పదవి కాపాడుకునేందుకే సీఎం మంత్రి వర్గ విస్తరణ: యడ్యూరప్ప
సాక్షి,బెంగళూరు: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినా పట్టించుకోని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవిని కాపాడుకోవడానికి మంత్రిమండలి విస్తరణ చేపడుతున్నారని విపక్ష భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప విమర్శించారు. పార్టీ తరఫున ఏర్పాటు చేసిన బృందంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిపిన కరువు పర్యటనలో వెలుగుచూసిన వివరాలతోకూడిన నివేదికను పార్టీ ముఖ్యనాయకులైన కే.ఎస్ ఈశ్వరప్ప, ఆర్.అశోక్ తదితరులతో కలిసి ఆయన గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాకు మంగళవారం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకూ కరువు పరిస్థితుల నేపథ్యంలో మంత్రి మండలి విస్తరణను వాయిదా వేస్తు వచ్చిన సీఎం సిద్ధరామయ్య హఠాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకుని ఈనెల చివరన ఆ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పడం సరికాదన్నారు. కేవలం పదవిని కాపాడుకోవడానికే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు.
రాష్ట్రంలో నలభై ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కరువు ఏర్పడిన నేపథ్యంలో ప్రజల కష్టాలను తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఆయన మంత్రి మండలి సభ్యుల నిర్లక్ష్యధోరణే ఇందుకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కరువు కాటకాలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంటే సీఎం సిద్ధరామయ్య, ఆయన మంత్రిమండలి సభ్యులు అధికారుల బదిలీ విషయం పై దృష్టి సారించడం పలు అనుమానాలకు దారితీస్తోందన్నారు. ఇది ఒక పెద్ద ‘దందా’గా సాగుతోందని యడ్యూరప్ప ఘాటు వాఖ్యలు చేశారు. సీఎం సిద్ధరామయ్య ప్రతిపక్షాల సలహాలు తీసుకోవడానికి ఇష్టపడటం లేదన్నారు. అందువల్లే తాము రాష్ట్రంలో ఏర్పడిన కరువు, ప్రభుత్వ వైఫల్యం, కరువు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర విషయాల పై గవర్నర్‌కు పూర్తి స్థాని నివేదిక అందజేశామని యడ్యూరప్ప తెలిపారు.