మెరుగైన పెన్షన్‌ కావాలంటే? | Explanation of Unified Pension Scheme, sakshi special story | Sakshi
Sakshi News home page

మెరుగైన పెన్షన్‌ కావాలంటే?

Published Mon, Sep 9 2024 4:15 AM | Last Updated on Mon, Sep 9 2024 8:04 AM

Explanation of Unified Pension Scheme, sakshi special story

విశ్రాంత జీవనానికి పక్కా ప్లానింగ్‌ అవసరం 

నెలవారీ కేటాయింపులు చేయాలి 

ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌ కలయికతో మంచి రాబడి 

చివరి వేతనంలో సగం పింఛనుగా పొందే మార్గం 

సర్కారు ఉద్యోగం.. ఎంతో మంది నిరుద్యోగుల ఆకాంక్ష. ఆకర్షణీయమైన వేతనం, ఇతర ప్రయోజనాలతోపాటు, రిటైర్మెంట్‌ తర్వాత మెరుగైన పింఛను వస్తుందన్న భరోసా ఎక్కువ మందిని ఆకర్షించే అంశాలు. కానీ, 2004 నుంచి అమల్లోకి వచి్చన నూతన ఫింఛను విధానంతో రిటైర్మెంట్‌ తర్వాత వచ్చే ప్రయోజనాలు మారిపోయాయి. దీంతో పాత పింఛను విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. 

దీనికి పరిష్కారంగా యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (యూపీఎస్‌)ను కేంద్ర సర్కారు తాజాగా తెరపైకి తీసుకొచ్చింది. పదవీ విరమణ చివరి ఏడాది వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా అందించే హామీ ఉంటుంది. మరి ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారి సంగతి ఏంటి? రిటైర్మెంట్‌ తర్వాత మెరుగైన పింఛను పొందాలంటే అసాధ్యమేమీ కాదు. ఇందుకు చేయాల్సిందల్లా.. ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లడమే. ఈపీఎఫ్‌తోపాటు, ఎన్‌పీఎస్‌లోనూ నిర్ణీత శాతం మేర పెట్టుబడి పెట్టడం ద్వారా విశ్రాంత జీవితాన్ని మెరుగ్గా గడిపేందుకు మార్గం ఉంది. ఇందుకు ఏం చేయాలో నిపుణుల విశ్లేషణ చూద్దాం.  

కేటాయింపులు కీలకం..  
ప్రభుత్వరంగ ఉద్యోగుల మాదిరే ప్రైవేటు రంగ ఉద్యోగులూ తమ రిటైర్మెంట్‌ పెట్టబడులను కొంత మేర ఎన్‌పీఎస్‌కు కేటాయించుకోవడం ఇక్కడ కీలకం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వేతనం నుంచి  10 శాతం, వారి తరఫున ప్రభుత్వం నుంచి 14 శాతం చొప్పున ఎన్‌పీఎస్‌లోకి పెట్టుబడిగా వెళుతుంది. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. మొత్తం ఎన్‌పీఎస్‌ పెట్టుబడుల్లో ఈక్విటీలకు 15 శాతం మించి కేటాయించుకోలేరు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌లో రాబడుల వృద్ధి పరిమితంగానే ఉంటుంది.

 అంటే 10 శాతంలోపు అని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రైవేటు రంగంలోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్‌ అమలవుతుంది. ఉద్యోగి, యాజమాన్యం చెరో 12 శాతం చొప్పున మూల వేతనం, డీఏపై ఈపీఎఫ్‌ ఖాతాకు జమ చేస్తుంటాయి. దీనిపై రాబడి 8 శాతం స్థాయిలోనే ఉంది. దీనివల్ల దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ భవిష్యనిధి ఏర్పడుతుందేమో కానీ, రిటైర్మెంట్‌ అవసరాలను తీర్చే స్థాయిలో కాదు. కనుక ప్రైవేటు రంగ ఉద్యోగులు ఈపీఎఫ్‌ కాకుండా ఎన్‌పీఎస్‌లోనూ ఇన్వెస్ట్‌ చేసుకోవాలి.  

ఈపీఎఫ్‌–ఎన్‌పీఎస్‌ కలయిక 
కేంద్ర ఉద్యోగులకు ప్రతిపాదించిన యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (యూపీఎస్‌)లో అతిపెద్ద ఆకర్షణ.. చివరి వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా పొందడం. కానీ దీర్ఘకాలం పాటు సేవలు అందించిన తర్వాత చివరి వేతనంలో 50% భారీ మొత్తం కాబోదు. ప్రైవేటు రంగంలో పనిచేసే వారు సైతం తమ చివరి వేతనంలో 50 శాతాన్ని ఉద్యోగ విరమణ తర్వాత పొందొచ్చు. ప్రణాళిక మేరకు క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఇంతకంటే ఎక్కువే సొంతం చేసుకోవచ్చు.  

ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌లో సమకూరిన నిధితోపాటు, ఈపీఎఫ్‌లో భాగమైన ఎంప్లాయీ పెన్షన్‌ స్కీమ్‌ (ఈపీఎస్‌) కూడిన పెట్టుబడుల ప్రణాళిక ఒకటి. ఉదాహరణకు ఈపీఎఫ్‌ కింద ఉద్యోగి మూల వేతనం నుంచి 12%, అంతే చొప్పున యాజమాన్యం జమ చేస్తాయి. దీనికితోడు పాత పన్ను విధానంలో కొనసాగే వారు ఎన్‌పీఎస్‌ ఖాతా తెరిచి తమ వేతనంలో 10 % మేర యాజమాన్యం ద్వారా జమ చేసుకోవాలి. దీనికి సెక్షన్‌ 80సీసీడీ(2) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

 ఒకవేళ కొత్త పన్ను విధానంలోకి మళ్లిన వారు తమ వేతనంలో 14 శాతాన్ని ఎన్‌పీఎస్‌కు జమ చేయించుకోవడం ద్వారా ఆ మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఉద్యోగ జీవితంలో క్రమం తప్పకుండా ఈ పెట్టుబడులు కొనసాగించడం ద్వారా చివరి వేతనంలో 50 శాతాన్ని పొందొచ్చు.  ప్రభుత్వ ఉద్యోగులు కాని ఇతరులు అందరూ.. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలకు గరిష్టంగా 75% కేటాయింపులు చేసుకోవచ్చు. దీని ద్వారా రిటైర్మెంట్‌ నాటికి భారీ నిధి సమకూరుతుంది.  

నెలవారీ ఆదాయం.. 
ప్రైవేటు ఉద్యోగంలో ఆరంభ మూల వేతనం రూ.14,000తో ప్రారంభమై.. ఏటా 10% చొప్పున పెరుగుతూ వెళితే.. పైన చెప్పుకున్న విధంగా ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌లకు 30 ఏళ్ల పాటు చందాలు జమ చేసుకుంటూ వెళ్లినట్టయితే, రిటైర్మెంట్‌ తర్వాత నెలవారీ రూ.2.9 లక్షలు పొందొచ్చు. చివరి ఏడాదిలో వేతనం రూ.2.44 లక్షల కంటే ఇది ఎక్కువ. 

రిటైర్మెంట్‌ నాటికి ఎన్‌పీఎస్‌లో సమకూరిన నిధిలో 40 శాతంతో యాన్యుటీ ప్లాన్‌ (పింఛను) తీసుకోవాలి. మిగిలిన 60% ఫండ్‌ను వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, ఈపీఎఫ్‌లో సమకూరిన నిధిని కూడా వెనక్కి తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ/సిప్‌కు విరుద్ధమైనది) ఎంపిక చేసుకోవాలి. తద్వారా ప్రతి నెలా కోరుకున్నంత వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, పనిచేసిన కాలం ఆధారంగా ఈపీఎఫ్‌లో భాగమైన ఎన్‌పీఎస్‌ నుంచి నెలవారీ నిరీ్ణత మొత్తం పింఛనుగా అందుతుంది.  

 ఎన్‌పీఎస్‌లో 60% నిధి, ఈపీఎఫ్‌లో భవిష్యనిధి వాటా కింద సమకూరిన మొత్తాన్ని.. రిస్క్, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా డెట్‌ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్‌ లేదా హైబ్రిడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. కన్జర్వేటివ్‌ లేదా బ్యాలన్స్‌డ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ అయితే రిస్‌్క–రాబడుల సమతుల్యంతో ఉంటాయి. వ్యాల్యూ రీసెర్చ్‌ డేటా ప్రకారం గడిచిన పదేళ్లలో కన్జర్వేటివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ విభాగం సగటు వార్షిక రాబడి 8.41 శాతంగా ఉంది. 

బ్యాలన్స్‌డ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ విభాగంలో రాబడి 9.83% మేర ఉంది. ఈ ఫండ్స్‌లో వార్షిక రాబడి రేటు కంటే తక్కువ మొత్తాన్ని ఏటా ఉపసంహరించుకోవాలి. దీనివల్ల కాలక్రమంలో పెట్టుబడి కూడా కొంత మేర వృద్ధి చెందుతుంది. పెట్టుబడి విలువలో ప్రతి నెలా 0.5% చొప్పున ఎస్‌డబ్ల్యూపీ ద్వారా వెనక్కి తీసుకోవాలి. ఏటా ఈ మొత్తాన్ని 5% (ద్రవ్యో ల్బణం స్థాయిలో) పెంచుకుని ఉపసంహరించుకున్నా సరే.. రిటైర్మెంట్‌ నిధి ఏటా 10% చొప్పున వృద్ధి చెందితే 25 ఏళ్లలో రూ.2.05 కోట్ల నుంచి రూ.2.9 కోట్లకు చేరుతుంది. రిటైర్మెంట్‌ ఫండ్‌ విలువ మరింత పెరగాలంటే, నెలవారీ ఉపసంహరణ రేటు వీలైనంత తక్కువగా ఉండేలా చూడాలి.  

ఎంత మేర..?
ఆరంభ మూల వేతనం రూ.14,000. ఏటా 10% పెరిగేట్టు. ఈపీఎఫ్‌లో నిబంధనల మేరకు ఇన్వెస్ట్‌ చేస్తూనే, ఎన్‌పీఎస్‌లోనూ పాత పన్ను విధానంలో 10% మొత్తాన్ని యాజమాన్యం ద్వారా డిపాజిట్‌ చేయించుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. ఈపీఎఫ్‌ నిధిపై 8% రాబడి రేటు. ఎన్‌పీఎస్‌ జమలపై 12% రాబడి రేటు అంచనా. ఎన్‌పీఎస్‌ 40% ఫండ్‌తో యాన్యుటీ ప్లాన్‌ తీసుకుంటే, దీనిపై 6% రాబడి ప్రకారం ప్రతి నెలా వచ్చే ఆదాయం అంచనాలు ఇవి.  

ప్రత్యామ్నాయం
ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్‌ ఎలానూ ఉంటుంది. దీనికితోడు ఎన్‌పీఎస్‌ జోడించుకోవడం రాబడుల రీత్యా మంచి నిర్ణయం అవుతుంది. రిటైర్మెంట్‌ నాటికి ఎన్‌పీఎస్‌ నిధిలో 60 శాతాన్ని ఎలాంటి పన్ను లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్‌ నిధిపైనా ఎలాంటి పన్ను లేదు. పన్ను కోణంలో ఈ రెండింటి కంటే మెరుగైనవి లేవు. ఎన్‌పీఎస్‌లో 75 శాతం ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. కానీ, ఎన్‌పీఎస్‌ ఫండ్‌ మేనేజర్లు టాప్‌–200 కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేయగలరు.

 ఒకవేళ ఇంతకంటే అదనపు రాబడులు ఆశించే వారు ఎన్‌పీఎస్‌ బదులు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో క్రమానుగతంగా ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రిటైర్మెంట్‌ సమయంలో మొత్తం వెనక్కి తీసుకోకుండా, క్రమానుగతంగా ఉపసంహరణ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ) ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల పన్ను భారం చాలా వరకు తగ్గుతుంది. అయితే పదవీ విరమణ తర్వాత నూరు శాతం ఈక్విటీల్లోనే పెట్టుబడులు ఉంచేయడం సరైనది కాదు. 

కనుక 50% మేర అయినా డెట్‌ ఫండ్స్‌కు మళ్లించుకోవాలి. కనుక ఈ మొత్తంపై పన్ను భారం పడుతుంది. అయినా సరే యాక్టివ్, ఇండెక్స్‌ ఫండ్స్‌ ద్వారా పన్ను భారానికి దీటైన రాబడులు సొంతం చేసుకోవడం సాధ్యమే. ఈ సంక్లిష్టతలు వద్దనుకునే వారికి సులభమైన మార్గం ఎన్‌పీఎస్‌. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. పైగా పన్ను భారం లేకుండా ఈక్విటీ నుంచి డెట్‌కు, డెట్‌ నుంచి ఈక్విటీకి పెట్టుబడుల కేటాయింపులు మార్చుకోవచ్చు. అలాగే, భవిష్యత్తులో ఎన్‌పీఎస్‌లోనూ ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్‌ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే ఎన్‌పీఎస్‌ ద్వారా 50% పెట్టుబడులను ఈక్విటీల్లో, మిగిలినది డెట్‌లో కొనసాగిస్తూ, క్రమానుగతంగా కావాల్సినంత మేర వెనక్కి తీసుకోవచ్చు.  

గమనిక: కొత్త పన్ను విధానంలో ఉన్న వారు ఎన్‌పీఎస్‌కు 14 శాతం మేర వేతనంలో ప్రతి నెలా కేటాయించుకుంటే.. చివర్లో 40 శాతం యాన్యుటీ ప్లాన్‌పై ప్రతి నెలా  టేబుల్‌లో పేర్కొన్న ఆదాయం కంటే 40 శాతం అధికంగా, ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా 10 శాతం మేర అదనంగా పొందొచ్చు.  
 
– సాక్షి, బిజినెస్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement