రిటైర్మెంట్‌కు వీపీఎఫ్‌ ఆయుధం! | Voluntary Provident Fund a better investment choice than PPF | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌కు వీపీఎఫ్‌ ఆయుధం!

Published Mon, Mar 16 2020 5:07 AM | Last Updated on Mon, Mar 16 2020 5:15 AM

Voluntary Provident Fund a better investment choice than PPF - Sakshi

రిటైర్మెంట్‌ తర్వాత జీవితానికి సంబంధించి చాలా మందిలో ప్రణాళిక కనిపించదు. ఎన్నో ఏళ్ల తర్వాత అవసరాల కంటే ప్రస్తుత జీవన అవసరాలే వారికి ప్రాధాన్యంగా ఉంటుంటాయి. ఎక్కువగా మధ్యతరగతి, దిగువ ఆదాయ వర్గాల్లో ఇది చూడొచ్చు. కానీ, 60 ఏళ్ల తర్వాత ఆర్జనా శక్తి తగ్గిపోయిన పరిస్థితుల్లో తమ జీవన అవసరాలు, ఆరోగ్య సంరక్షణ, వైద్య ఖర్చులు భరించాలంటే.. కచ్చితంగా అందుకు చిన్న నాటి నుంచే తగిన ప్రణాళిక కావాలి. అన్ని అవసరాలను తీర్చేంత నిధి సమకూర్చుకోవాలి. దీన్ని విస్మరిస్తే విశ్రాంత జీవనంలో ఇబ్బందులు (స్థిర, చరాస్తులు కలిగిన వారు మినహా) ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ నిధి ఎలానూ ఉంటుంది. ప్రైవేటు రంగంలోని వారికి ఈపీఎఫ్‌ సదుపాయం ఉంది. కానీ, దీని వాటా స్వల్ప మొత్తమే. ఇంకాస్త అదనంగా ఈపీఎఫ్‌కు జమ చేసుకుంటానంటే అందుకు వీలు పడదు. కానీ, ఇటువంటి వారు ఈపీఎఫ్‌కు అదనంగా మరికొంత మొత్తాన్ని ప్రతి నెలా స్వచ్ఛ్చంద భవిష్యనిధి (వీపీఎఫ్‌) రూపంలో సమకూర్చుకోవచ్చు.

సులభ ప్రక్రియ
ఈపీఎఫ్‌కు కొనసాగింపు వీపీఎఫ్‌. వేతన జీవులకే ఈ అవకాశం. వీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే అది సులభమే. తాము పనిచేస్తున్న సంస్థకు ఆ విషయాన్ని తెలియజేసి రిజి స్ట్రేషన్‌ ఫామ్‌ను పూర్తి చేసి ఇస్తే సరిపోతుంది. ప్రతి నెలా ఎంత మొత్తాన్ని వీపీఎఫ్‌కు జమ చేయాలన్నది కూడా తెలియజేయాలి. అప్పటి వరకు కొనసాగుతున్న ఈపీఎఫ్‌ ఖాతాయే వీపీఎఫ్‌కూ వర్తిస్తుంది. వీపీఎఫ్‌ రూపంలో అదనంగా జమ చేసే మొత్తం కూడా ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌కే కలుస్తుంది. వీపీఎఫ్‌లో పెట్టుబడుల పరంగా సౌలభ్యం కూడా ఉంది. వీలున్నంత కాలం ఇన్వెస్ట్‌ చేసి, ఆ తర్వాత కొంత కాలం పాటు నిలిపివేయవచ్చు. అయితే, కొన్ని సంస్థలు ఏడాదికి ఒక్కసారే మార్పులకు అనుమతిస్తున్నాయి.  

రిస్క్‌లేని అధిక రాబడులు
రిటైర్మెంట్‌ తర్వాత అవసరాల కోసం స్థిరాదాయ సాధనాల్లో పొదుపు చేసుకోవాలనుకునే వారికి వీపీఎఫ్‌ ఒక మంచి సాధనమన్నది నిపుణుల అభిప్రాయం. ఈపీఎఫ్‌ చందాకు అదనంగా స్వచ్ఛందంగా ఉద్యోగులు ఇందులో జమ చేసుకోవచ్చు. ప్రైవేటు రంగ ఉద్యోగులకు వారి మూల వేతనం, డీఏలో 12 శాతాన్ని ప్రతి నెలా వేతనం నుంచి మినహాయించి వారి ఈపీఎఫ్‌ ఖాతాకు సంస్థలు జమ చేస్తుంటాయి. ఇంతే మొత్తాన్ని ఉద్యోగి తరఫున సంస్థ కూడా తన వాటాగా అందజేస్తుంది. కానీ, ఈ పరిమితికి మించి ఈపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు అవకాశం లేదు. దీనికి అదనంగా రిటైర్మెంట్‌ ఫండ్‌ కోసం మరికొంత పొదుపు చేసుకోవాలని భావించే వారికి వీపీఎఫ్‌ అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగి తన మూలవేతనం, డీఏకు నూరు శాతం సమాన మొత్తాన్ని ప్రతి నెలా వీపీఎఫ్‌లో జమ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు ఒక ఉద్యోగి మూల వేతనం 12,000, డీఏ రూ.3,000 అనుకుంటే అప్పుడు ప్రతి నెలా గరిష్టంగా రూ.15,000ను వీపీఎఫ్‌లో జమ చేసుకోవచ్చు.   వీపీఎఫ్‌ ఎందుకు ఆకర్షణీయం అంటే.. ఈపీఎఫ్‌ చందాలపై లభించే వడ్డీ రేటే వీపీఎఫ్‌ నిధికి కూడా వర్తిస్తుంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ప్రతీ ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడులపై వచ్చిన ఆదాయం, నిధుల లభ్యతకు అనుగుణంగా వడ్డీ రేటును నిర్ణయిస్తుంటుంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ రేటు 8.65 శాతం కాగా, 2019–20 సంవత్సరానికి 8.5 శాతంగా నిర్ణయించింది. స్థిరాదాయ పథకాల్లో ఇది అత్యధిక రేటు. కొంత మంది విడిగా పీపీఎఫ్‌ ఖాతా తెరిచి ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. కానీ పీపీఎఫ్‌తో పోలిస్తే కనీసం అర శాతానికి పైనే వీపీఎఫ్‌లో వడ్డీ రేటు ఉంటుందని ఆశించొచ్చు. ఈపీఎఫ్, వీపీఎఫ్‌ రెండూ కూడా క్యుములేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలే. అంటే ఇందులో చేసే పెట్టుబడులపై వడ్డీ ఆదాయం ఏటా అసలుకు కలుస్తుంటుంది. దీంతో దీర్ఘకాలంలో మంచి కాంపౌండింగ్‌ వృద్ధి ఉంటుంది. అయితే, ఈపీఎఫ్‌ జమలకు వర్తించే లాకిన్, పాక్షిక ఉపసంహరణల నిబంధనలే వీపీఎఫ్‌కూ వర్తిస్తాయి.


రాబడుల వ్యత్యాసం
బ్యాంకు డిపాజిట్లపై ఇప్పుడు వడ్డీ రేటు 6.5% స్థాయిలకు పడిపోయింది. దీంతో వడ్డీ రేటు పరంగా వీపీఎఫ్‌ ఎంతో ఆకర్షణీయమనే చెప్పొచ్చు. పెద్దల కోసం ఉద్దేశించిన సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (8.6%)ను మినహాయిస్తే చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లతో పోల్చి చూసినా వీపీఎఫ్‌ రేటే అధికం.


ఈక్విటీల్లో ఈపీఎఫ్‌ పెట్టుబడులు పెరుగుతూ ఉండడం, కార్మిక సంఘాల డిమాండ్ల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్, వీపీఎఫ్‌పై అధిక వడ్డీ రేటును నిర్ణయించక తప్పడం లేదు. రిటైర్మెంట్‌ పథకం ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలకు గరిష్టంగా 75% కేటాయింపులకు అవకాశం ఉండడంతో దీర్ఘకాలంలో వీపీఎఫ్‌తో పోలిస్తే కొంత అదనపు రాబడులకు వీలుంది. కానీ, గడువు ముగిసిన తర్వాత ఉపసంహరించుకునే విషయంలో పరిమితులు న్నాయి. ఆ విధంగా చూసుకుంటే వీపీఎఫ్‌ ఎం తో సౌలభ్యం. ఈపీఎఫ్‌/వీపీఎఫ్‌కు చేసే జమ లకు కేంద్రం హామీ ఉండడం అదనపు ఆకర్షణ.

