బీజేపీ ముక్త కర్ణాటక అనేది ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కలగానే మిగిలిపోతుందని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్
బెంగళూరు : బీజేపీ ముక్త కర్ణాటక అనేది ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కలగానే మిగిలిపోతుందని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ పేర్కొన్నారు. శనివారమిక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. 2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని తెలిపారు.
తమ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదాన్ని ప్రకటించిందని, అదే విధంగా కాంగ్రెస్ ముక్త కర్ణాటక కోసం బీజేపీ రాష్ట్ర నేతలు కలిసికట్టుగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
త్వరలోనే తమ నినాదం నిజం కూడా కానుందని అన్నారు. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం తన ఖాతాను సైతం తెరవలేకపోయిందని విమర్శించారు. అలాంటిది 2018లో కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామనుకోవడం కాంగ్రెస్ నేతల పగటి కల అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తప్పక విజయాన్ని సాధిస్తుందని జోష్యం చెప్పారు.