రిటైర్మెంట్.. ఏదో ఒకరోజు ఆహ్వానించాల్సిందే. ఉద్యోగాల్లో ఉన్న వారికి కాస్త ముందు, స్వయం ఉపాధుల్లోని వారికి కొంత ఆలస్యంగా అయినా.. వృద్ధాప్యంలో పని జీవితం నుంచి విశ్రాంతి అవసరమే. అప్పటి వరకు సంపాదనతో నడిచిన జీవితం.. ఆ తర్వాత కూర్చుని కొనసాగించాలంటే అందుకు ముందు నుంచే ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాల్సిందే. రిటైర్మెంట్ కోసం పొదుపును పెద్దగా పట్టించుకోని ధోరణి యుక్త వయసులోని వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. రిటైర్మెంట్ కోసం చాలా సమయం ఉందన్నది వారి ఆలోచనా తీరు. ఈ ధోరణితో రిటైర్మెంట్ ప్రణాళికను వాయిదా వేస్తే.. వివాహంతో గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత పిల్లలు, వారి ఉన్నత విద్య, వారి వివాహాలు, సొంతిల్లు, కారు తదితర లక్ష్యాలు ముఖ్యమైనవిగా మారతాయి. దీంతో తమ విశ్రాంత (వృద్ధాప్య) జీవనానికి సంబంధించిన ప్రణాళిక పక్కకు వెళ్లిపోతుంది. కారణం ఏదైనా కానీయండి.. వయసుతో సంబంధం లేకుండా సంపాదించే గ్రూపులో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ పదవీ విరమణ జీవితానికి పొదుపును తక్షణం ప్రారంభించడమే మంచి పరిష్కారం. ఇది ఎంత ముందుగా ప్రారంభిస్తే అంత సులభంగా కావాల్సినంత సమకూర్చుకోవడం
సాధ్యపడుతుంది. ఇందుకు ఏం చేయాలో చూద్దాం..
ఉద్యోగులు అయితే ‘ఉద్యోగుల భవిష్య నిధి’ (ఈపీఎఫ్) సదుపాయం ఉంటుంది. వేతనంలో ప్రతీ నెలా నిర్ణీత శాతం మేర ఈపీఎఫ్ ఖాతాకు వెళుతుంటుంది. ఉద్యోగి వాటాకు సమానంగా పనిచేయించుకునే సంస్థ కూడా తన వంతు వాటాను సమకూర్చడం ఇందులోని విశేషం. ఉద్యోగి ప్రమేయం లేకుండా క్రమం తప్పకుండా ప్రతీ నెలా భవిష్యనిధి ఖాతాకు జమ కావడం వల్ల దీన్ని మంచి సాధనంగా నిపుణులు చెబుతారు. దీనికి విరుద్ధంగా చాలా మంది ఈపీఎఫ్ విషయంలో తప్పుగా వ్యవహరిస్తుండడాన్ని చూడొచ్చు. తమ అవసరాలకు ఈపీఎఫ్ నిధిపై ఆధారపడుతుంటారు. ఇల్లు కొనుగోలు, ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ నిధిని వెనక్కి తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవడాన్ని చూడొచ్చు. ఇలా చేయడం అన్ని సందర్భాల్లోనూ సరైనది కాదు. ఈపీఎఫ్ నిధిని కదపకుండా.. రిటైర్మెంట్ తర్వాత ఉపసంహరించుకోవడం వల్ల మంచి నిధిని చేతికందుకోవచ్చు. ప్రతీ ఉద్యోగికీ సాధ్యమయ్యే రిటైర్మెంట్ పొదుపు సాధనంగా దీన్ని చూడాలి. మరి రిటైర్మెంట్ జీవితానికి ఈపీఎఫ్ ఒక్కటి సరిపోతుందా..? లేదు. మరింత అదనంగా పొదుపు, మదుపు చేసుకుంటూ వెళ్లాలి. ఎంత మొత్తం అన్నది మీరు తీసుకునే రిస్క్, ఇన్వెస్ట్ చేయగలిగే మొత్తంపై ఆధారపడి ఉంటుంది. రిస్క్ తీసుకోని రక్షణాత్మక ధోరణి ఇన్వెస్టర్ అయితే డెట్ సాధనాలను పెట్టుబడులకు ఎంచుకోవాలి. ఓ మోస్తరు రిస్క్ అయినా ఫర్వాలేదనుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనుకూలం.
ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్.. ప్రయోజనాలు
ఈపీఎఫ్
ఉద్యోగుల భవిష్యనిధిలో జమ అయ్యే మొత్తాలకు సెక్షన్ 80సీ కింద పన్ను పడదు. ఉద్యోగి వాటాతోపాటు, సంస్థ జమ చేసే వాటా కూడా పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తుంది. అంతే కాదు రిటైర్మెంట్ సమయంలో ఈపీఎఫ్ నుంచి తీసుకునే మొత్తంపైనా పన్ను మినహాయింపు ఉంటుంది. ఇందులో పెట్టుబడులు, రాబడులు, ఉపసంహరణల మొత్తం కూడా పన్ను లేనిదే. అందుకే ఉద్యోగాలలో ఉన్న వారు అనవసరాలకు ఈపీఎఫ్ నిధిని ఖాళీ చేయకుండా, రిటైర్మెంట్ కోసం కొనసాగించుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఒక సంస్థ నుంచి వేరే సంస్థకు మారినా, ఈపీఎఫ్ నిధిని బదిలీ చేసుకుని, కొనసాగించుకోవాలి.
వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్
ఈపీఎఫ్‌కు అనుసంధానంగా పనిచేసే వీపీఎఫ్‌ను వినియోగించుకునే వారు చాలా తక్కు వ మందే. ఈపీఎఫ్ వాటా మూల వేతనంలో 12 శాతానికే పరి మితం. కానీ, వీపీఎఫ్ విషయానికొస్తే మూలవేతనం, డీఏ రెండింటికి సమాన స్థాయిలో ప్రతీ నెలా పొదుపు చేసుకునేందుకు అనుమతి ఉంది. ఈపీఎఫ్ వడ్డీ రేటే వీపీఎఫ్‌కూ అమలవుతుంది కనుక.. మెరుగైన ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. ఇందు లో జమ చేసే మొత్తానికీ పన్ను మినహాయింపు పొందొచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
వేతన జీవులు కాని వారికి పీపీఎఫ్ ఒకానొక సాధనం అవుతుంది. రాబడులు ఈపీఎఫ్‌తో పోలిస్తే ప్రస్తుతానికి ఒక శాతానికి పైగా తక్కువగా ఉన్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఇందులో రాబడులు, ఉపసంహరణలకూ పన్ను మినహాయింపు ఉంది కనుక ఇది కూడా డెట్‌లో ఒక మెరుగైన ఆప్షన్ అని చెప్పుకోవాలి.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్
ఆర్జన ఆరంభమైన నాటి నుంచి రిటైర్మెంట్‌కు చాలా సమయం ఉంటుంది. కనుక ముందే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ ఆరంభించినట్టయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఘనంగా సమకూర్చుకోవచ్చు. మధ్యస్థ రిస్క్ ఉన్నా ఫర్వాలేదనుకుంటే.. ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకుని ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. ద్రవ్యోల్బణాన్ని అధిగమించి సంపదను సృష్టించుకునే మార్గం ఈక్విటీలు. కాకపోతే ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్ పనితీరును ఏడాదికోసారి తప్పకుండా సమీక్షించుకోవాలి.
ఈఎల్‌ఎస్‌ఎస్
ఈక్విటీల్లోనే ఇవి ఒక విభాగం. ఇందులో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద పన్ను రాయితీ పొందొచ్చు. రాబడులను వెనక్కి తీసుకున్న సమయంలో మాత్రం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 10 శాతం (రూ.లక్ష మించిన మొత్తాలపై) చెల్లించాల్సి ఉంటుంది. అయినా, రిటైర్మెంట్ కోసం ఈ పథకాలను ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం మంచి మార్గమే అవుతుంది. అంతేకాదు, రిటైర్మెంట్ తర్వాత ఈక్విటీ పథకాల నుంచి ఏకమొత్తంలో ఉపసంహరించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రతీ నెలా తమ అవసరాలకు కావల్సిన మొత్తాన్ని రిడెండప్షన్ చేసుకుంటూ వెళ్లొచ్చు. అప్పుడు మిగిలి ఉన్న పెట్టుబడులకు రాబడులు జమవుతూ ఉంటాయి.
ఎన్‌పీఎస్
ఇది పూర్తిగా రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం ఉద్దేశించిన సాధనం. ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఇప్పుడు తప్పనిసరి అమల్లో ఉన్న పెన్షన్ సాధనం ఇదే. ప్రైవేటు రంగ సంస్థలు తమ అభీష్టం మేరకు ఈపీఎఫ్‌కు బదులు ఎన్‌పీఎస్‌ను కూడా ఎంచుకోవచ్చు. స్వచ్ఛందంగా ఎవరైనా ఎన్‌పీఎస్‌లో భాగం కావచ్చు. ఇందులో డెట్, ఈక్విటీల కలయికగా పెట్టుబడుల ఆప్షన్ ఎంచుకునేందుకు వీలుంది. ఎంత మేర ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయించుకోలేకపోతే.. వయసు ఆధారంగా ఈక్విటీ, డెట్ శాతాలను నిర్ణయించే ఆటో చాయిస్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అయితే, ఈపీఎఫ్, పీపీఎఫ్ సాధనాల్లో మెచ్యూరిటీ తర్వాత మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు వీలుంటుంది. కానీ, ఎన్‌పీఎస్‌లో అలా కాదు.. 60 ఏళ్లనాటికి సమకూర్చుకున్న నిధిలో 60 శాతాన్నే వెనక్కి తీసుకునేందుకు వీలుంటుంది. ఈ మొత్తంపై పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. మిగిలిన 40 శాతంతో పెన్షన్ ఇచ్చే యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా యాన్యుటీ ప్లాన్ నుంచి ప్రతీ నెలా అందుకునే మొత్తం ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. ఇలా మెచ్యూరిటీ తర్వాత కచ్చితంగా యాన్యుటీలో 40 శాతాన్ని ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధన కొందరికి నచ్చకపోవచ్చు. అటువంటి వారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈక్విటీ, డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు.
