
రమేశ్ ఓ ఐటీ కంపెనీలో టెక్నికల్ విభాగంలో పని చేస్తున్నాడు. అప్పటిదాకా హాయిగా నడిచిపోతున్న బతుకు బండి.. కరోనాతో కుదేలు అయ్యింది. ఉద్యోగం పోయింది. చేతిలో చిల్లిగవ్వలేక అప్పులవైపు అడుగులేశాడు. ఆశ్చర్యంగా రమేశ్ పరిస్థితే సురేష్‌కు ఎదురైనా.. అప్పులను ఆశ్రయించలేదు. మరో ఉద్యోగం దొరికేదాకా కుటుంబ అవసరాలను సజావుగా తీర్చుకుంటూ పోయాడు. అత్యవసర నిధి ఆవశ్యకతను గుర్తించాడు కాబట్టే రమేశ్‌లా సురేష్ కష్టపడలేదు.
అత్యవసర నిధి.. సింపుల్‌గా చెప్పాలంటే ఆకస్మిక నిధి. ఊహించని పరిస్థితులు, సంక్షోభాల ప్రభావం వచ్చేఆదాయంపై పడినప్పుడు ఉపయోగపడే సేవింగ్స్ అనుకోవచ్చు. వైద్య ఖర్చులు, తప్పనిసరి గృహ మరమ్మతులు, ఆకస్మికంగా ఉపాధి కోల్పోవడం, యుద్ధాలు, కరోనా వైరస్ వంటి మహమ్మారులు, అంటువ్యాధులాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు.. అప్పులు చేయకుండా వ్యక్తుల్ని నిలువరించగలుగుతుంది. క్లిక్: స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఏది బెటర్ అంటే..
ఎంత మొత్తం కావాలి?
సాధారణంగా అత్యవసర పరిస్థితులు రోజులు, వారాలు, నెలలు కొనసాగొచ్చు. కాబట్టి ఆరు నుంచి ఏడాది ఖర్చులకు సరిపడా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. అఫ్‌కోర్స్.. అందిరికీ ఒకేలా ఉండకపోవచ్చు. అందుకనే ఉద్యోగంలో మొదలైనప్పటి నుంచే కొంత డబ్బును పక్కనపెట్టుకుంటూ వెళ్లాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఖర్చులు, భాద్యతలు పెరుగుతాయి. అలాంటప్పుడు దశల వారీగా ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసుకుంటూ వెళ్లాలి.
రాబట్టుకోవచ్చు కూడా..
అవసరానికి అందుబాటులో డబ్బును ఇంట్లో ఉంచుకోవడం లేదంటే బ్యాంక్ అకౌంట్‌లో దాచుకోవడం చేస్తుంటారు. అలాగని దాచిన డబ్బు.. అలాగే మూలుగుతుంటే ఏం లాభం? అందుకే డబ్బు అందుబాటులో ఉండడంతోబాటు, దానిపై రాబడి ఉండడమూ ముఖ్యమే. ఇందుకోసం సేఫ్ సైడ్ అప్పులివ్వడం, పొదుపు ఖాతా లేదంటే అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉంచొచ్చు. తద్వారా డబ్బు అవసరమైనప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా విత్‌డ్రా చేసుకునేందకు వీలుంటుంది. విత్‌డ్రా సమయంలో ఎటువంటి పెనాల్టీలు పడకుండా జాగ్రత్త పడాలి. లేదంటే రాబడి తగ్గిపోతుంది. ఇక ఏటీఎంల చుట్టూ తిరిగే అవసరం లేకుండా.. డిజిటల్ పే తలనొప్పులు లేకుండా చూసుకోవాలంటే కొంత డబ్బును ఇంట్లోనే దాచుకోవడం ఉత్తమం.
మ్యానేజ్ ముఖ్యం
అత్యవసర నిధిలో వైద్య ఖర్చులు, చిన్న చిన్న ప్రమాదాలు/ కారు మరమ్మతు ఖర్చులు వంటి వాటి కోసం కేటాయించే మొత్తంపై పునరాలోచించాలి. ఎందుకంటే హెల్త్, మోటారు వంటి వాటికి ఇన్సురెన్స్ (బీమా) ఉంటుంది. తిరిగి బీమా ద్వారా పొందే అవకాశం ఉన్నప్పుడు, అత్యవసర నిధిలో ఎక్కువ మొత్తం కేటాయించాల్సిన అవసరం ఏముంది?. అందుకే అత్యవసర నిధిని ప్రాధాన్యం ఉన్న వాటికి, చాలా ప్లాన్డ్‌గా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎమర్జెన్సీ ఫండ్స్ ఏర్పాటు చేసుకున్నాం.. ఖర్చు పెట్టేశాం అని కాకుండా ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహించుకోవాలి. ఈ పునఃసమీక్ష ఏడాదిలో ఒకసారైనా ఉంటే మరీ మంచిది. అలాగే పిల్లలకు సేవింగ్స్ అలవాటు చేయడం ద్వారా.. భవిష్యత్‌లో ఎమర్జెన్సీ ఫండ్ ఆవశ్యకత తెలిసి వస్తుంది.
-కేజీ, ఆర్థిక నిపుణుడు
చదవండి: రాబడులు, రక్షణ ఒకే పథకంలో..
Comments
Please login to add a commentAdd a comment