కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌కు విశేషాదరణ
ఖాతాలు తెరిచేందుకు వచ్చే ఏడాది మార్చి 31 వరకే గడువు
పోస్టాఫీసులు, నిర్దేశించిన బ్యాంకుల్లో ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’
రూ.1,000 నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం
రెండేళ్ల తర్వాత 7.5 శాతం వడ్డీతో తిరిగి చెల్లింపు
ఇప్పటికే దేశవ్యాప్తంగా 43.30 లక్షల ఖాతాలు తెరిచిన మహిళలు
8వ స్థానంలో ఏపీ.. రాష్ట్రంలో 2.11 లక్షల ఖాతాలు
సాక్షి, అమరావతి: మహిళల ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ అనే పొదుపు పథకం విశేష ఆదరణ పొందుతోంది. మహిళలు, బాలికల కోసం ఈ పథకాన్ని 2023–24 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖాతాలు ప్రారంభించడానికి ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2025 వరకు మాత్రమే అవకాశం కల్పించింది. మహిళలు తమ పేరు మీద పోస్టాఫీసులు లేదా నిర్దేశించిన బ్యాంకుల్లో ఈ ఖాతాలు తెరవచ్చు. మైనర్ బాలికల పేరుతో సంరక్షకులు ఖాతా తెరిచే అవకాశం కల్పించారు.
కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన తేదీ నుంచి రెండేళ్ల తర్వాత 7.5 శాతం వడ్డీతో తిరిగి ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. అలాగే పాక్షిక ఉపసంహరణ సౌకర్యం కూడా కల్పించారు. ఖాతా తెరిచిన తేదీ నుంచి సంవత్సరం తర్వాత ఖాతా బ్యాలెన్స్‌లో 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వ మద్దతుతో కూడిన చిన్న పొదుపు పథకం.
అందువల్ల దీనికి ఎలాంటి రిస్క్ కూడా ఉండదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 43.30 లక్షల ఖాతాలు తెరిచారని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 7,46,223 ఖాతాలతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా.. 2,11,016 ఖాతాలతో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచింది. ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ ఖాతాలు తెరిచేందుకు వచ్చే ఏడాది మార్చి 31 వరకే గడువు ఉంది. అందువల్ల వీలైనంత త్వరగా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రూ.31,125 వడ్డీ..
ఈ పథకం కింద రూ.2,00,000 డిపాజిట్ చేస్తే సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. మొదటి సంవత్సరంలో రూ.15,000 వడ్డీ, రెండో సంవత్సరంలో రూ.16,125 వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా రెండేళ్ల గడువు పూర్తయ్యేనాటికి వడ్డీతో కలిపి రూ. 2,31,125 మేర ప్రయోజనం పొందుతారు.
Comments
Please login to add a commentAdd a comment