రక్షణాత్మక ధోరణి కలిగిన విభాగంలోకి మీరు వస్తే.. ఈపీఎఫ్ ఖాతాకు ప్రతీ నెలా మీ వంతు అదనంగా జమ చేయడం ఒక మంచి మార్గం. దీన్నే వాలంటరీ ప్రావిడెంట్ ఫంఢ్ (వీపీఎఫ్) అంటారు. ఈపీఎఫ్ నిల్వలపై అమలయ్యే వడ్డీ రేటే వీపీఎఫ్‌కూ వర్తిస్తుంది. డెట్ సాధనాల్లో ఈపీఎఫ్ అత్యధిక రిటర్నులు అందిస్తున్న ఒక సాధనమని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేయని వారు ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)ని ఎంచుకోవచ్చు. కాకపోతే ఇందులో రాబడులు కాస్త తక్కువగా ఉంటాయి. ఈపీఎఫ్‌తోపాటు వీపీఎఫ్ లేదా పీపీఎఫ్ రూపంలో రిటైర్మెంట్‌కు కావాల్సిన మేర నిధికి ప్రణాళిక వేసుకోవడం మంచి ఆలోచనే అవుతుంది. అయితే, డెట్ సాధనాల్లో వచ్చే రాబడిలో అధిక శాతం ద్రవ్యోల్బణ ప్రభావానికే కరిగిపోతుంది. కనుక అధిక రాబడుల కోసం కొంత మొత్తాన్ని అయినా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మోస్తరు నుంచి అధిక రిస్క్ తీసుకునే వారికి ఈక్విటీలు అనుకూలమైన పొదుపు సాధనమని చెప్పుకోవాలి. ఈపీఎఫ్, వీపీఎఫ్, పీపీఎఫ్, ఈక్విటీ ఫండ్స్ కలయికతో పెట్టుబడుల ప్రణాళిక రూపొందించుకున్నామెరుగ్గానే ఉంటుంది. 20–30ల్లోనే ఉండి ఆదాయం మొదలు పెట్టిన వారు ఈక్విటీలకు అధిక కేటాయింపులు చేసుకోవడం ద్వారా భారీ నిధిని సమకూర్చుకునే అవకాశం సొంతం చేసుకోవచ్చు. రిటైర్మెంట్‌కు కనీసం 20–30 ఏళ్లు అయినా ఉంటే, ఈక్విటీల కలయికగా పెట్టుబడులను ప్లాన్ చేసుకోవాలి.
పెంచుతూ పోవడం పరిష్కారం
ఆదాయం పెరుగుతూ వెళుతున్నట్టే.. రిటైర్మెంట్ కోసం చేసే పొదుపు మొత్తాన్ని కూడా అంతే మేర పెంచుకుంటూ వెళ్లాలి. వీలైనంత ముందుగా పెట్టుబడులను ప్రారంభించాలి. చెప్పడం సులభం.. ఆచరణే కష్టం. కానీ, ఆరంభించేంత వరకే కష్టం. ఒక్కసారి మొదలు పెడితే, దానికి తగినట్టు ఖర్చులను సర్దుబాటు చేసుకోవచ్చు. రిటైర్మెంట్ కోసం కొంత మొత్తం కావాలన్న అవసరాన్ని ఒక్కొక్కరు ఒక్కో సమయంలో గుర్తిస్తుంటారు. కొందరు అయితే అప్పటి సంగతి అప్పుడే చూసుకోవచ్చనుకుంటారు. కానీ, ముందుగా ప్రారంభించినట్టయితే.. దానికి కాంపౌండింగ్ (వృద్ధి) శక్తి తోడవుతుంది. దాంతో దీర్ఘకాలానికి గణనీయమైన మొత్తాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు మధ్య వయసు కూడా దాటి, రిటైర్మెంట్ పొదుపును ఇంకా ప్రారంభించలేదని ఆలోచిస్తున్నారా..? ఆందోళన చెందకుండా వెంటనే ఆచరణలో పెట్టడం ఉత్తమం. ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే 45–50లకు చేరిన తర్వాత రిటైర్మెంట్ కోసం పొదుపు మొదలు పెట్టడం వల్ల అవసరమైనంత నిధి సమకూరదు. చిన్న వయసులో అయితే సంపాదనలో కొంత భాగాన్ని పక్కన పెట్టినా సరిపోతుంది. కానీ, ఆలస్యం చేసిన కొద్దీ సంపాదనలో భారీ మొత్తాన్ని రిటైర్మెంట్‌కు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రిటైర్మెంట్ అవసరాలకు ఎంత మేర కావాలి, అందుకు ఏం చేయాలన్న విషయమై సందేహాలు ఉంటే ఆర్థిక సలహాదారులను సంప్రదించి వారిచ్చే సూచనలను అనుసరించాలి.
Comments
Please login to add a commentAdd a comment