రిటైర్మెంట్ రోజే పీఎఫ్ సెటిల్మెంట్
ఈపీఎఫ్ సేవలన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే: కమిషనర్ శ్రీకృష్ణ
సాక్షి, హైదరాబాద్: ఈపీఎఫ్ ఖాతాదారుల పదవీ విరమణ రోజే భవిష్యనిధి ఖాతాకు సంబంధించిన చెల్లింపులను పూర్తి చేస్తా మని ఈపీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ శ్రీకృష్ణ తెలిపారు. దీనికిగాను సదరు కంపెనీ పక్షం రోజుల ముందు రిపోర్టు చేయాలని, ఆ నెల పీఎఫ్ బకాయిని కూడా ముందస్తుగా చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. తెలంగాణ జోనల్ కమిషనర్ చంద్రశేఖర్, రీజినల్ ఆఫీసర్ రవీంద్ర కుమార్‌లతో కలసి శుక్రవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉద్యో గుల కాంపోజిట్ క్లెయిమ్స్‌కు సంబంధించి గతంలో నాలుగైదు ఫారాలతో కూడిన దరఖాస్తు సమర్పించాల్సి ఉండేదని, ప్రస్తుతం ఈ ప్రక్రియ సులభతరమైందని చెప్పారు. ఒకే పేజీతో కూడిన దరఖాస్తును పూరించి సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే పదిరోజుల్లో సెటిల్మెంట్ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి పీఎఫ్ ఖాతాదారుడు ఆధార్ వివరాల్ని నమోదు చేయాలని, దీనికిగాను మీసేవా కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. పీఎఫ్ కార్యాలయంలోనూ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈపీఎఫ్‌వోలో ప్రతి సేవను కంప్యూటరీ కరించామని, ఇకపై ఆన్‌లైన్ ద్వారానే అన్ని కార్యక్రమాలు చేపడతామని వెల్లడిం చారు. గ్రూప్ హౌసింగ్ పథకం దరఖాస్తులు తీసుకుంటున్నామని, అర్హతను బట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వడ్డీ రాయితీ వస్తుందని పేర్కొన్నారు. ఎంప్లాయి ఎన్‌రోల్‌మెంట్ క్యాంపెయిన్‌ను జూన్ 30 వరకు పొడిగించామని తెలిపారు. పీఎఫ్ ఖాతాదారులకు మెరుగైన సేవలందిం చేందుకు మొబైల్ ఆధారిత యాప్‌ను అందు బాటులోకి తెచ్చామన్నారు. తెలంగాణను ప్రత్యేక జోన్‌గా కేంద్రం నోటిఫై చేసిందని జోనల్ కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు.
రాష్ట్రంలో ఎనిమిది ప్రాంతీయ, మూడు జిల్లా కార్యాల యాలున్నాయని, వీటి పరిధిలో 37,919 సంస్థలు, 84.97 లక్షల మంది ఉద్యోగు లున్నారని పేర్కొన్నారు. జూన్ 1న రవీంద్రభారతిలో పీఎఫ్‌పై అవగాహన కార్యక్రమంతోపాటు ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని ప్రాంతీయ అధికారి రవీంద్రకుమార్ తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, మైనార్టీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఏపీ, తెలంగాణ కార్మికశాఖ మంత్రులు పాల్గొననున్నట్లు చెప్పారు.