పన్ను వర్తించని సాధనం
వీపీఎఫ్‌కు చేసే జమలు, రాబడులు, ఉపసంహరణలు అన్నీ కూడా పన్ను ఆదా ప్రయోజనం కలిగినవి. ఎన్‌పీఎస్‌లో గడువు తీరే నాటికి సమకూరిన నిధిలో 40 శాతంపై పన్ను చెల్లించి ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే, వీపీఎఫ్‌లో జమ అయిన మొత్తాన్ని ఎటువంటి పన్ను లేకుండా వెనక్కి తీసేసుకోవచ్చు.

ఇందులో చేసే జమలకు సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఏ దశలోనూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు కనుక.. వాస్తవికంగా పొందే రాబడి రేటు మెరుగైనదిగా భావించాలి. అయితే, వడ్డీ రేటు 9.5 శాతం మించితే అప్పుడు ఆ మొత్తంపై పన్ను చెల్లించాలి. కానీ, ఇటీవలి సంవత్సరాల్లో ఈపీఎఫ్, వీపీఎఫ్‌పై వడ్డీ రేటు 8.5–9 శాతం మధ్యే స్థిరపడడాన్ని చూస్తూనే ఉన్నాం. రిటైర్మెంట్‌ అనంతరం ఈపీఎఫ్, వీపీఎఫ్‌ నిధిని పన్ను లేకుండా వెనక్కి తీసేసుకోవచ్చు. ఒకవేళ రిటైర్మెంట్‌కు ముందుగా ప్రత్యేక అవసరాల్లో కొంత వెనక్కి తీసుకున్నా కానీ పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. అయితే, కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత తీసుకుంటేనే పన్ను మినహాయింపు ప్రయోజనం వర్తిస్తుంది. ఐదేళ్ల సర్వీసు పూర్తి కాకముందే ఉపసంహరించుకునే మొత్తం రూ.50,000 మించితే 10 శాతాన్ని టీడీఎస్‌ కింద మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తారు. అలాగే, అప్పటి వరకు ఆర్జించిన వడ్డీ రాబడిపైనా పన్ను పడుతుంది.
 
అవసరాల్లో అక్కరకు..

ఆర్థిక అత్యవసరాల్లో ఈపీఎఫ్‌లో మాదిరే వీపీఎఫ్‌ బ్యాలెన్స్‌ను కూడా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పిల్లల వివాహాలు, వారి ఉన్నత విద్య, వైద్య అవసరాల కోసం, గృహ కొనుగోలుకు ఇందులోని బ్యాలెన్స్‌ను వెనక్కి తీసుకునేందుకు ఈపీఎఫ్‌వో అనుమతిస్తుంది. నిర్ణీత కాలం పాటు ఉద్యోగం లేకుండా ఉన్నా బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. ఒక నెలకు మించి ఉద్యోగం లేకుండా కొనసాగితే, వీపీఎఫ్‌/ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌లో 75 శాతాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. వరుసగా రెండు నెలల పాటు ఉద్యోగం లేని యెడల మిగతా మొత్తాన్ని కూడా వెనక్కి తీసేసుకోవచ్చు. పీపీఎఫ్‌తో పోలిస్తే ఎన్నో విధాలుగా ఈపీఎఫ్, వీపీఎఫ్‌లు ప్రయోజనకరం. పీపీఎఫ్‌లో పాక్షిక ఉపసంహరణలు, అది కూడా ఏడో ఏట నుంచే అవకాశం కల్పిస్తారు. 15 ఏళ్లు పూర్తయిన తర్వాతే పూర్తిగా వెనక్కి తీసుకోగలరు. కానీ, ఈపీఎఫ్‌/వీపీఎఫ్‌లో ఉపసంహరణల పరంగా సౌలభ్యత ఎక్కువ. పైగా రాబడి రేటు కూడా పీపీఎఫ్‌లో ప్రస్తుతమున్న 7.9 శాతంతో పోలిస్తే ఎక్కువే.   

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement