ప్రైవేటు ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్
మేనేజ్‌మెంట్‌లో 50శాతం
నాన్‌మేనేజ్‌మెంట్‌లో 75 శాతం
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం, బిల్లుకు కేబినెట్ ఆమోదం
ఐటీ సంస్థలు, విపక్షాల తీవ్ర విమర్శలతో యూటర్న్
సాక్షి బెంగళూరు: కర్నాటకలో మరోసారి స్థానిక, స్థానికేతర రగడ రాజుకుంది. రాష్ట్రంలో ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా స్థానికులకే ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణమైంది. రాష్ట్రంలోని పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇతర ప్రైవేటు సంస్థలన్నింట్లోనూ కన్నడిగులకు రిజర్వేషన్ కలి్పంచాలని ప్రభుత్వం తీర్మానించింది.
ప్రైవేట్ రంగంలో మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగాల్లో 50 శాతం, నాన్ మేనేజ్‌మెంట్‌లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన ఉద్యోగ బిల్లు–2024కు కేబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే రూ 25 వేల దాకా జరిమానా కూడా విధిస్తారు.
అంతేగాక గ్రూప్ సి, డి తరహా చిరుద్యోగాల్లో ప్రైవేట్ కంపెనీలు విధిగా నూటికి నూరు శాతం స్థానికులనే తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు చట్టం చేసేందుకు వీలుగా ఒకట్రెండు రోజుల్లో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. కానీ ఐటీ తదితర పరిశ్రమలు, ప్రైవేటు రంగ సంస్థల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ప్రస్తుతానికి దీనిపై వెనకడుగు వేసింది. బిల్లును పక్కన పెడుతున్నామని, మరింత అధ్యయనం చేస్తామని సీఎం కార్యాలయం బుధవారం ప్రకటించింది.
ఇదీ నేపథ్యం...
కర్నాటకవ్యాప్తంగా ప్రైవేటు ఉద్యోగాల్లో ఉత్తరాది వారికే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయంటూ కొన్నాళ్లుగా కర్నాటకలో ఆందోళనలు జరుగుతున్నాయి. స్థానిక వనరులు, మౌలిక వసతులు ఉపయోగించుకుంటున్న ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు అందుకు తగ్గట్టుగా స్థానికులకే ఉద్యోగాలివ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఉద్యోగాల బిల్లుకు రూపకల్పన చేసింది.
100 % స్థానికులకేనంటూ సిద్ధు పోస్టు
బిల్లుకు మంత్రివర్గ ఆమోదం అనంతరం మంగళవారం సీఎం సిద్ధరామయ్య ఎక్స్‌లో పెట్టిన పోస్టు వివాదానికి దారితీసింది. ‘‘మాది కన్నడ ప్రభుత్వం. కన్నడిగుల భద్రత, సంక్షేమానికి పాటుపడటమే మా బాధ్యత. కానీ కన్నడిగులు కన్నడనాడులోనే ఉద్యోగాలు పొందడంలో వెనకబడుతున్నారు. దీన్ని నివారించేందుకు ఈ బిల్లు ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. ఇకపై రాష్ట్రంలో అన్ని ప్రైవేటు రంగ పరిశ్రమలు, కర్మాగారాల్లో గ్రూప్ సి, డి ఉద్యోగాలు వంద శాతం కన్నడిగులకే ఇవ్వాల్సిందే’’ అని పోస్టులో సిద్ధు పేర్కొన్నారు. తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని తొలగించారు.
తీవ్ర వ్యతిరేకత
సిద్ధు సర్కారు నిర్ణయాన్ని కర్ణాటకలోని ప్రైవేటు రంగ సంస్థలు, పరిశ్రమలు ము ఖ్యంగా ఐటీ తదితర కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పారిశ్రామిక దిగ్గజం, బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా దీనిపై తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. టెక్ కంపెనీలకు స్థానికత కంటే ప్రతిభే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ బిల్లుతో కంపెనీలు కర్నాటకకు రావాలంటే భయపడే పరిస్థితి తలెత్తుతుందని సాఫ్ట్‌వేర్ పరిశ్రమల జాతీయ సంఘం నాస్‌కామ్ విమర్శించింది. దీన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇది వివక్షా పూరితమైన బిల్లంటూ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్ దాస్ పాయ్ విమర్శించారు.
‘‘ఇది రాజ్యాంగవిరుద్ధం. టెక్ రంగానికి గొడ్డలిపెట్టు వంటి ఈ ఫాసిస్టు బిల్లును వెంటనే వెనక్కు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. అసోచామ్ కర్నాటక సహధ్యక్షుడు ఆర్‌కే మిశ్రా తదితరులు కూడా ఇది దూరదృష్టి లేని బిల్లంటూ తీవ్రంగా తప్పుబట్టారు. విపక్ష బీజేపీ కూడా బిల్లును తీవ్రంగా తప్పుబట్టింది.
కర్నాటకలో కన్నడిగుల స్వాభిమానాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కన్నడ నేమ్‌ప్లేట్లు, కన్నడ ధ్వజం, భాష, సంస్కృతి, పరంపర విషయంలో వెనుకంజ ఉండదు. రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్ కలి్పస్తూ బిల్లు తేవడం అందులో భాగమే
– బిల్లును తాత్కాలికంగా పక్కన పెట్టిన అనంతరం కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment