ఎకరాల స్థలాన్ని బీడీఏ ద్వారా ఉచితంగా 2016 జనవరిలో కట్టబెట్టారు. తద్వారా రూ.150 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా పొందారు’ అని కోదండరామ్ వెల్లడించారు. ఈ విషయంపై ఈనెల 5న ఏసీబీకి సైతం ఫిర్యాదు చేసినట్లు కోదండరామ్ తెలిపారు. ఇదిలా ఉండగా రాజేష్‌గౌడ డెరైక్టర్‌గా ఉన్న మ్యాట్రిక్స్ సంస్థలో సిద్ధరామయ్య కుమారుడైన డాక్టర్ యతీంద్ర డెరైక్టర్‌గా చేరడం, అదే మ్యాట్రిక్స్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాగ్నస్టిక్ సెంటర్‌లను ఏర్పాటు చేసే కాంట్రాక్టును కట్టబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇలా యతీంద్ర భాగస్వామిగా ఉన్న సంస్థలకు సిద్ధరామయ్య ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వందల కోట్ల విలువ చేసే భూములను, కాంట్రాక్టులను కట్టబెడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.