పిల్లల కోసం ప్రత్యేక పొదుపు పథకం ‘ఎన్‌పీఎస్ వాత్సల్య’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాల పెట్టుబడులు పెట్టాలనుకునే తల్లిదండ్రులు ఈ పెన్షన్ ఖాతాలను తెరవచ్చు. 2024-25 యూనియన్ బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించిన ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం కింద తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ మైనర్ పిల్లలకు పెన్షన్ పొదుపును ప్రారంభించచ్చు. ఇది భారతీయ పౌరులతోపాటు ఎన్‌ఆర్‌ఐలకు కూడా సౌకర్యవంతమైన దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుంది. ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతా పిల్లలకి 18 ఏళ్లు నిండగానే ప్రామాణిక ఎన్‌పీఎస్ ఖాతాగా మారుతుంది. తద్వారా భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం నిరంతర పెట్టుబడిని కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: బంగారం మళ్లీ తగ్గుముఖం! ఈసారి ఎంతంటే..
బ్యాంకులు, పోస్టాఫీసులు, పెన్షన్ ఫండ్‌లు లేదా ఈ-ఎన్‌పీఎస్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతాను తెరవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ ముంబై సర్వీస్ సెంటర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించింది. కొత్త ఖాతాలను నమోదు చేసి సింబాలిక్ ప్రాన్ (PRAN-పర్మనెంట్ రిటైర్‌మెంట్ అకౌంట్ నంబర్) కార్డ్‌లను జారీ చేసింది. ఐసీఐసీఐ, యాక్సిస్‌తో సహా ప్రధాన బ్యాంకులు ఈ పథకాన్ని ప్రోత్సహించడానికి ముందుకు వచ్చాయి.
వీటిలో పెట్టిన మొత్తాన్ని ఈక్విటీలు, కార్పొరేట్ డెట్, ప్రభుత్వ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తారు. తద్వారా వచ్చే రిటర్న్స్‌ను ఖాతాల్లో జమ చేస్తారు. ఈ కార్పస్ ఫండ్‌ను ఖాతాదారు 60 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే తీసుకునేందుకు వీలుంటుంది. అయితే మూడేళ్ల లాక్‌ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత విద్య, అనారోగ్యం వంటి కారణాలకు పాక్షికంగా ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment