ఈపీఎఫ్‌.. ఎన్‌పీఎస్‌...విరమణ తరవాత నేస్తాలివే! | Retirement after help EPF NPS Schemes | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌.. ఎన్‌పీఎస్‌...విరమణ తరవాత నేస్తాలివే!

Published Mon, Jul 31 2017 12:37 AM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

ఈపీఎఫ్‌.. ఎన్‌పీఎస్‌...విరమణ తరవాత నేస్తాలివే!

ఈపీఎఫ్‌.. ఎన్‌పీఎస్‌...విరమణ తరవాత నేస్తాలివే!

రిటైర్మెంట్‌ కోసం ఇవే నయమంటున్న నిపుణులు
ఈపీఎఫ్‌ సురక్షిత పథకం, రాబడులు తక్కువ
ఎన్‌పీఎస్‌ రాబడులు ఎక్కువ, రిస్క్‌ కూడా ఎక్కువే
అయినప్పటికీ దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు
విశ్రాంత జీవనం హాయిగా సాగేందుకు రెండూ అవసరమే!  


జీతంపై ఆధారపడినవారు ఈ రోజు ఎలా గడుస్తోందో చూసుకోవటంతో పాటు... మున్ముందు ఎలా గడుస్తుందో కూడా ఆలోచించాలి. రిటైర్మెంట్‌ కోసం పన్ను ఆదాతో పాటు మంచి నిధిని సమకూర్చుకోవాలనుకుంటే ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌ మెరుగైన చాయిస్‌ అంటున్నారు ఫైనాన్షియల్‌ ప్లానర్లు.

ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌!! ఈ రెండింటిలోనూ రాబడులు ఎలా ఉంటాయ్‌? రిస్క్‌ ఏంటి? పన్ను ప్రయోజనాలు ఎలా ఉంటాయ్‌? రెండింటి మధ్య తేడా ఏంటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. ఎందుకంటే ఈ రెండూ భిన్నమైన ప్రయోజనాలను అందిస్తాయి. ‘‘ఈపీఎఫ్‌ డెట్‌ విభాగానికి చెందినది. ఎన్‌పీఎస్‌ డెట్‌తోపాటు ఈక్విటీ మార్కెట్‌లోనూ పెట్టుబడికి వీలు కల్పించే సాధనం. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను అందించే సాధనం’’ అనేది బ్యాంక్‌ బజార్‌ తాలూకు సేవింగ్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ విభాగం హెడ్‌ అజిత్‌ నరసింహన్‌ మాట.

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌)
ఈపీఎఫ్‌ అన్నది ప్రతి నెలా వేతనం నుంచి కొంత ఇన్వెస్ట్‌మెంట్‌కు వెళ్లే సాధనం. రిటైర్మెంట్‌ లేదా ఆకస్మిక మరణం సందర్భాల్లో ఫండ్‌ అంతా చెల్లిస్తారు. దీర్ఘకాలానికి పెట్టుబడిపై వడ్డీని, ఆ వడ్డీపై మరింత వడ్డీని సమకూర్చే సాధనమిది. సంప్రదాయ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలన్నిట్లోకీ ఎక్కువ రాబడి ఇస్తున్నది ఇదే. ప్రస్తుతం వడ్డీ రేటు 8.65 శాతం ఉంది. జీవితంలో కీలక అవసరాలైన పిల్లల విద్య, వివాహం, సొంతిల్లు వంటి వాటి కోసం పాక్షిక ఉపసంహరణలకు ఇందులో వీలుంది. ఏదైనా అనారోగ్యం పాలైన సందర్భాల్లో కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తారు. ఒక కంపెనీలో ఉద్యోగం మానేసిన తర్వాత తిరిగి మరో ఉద్యోగం సంపాదించలేకుంటే అప్పుడు కూడా ఈపీఎఫ్‌ నిధి మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు.

వేతన జీవులకు ఈపీఎఫ్‌తోపాటు, ఈపీఎస్‌ (ఉద్యోగ పెన్షన్‌ స్కీమ్‌) కూడా ఉంది. బేసిక్‌ వేతనం, డీఏ ఈ రెండింటి మొత్తంలో 12 శాతం ఉద్యోగి వాటాగా, మరో 12 శాతం సంస్థ వాటాగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థకు జమ చేస్తారు. అంటే 24 శాతం ఉద్యోగి భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడిగా వెళుతుంది. అయితే, ఉద్యోగి వాటా 12 శాతం భవిష్యనిధి కింద జమ అవుతుంది. సంస్థ వాటా 12 శాతంలో 8.33 శాతం ఈపీఎఫ్‌ కోసం, మిగిలిన 3.67 శాతం ఈపీఎస్‌ కోసం కేటాయించడం జరుగుతుంది.

 ఈ విధంగా ఈపీఎఫ్‌ వాటాల కింద జమైన మొత్తం, దానిపై వడ్డీ కలిపి రిటైర్మెంట్‌ తర్వాత చెల్లించడం జరుగుతుంది. ఈపీఎస్‌ కింద జమైన మొత్తంపై నిర్ణీత శాతం సంబంధిత వ్యక్తికి ప్రతీ నెలా పింఛనుగా అందుతుంది. అయితే, ఇది చాలా స్వల్పంగానే ఉంటుంది. ఎందుకంటే కేవలం 3.67 శాతమే జమవుతుంది గనుక. ఈపీఎఫ్‌లో రాబడులకు హామీ ఉంటుంది.

నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌)
వేతన జీవులు, ఈపీఎఫ్‌ పరిధిలో ఉన్నవారు, స్వయం ఉపాధిలో ఉన్నవారు, 18 ఏళ్లు దాటిన వారు ఎవరైనా ఎన్‌పీఎస్‌లో చేరొచ్చు. ఎన్‌ఎస్‌డీఎల్‌కు చెందిన సెంట్రల్‌ రికార్డ్‌ కీపింగ్‌ ఏజెన్సీ (సీఆర్‌ఏ) దగ్గర ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఇలా చేరిన వారికి శాశ్వత రిటైర్‌ ఖాతా నంబర్‌ (ప్రాన్‌) కేటాయిస్తారు. ఏడాదిలో కనీసం రూ.6,000 ఇన్వెస్ట్‌ చేయాలి. ఇందులో టైర్‌–1, టైర్‌–2 అని రెండున్నాయి. టైర్‌1లో ఉపసంహరణకు అవకాశం లేదు. టైర్‌–2లో నగదు వెనక్కి తీసేసుకోవచ్చు. అయితే, టైర్‌–2 ఖాతా కావాలంటే అప్పటికే టైర్‌–1 ప్రారంభించి, యాక్టివ్‌గా ఉండాలి. ఎన్‌పీఎస్‌లో స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం పరమైన ప్రయోజనాలు ఉంటాయి.

అయితే గడువు తర్వాత మొత్తం నిధిలో 40 శాతాన్ని యాన్యుటీ పథకంలో నెలనెలా పెన్షన్‌ కోసం గాను ఇన్వెస్ట్‌ చేయడం తప్పనిసరి.
ఎన్‌పీఎస్‌లో రిస్క్‌ ఆధారిత పెట్టుబడులకు గాను మూడు వర్గీకరణలు చేశారు. అస్సెట్‌ క్లాస్‌ ఈ అంటే ఈక్విటీ, అస్సెట్‌ క్లాస్‌ సీ అంటే కార్పొరేట్‌ డెట్‌ సెక్యూరిటీలు. అస్సెట్‌ క్లాస్‌ జీ అంటే ప్రభుత్వ సెక్యూరిటీలకు ఉద్దేశించినవి. ఈక్విటీల్లో రిస్క్‌ అధికం, రాబడులూ అధికమే. కార్పొరేట్‌ డెట్‌ సెక్యూరిటీల్లో రిస్క్‌ మధ్యస్థంగా ఉంటుంది. రాబడులు మోస్తరుగా ఉంటాయి.

 ప్రభుత్వ సెక్యూరిటీల్లో రిస్క్‌ తక్కువ, రాబడులు తక్కువ. ఇన్వెస్టర్లు తమ రిస్క్‌ ఆధారంగా వీటిని ఎంచుకోవచ్చు. ఈక్విటీలో గరిష్ట పెట్టుబడులు 50 శాతానికే పరిమితం. కనుక రిస్క్‌ భరించే వారు ఈక్విటీకి 50 శాతం పోను మిగిలిన పెట్టుబడికి కార్పొరేట్‌ డెట్‌ సెక్యూరిటీలు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఏదో ఒక దానిని లేదా రెండింటినీ ఎంచుకోవచ్చు. మూడూ కోరుకుంటే వేటికి ఎంత వాటా కేటాయించాలన్నది ఆప్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

ఎవరికి ఏది బెటర్‌?
ఎన్‌పీఎస్‌ అన్నది పూర్తిగా రిటైర్మెంట్‌ కోసం ఉద్దేశించినది. ఈపీఎఫ్‌ను మాత్రం రిటైర్మెంట్‌కు, సొంతిల్లు, ఇతర లక్ష్యాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో 60 ఏళ్లు వచ్చిన తర్వాత కాల వ్యవధి తీరుతుంది. అప్పుడు సమకూరిన నిధిలో 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. 40 శాతాన్ని యాన్యుటీ పథకంలో పింఛను కోసం ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. 60 ఏళ్లు రాకముందే పథకం నుంచి తప్పుకుంటానంటే సమకూరిన నిధిలో 80 శాతాన్ని యాన్యుటీ పథకంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతాన్నే వెనక్కి ఇస్తారు. ఎన్‌పీఎస్‌లోనూ పెట్టుబడుల ఉపసంహణకు అవకాశం ఉంది. పదేళ్ల తర్వాత మొత్తం నిధిలో 25 శాతాన్ని డ్రా చేసుకోవచ్చు. ప్రత్యేక అవసరాల కోసమే దీన్ని పరిమితం చేశారు. మొత్తం కాల వ్యవధి తీరేలోపు ఇలా మూడు సార్లు డ్రా చేసుకునేందుకు అనుమతిస్తారు.

పన్ను ప్రయోజనాలు
ఈపీఎఫ్‌లో చేసే పెట్టుబడులు సెక్షన్‌ 80సీ కింద ఏడాదికి రూ.1.50 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఉంది. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులకూ ఇది వర్తిస్తుంది. సెక్షన్‌ 80సీ కింద రూ.1.50 లక్షలు పెట్టుబడులు పెట్టారనుకోండి. అప్పుడు అదనంగా మరో రూ.50,000ల వరకు ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులపై సెక్షన్‌ 80సీసీడీ (1బి) కింద పన్ను మినహాయంపు పొందే సౌలభ్యం ఉంది. అంటే రూ.2.50 లక్షలు బేసిక్‌ మినహాయింపు, అదనంగా సెక్షన్‌ 80సీ కింద రూ.1.50 లక్షల మినహాయింపు పోను మరో రూ.50,000లపై ఎన్‌పీఎస్‌ రూపేణా పన్ను ఆదా చేసుకోవచ్చు. ఏడాదికి రూ.4.5 లక్షలు ఆపైన ఆదాయం ఉన్న వారికి ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఈ విధమైన ప్రయోజనం కూడా ఉంది. ఇక ఉపసంహరణ సమయంలో పన్ను మినహాయింపు లేని పథకం ఇది. చివర్లో సమకూరిన నిధిలో 40 శాతం యాన్యుటీకి వెళుతుంది. 20 శాతంపై ఆదాయపన్ను చెల్లించాలి. మిగిలిన 40 శాతం పన్ను రహితం.

రాబడి ఏ స్థాయిలో ఉంటుంది?
ఈపీఎఫ్‌లో 2016–17 సంవత్సరానికి గాను కేంద్రం 8.65 శాతం వడ్డీ రేటును ఇచ్చింది. ఎన్‌పీఎస్‌లో మార్కెట్‌ అనుసంధానిత ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్లలో రాబడులు ఎక్కువగా ఉన్నాయి. ఏడాదిలో 20 శాతానికిపైగా రాబడులను ఇచ్చిన పథకాలు ఉన్నాయి. నిజానికి ఈ రెండూ భిన్న అవసరాలను తీర్చేవి గనుక రెండింటిలోనూ ఇన్వెస్ట్‌ చేయడం మంచిదని ఫైనాన్షియల్‌ ప్లానర్లు సూచిస్తున్నారు. రిటైర్మెంట్‌కు ముందు ఎదురయ్యే కీలక లక్ష్యాలకు ఈపీఎఫ్‌ నిధి ఉపయోగపడుతుంది. ఈపీఎఫ్‌ను కదిలించకుండా తమ అవసరాలను తీర్చుకోగలిగితే రిటైర్మెంట్‌ తర్వాత ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌ రెండూ కలిపి పెద్ద నిధి సమకూరుతుంది. దాన్ని సరైన రాబడినిచ్చే పథకంలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మలి జీవితాన్ని హాయిగా గడిపేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement