
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) ఆధ్వర్యంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్) కోసం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనుంది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పీఎఫ్ఆర్డీఏ ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ కేటగిరీల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అర్హులైన రిటైర్డ్ వ్యక్తులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌లో వివరాలు నమోదు చేసుకోవడానికి వీలు కల్పించే సరళీకృత, సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నిబంధనల కింద 2025 ఏప్రిల్ 1 నాటికి ఇప్పటికే సర్వీసులో ఉన్నవారు, ఎన్‌పీఎస్ పరిధిలోకి వచ్చేవారు, 2025 ఏప్రిల్ 1 తరువాత చేరిన కొత్త నియామకాలు, పదవీ విరమణ చేసిన, స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన, యూపీఎస్‌కు అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులతో సహా విభిన్న కేటగిరీల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మరణించిన ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా యూపీఎస్‌ను ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
ఏప్రిల్ 1, 2025 నుంచి యూపీఎస్‌లో చేరుతున్నారా.. లేదా.. అనే నిర్ణయాన్ని మూడు నెలల్లోగా తీసుకోవాలి. ఈ విధానాన్ని ఎంచుకోవాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని తిరిగి అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉండదు. ఏప్రిల్ 1, 2025 నుంచి ఆన్‌లైన్‌లో నమోదు, క్లెయిమ్ ఫారాలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
యూపీఎస్ విశేషాలివీ...
అష్యూర్డ్ పెన్షన్: ఉద్యోగులు రిటైర్మెంట్‌కు ముందు తమ చివరి 12 నెలల సగటు బేసిక్ వేతనంలో సగం మొత్తాన్ని పెన్షన్‌గా అందుకుంటారు. ఇందుకోసం కనీసం పాతికేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండాలి. అంతకంటే తక్కువైతే సర్వీసు కాలాన్ని బట్టి పెన్షన్ మొత్తం నిర్ధారణ అవుతుంది.
అష్యూర్డ్ మినిమం పెన్షన్: కనీసం పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి రిటైర్మెంట్ అనంతరం నెలకు రూ.10 వేల కనీస పెన్షన్ అందుతుంది. తద్వారా అల్ప వేతనాలుండే దిగువ స్థాయి ఉద్యోగులకు ఇది ఆర్థిక భద్రత కల్పిస్తుంది.
అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్: పెన్షనర్ మరణిస్తే కుటుంబానికి అతని పెన్షన్‌లో 60 శాతాన్ని అందజేస్తారు. తద్వారా ఆ కుటుంబానికి కనీస ఆర్థిక భద్రత కలుగుతుంది.
ఏకమొత్తంలో ప్రయోజనం: ప్రతి ఆర్నెల్ల సర్వీసుకూ నెలవారీ వేతనం (జీతం+డీఏ)లో పదోవంతు చొప్పున రిటైర్మెంట్ సమయంలో ఏకమొత్తంగా అందజేస్తారు. గ్రాట్యుటీ తదితర బెనిఫిట్లకు ఇది అదనం.
సర్వీసులో ఉన్న ఉద్యోగుల మాదిరిగా యూపీఎస్ పెన్షనర్లకు కూడా ద్రవ్యోల్బణ సూచిక, డీఆర్ ప్రయోజనాలను వర్తింపజేస్తారు.
ఇప్పటికే ఎన్‌పీఎస్ కింద రిటైరైన వారితో పాటు 2025 మార్చి 31 నాటికి రిటైరయ్యే ఉద్యోగులకు కూడా యూపీఎస్ వర్తిస్తుంది. వారికి గత బకాయిలను పీపీఎఫ్ వడ్డీరేటుతో చెల్లిస్తారు.
ఉద్యోగులు ఎన్‌పీఎస్, యూపీఎస్‌ల్లో దేన్నయినా ఎంచుకోవచ్చు.
ఇదీ చదవండి: భవిష్యత్తులో ఉచిత వైద్య కార్యక్రమాలు
యూపీఎస్ బెనిఫిట్ల నిమిత్తం ఉద్యోగులపై అదనపు భారమేమీ పడబోదు. పెన్షన్ ఖాతాకు వారి చెల్లింపుల వాటా 10 శాతంగానే కొనసాగుతుంది. కేంద్రం వాటా ఇప్పుడున్న 14 శాతం నుంచి 18.5 శాతానికి పెరగనుంది. దీనివల్ల కేంద్రంపై రూ.6,250 కోట్ల దాకా భారం పడనుంది. బకాయిల రూపేణా మరో రూ.800 కోట్ల భారం పడుతుందని అంచనా.
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యూపీఎస్‌ను అమలు చేయాలని కేంద్రం సూచించింది. తద్వారా 90 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment