కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై రిటైర్మెంట్ సొమ్ము భారీగా పెరగనుంది. ఈ మేరకు నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో నిబంధనలను ప్రభుత్వం సవరించింది. పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ సివిల్ ఉద్యోగుల సర్వీస్ సంబంధిత విషయాలను నియంత్రించడానికి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ అమలు) రూల్స్, 2021ని నోటిఫై చేసింది.
కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి ఎన్‌పీఎస్ కింద ఉద్యోగి ప్రాథమిక వేతనంలో యజమాని చెల్లించే మొత్తాన్ని 14 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలి కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రతిపాదించారు. కేంద్ర సిబ్బంది, పబ్లిక్ గ్రీవెన్స్,పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే పెన్షనర్ల సంక్షేమ విభాగం ఎన్‌పీఎస్ కింద చెల్లించే మొత్తాలను వివరిస్తూ కొత్త ఆఫీస్ మెమోరాండమ్‌ను విడుదల చేసింది.
సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ అమలు) రూల్స్, 2021లోని రూల్ 7 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఉద్యోగి జీతంలో 14 శాతాన్ని వారి వ్యక్తిగత పెన్షన్ ఖాతాకు ప్రతి నెలా జమ చేస్తుంది. మెడికల్ లీవ్, ఉన్నత విద్య కోసం వెళ్లడం కొన్ని సందర్భాలలో మినహా ఉద్యోగి పెన్షన్ కాంట్రిబ్యూషన్ చెల్లించని సమయంలో ప్రభుత్వం కూడా తన వంతు మొత్తాన్ని చెల్లించదు.
ఇక ఉద్యోగి సస్పెన్షన్‌లో ఉన్నప్పుడు పెన్షన్ కాంట్రిబ్యూషన్స్ ఉద్యోగికి చెల్లించే జీవనాధార భత్యంపై ఆధారపడి ఉంటాయి. సస్పెన్షన్ కాలం తరువాత ఒకవేళ అది జీతం చెల్లించాల్సిన డ్యూటీ లేదా సెలవుగా వర్గీకరిస్తే ఆ మేరకు ప్రభుత్వం చందాలను సర్దుబాటు చేస్తుంది. ఉద్యోగులు ఫారిన్ సర్వీస్‌లో ఉన్నప్పుడు ఎన్‌పీఎస్ చందాలకు సంబంధించి కూడా మెమోరాండం వివరించింది. ఇవి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment