మరణమా.. రణమా అన్నంత ఉత్కంఠతో ఉద్యోగులు తమకు పాత పింఛను పథకం పునరుద్దరణ మాత్రమే శరణ్యమనీ.. మరో మారు తేల్చి చెప్పారనీ భాగస్వామ్య పింఛను పథకం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ అన్నారు. అసాధారణ పోరాట పటిమతో మదిలో మాటను విశ్వ విదితం చేశారని, ఆ సంగతి సీపీఎస్ శ్రేణుల గుండె చప్పుడుతో దద్దరిల్లిన ట్విటర్ సాక్షిగా సుస్పష్టం అయిందని చెప్పారు. బుధవారం నాడు దేశ వ్యాప్తంగా ఉన్న న్యూపెన్షన్ స్కీమ్ ఉద్యోగ వర్గాల సామాజిక మాధ్యమ ఉద్యమం అద్భుతంగా విజయం సాధించిందని అన్నారు.
ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. నెల రోజుల ముందు నుంచే యావత్ భారతం మానసికంగా సిద్ధమై ఈ రోజు అవకాశం కోసం వేచి చూసిన నిరీక్షణ ఫలితమే ‘రిస్టోర్ ఓల్డ్ పెన్షన్’ ఆవిష్కృతమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి నాయకులు కూడా మున్ముందు జూమ్ సమావేశాలు నిర్వహించి ఎన్‌పీఎస్ కు చరమ గీతం పాడేలా ఉద్యోగ సంఘాలను సమాయత్తం చేశాయన్నారు.
సీపీఎస్‌టీఈఏటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాముక కమలాకర్ సూచన మేరకు సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగులు ట్విటర్ ఖాతాల ద్వారా పాత పింఛను సాధన తమ లక్ష్యం అని గళం వినిపించారన్నారు. వారణాసి రామకృష్ణ ఆధ్వర్యంలో జలసౌధ లో ఇంజనీర్లు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారని చెప్పారు. కొత్త పింఛను పథకం రద్దే ఏకైక లక్ష్యం అని, వెసులు బాట్లు , సౌకర్యాల తో తమను ఏ మర్చలేరని లక్షలాది గొంతుకలు ముక్త కంఠంతో ఎలుగెత్తి చాటాయన్నారు.
దేశ వ్యాప్తంగా 70 లక్షలపై చిలుకు ఉద్యోగులు కొత్త పింఛను పథకం లో ఉండగా.. బుధవారం నాడు పది లక్షల ఉద్యోగుల హృదయ స్పందన ట్విటర్ సాక్షిగా మాకు కావాల్సింది పాత పింఛను పథకం మాత్రమే అన్న విషయం అటు పాలకులకు ఇటు జన బాహుళ్యానికి తేట తెల్లమైందని వివరించారు. కరోనా మూలంగా కేవలం సామాజిక మాధ్యమం అస్త్రంగానే పోరు జరిగిందని, కోవిడ్ తగ్గాక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసే అవకాశం లేకపోలేదని రఘునందన్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment