నెలవారీ సంపాదనలో పొదుపు చేసిన మొత్తాన్ని.. రిటైర్మెంట్, పిల్లల విద్య, ఇల్లు కొనుగోలు తదితర లక్ష్యాలకు ఎలా కేటాయించుకోవాలి? ఇందుకు ఏదైనా ఆర్థిక సూత్రం ఉందా?
– వికాస్ సింగ్
మీ ఆదాయం, ప్రాధాన్యతలు, కాలవ్యవధికి అనుగుణంగా వివిధ లక్ష్యాల కోసం పొదుపు, పెట్టుబడులు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఒకరు తమ ఆదాయంలో కనీసం 20 శాతాన్ని పొదుపు చేసి, ఇన్వెస్ట్ చేయాలన్నది సాధారణ సూత్రం. ఈ పొదుపు మొత్తాన్ని వివిధ లక్ష్యాలకు ఎలా విభజించాలనే దానికి సార్వత్రిక సూత్రం అంటూ లేదు. వ్యక్తుల ఆదాయ పరిస్థితులు, రాబడుల ఆకాంక్షలు, లక్ష్యాలకు అనుగుణంగానే నిర్ణయించుకోవాలి.
మీ ప్రాధాన్యతలు, కాలవ్యవధికి అనుగుణంగా లక్ష్యాలను స్వల్పకాలం, మధ్యకాలం, దీర్ఘకాలం అంటూ వేరు చేయండి. దీర్ఘకాలం అంటే కనీసం ఏడేళ్లు అంతకుమించిన లక్ష్యాల కోసం ఈక్విటీ సాధనాలపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఇవి అద్భుతమైన రాబడులతోపాటు, కాంపౌండింగ్ ప్రయోజనాన్నిస్తాయి. 5–7 ఏళ్ల మధ్యకాల లక్ష్యాల కోసం ఈక్విటీ, డెట్ ఫండ్స్‌లో లేదా బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. వీటిల్లో వృద్ధి, స్థిరత్వం ఉంటుంది. 3–5 ఏళ్ల స్వల్ప కాలానికి సంబంధించిన లక్ష్యాల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.
ఇక క్రమం తప్పకుండా అంటే ఆరు నెలలు లేదా ఏడాదికోసారి అయినా మీ పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగానే ఉన్నాయా? అన్నది సమీక్షించుకోవాలి. లక్ష్యాలకు చేరువ అవుతున్న క్రమంలో ఈక్విటీ పెట్టుబడులను డెట్ సాధనాల వైపు మళ్లించుకోవాలి. క్రమం తప్పకుండా పొదుపు, వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునే చురుకైన ప్రణాళికను ఆచరణలో పెట్టండి.
నా వద్ద 2020లో కొనుగోలు చేసిన డెట్ ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని విక్రయిస్తే పన్ను భారం ఎలా పడుతుంది?
– పి.కె గుప్తా
స్థిరమైన రాబడులకు డెట్ ఫండ్స్ మంచి ఎంపిక. మీరు 2020లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేసి, ఇప్పుడు విక్రయిస్తే వచ్చిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి. పైగా లాభంలో ద్రవ్యోల్బణం ప్రభావం తీసివేసేందుకు (ఇండెక్సేషన్) అవకాశం లేదు. డెట్ ఫండ్స్ కొనుగోలు చేసిన తేదీ, ఎంత కాలం పాటు కొనసాగించారు, ఎప్పుడు విక్రయించారనే ఆధారంగా పన్ను భారం మారిపోతుంది.
2023 ఏప్రిల్ 1కి ముందు డెట్ ఫండ్స్ కొనుగోలు చేసిన వారికి ఇండెక్సేషన్ ప్రయోజనం లభిస్తుంది. కాకపోతే 36 నెలల పాటు వాటిని కొనసాగించి, 2024 జూలై 23లోపు విక్రయించిన వారికే ఈ ప్రయోజనం పరిమితం. మీ కొనుగోలు ధరలో ఇండెక్సేషన్ సర్దుబాటు జరుగుతుంది. దీంతో లాభంపై చెల్లించాల్సిన పన్ను కూడా తగ్గిపోతుంది. కాకపోతే 2023 ఏప్రిల్ 1కి ముందు కొనుగోలు చేసినప్పటికీ, 2024 జూలై 23లోపు విక్రయించని వారికి ఇండెక్సేషన్ ప్రయోజనం కోల్పోయినట్టే.
దీంతో గతంతో పోల్చితే డెట్ ఫండ్స్ లాభాలపై ప్రస్తుత పన్ను ఆకర్షణీయంగా లేదు. కాకపోతే మరింత కాలం పాటు డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు కొనసాగించడం ద్వారా సంప్రదాయ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే అధిక రాబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఎఫ్‌డీలపై వడ్డీ ఏటా పన్ను పరిధిలోకి వస్తుంది. డెట్ ఫండ్స్‌లో విక్రయించినప్పుడే లాభంపై పన్ను అమల్లోకి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment