పెట్టుబడులకు మరోమార్గం... మ్యూచువల్ ఫండ్స్ | How to Invest in Mutual Funds | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు మరోమార్గం... మ్యూచువల్ ఫండ్స్

Published Sun, Dec 15 2024 9:34 AM | Last Updated on Sun, Dec 15 2024 9:40 AM

How to Invest in Mutual Funds

విత్తనాలు నాటితే మొక్కలు వస్తాయి. చెట్లుగా.. ఆపై వృక్షాలుగా ఎదుగుతాయి. పూలు, పళ్ళు ఇస్తాయి. ఇదంతా ఒక్క రోజులో జరిగిపోదు.డబ్బులకూ అదే సూత్రం వర్తిస్తుంది. డబ్బులు నాటితే డబ్బులు మొలకెత్తుతాయి. ఆపై అవి లక్షలు, కోట్లుగా రూపాంతరం చెందుతాయి. ఇది కూడా ఒక్ కరోజులో జరిగే పని కాదు. మన కష్టార్జితాన్ని ఇంతలింతలు చేసుకోవడానికి ఎలాంటి సాధనాలు ఎంచుకోవాలి అన్నదే ప్రధాన ప్రశ్న.

మీరు అధ్యయనం చేసి... నిపుణుల సలహా తీసుకుని..తెలివి తేటలతో వ్యవహరించి పెట్టుబడులు పెట్టగలిగితే.. దీర్ఘకాలంలో మంచి రాబడి పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా మన సొమ్ములు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే సాధనాలు ఏవో తెలిసి ఉండాలి. దాని కంటే ముందే మీదగ్గరున్న డబ్బుల నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారో కూడా మీకు తెలిసి ఉండాలి. లేదంటే ఏళ్ళుగడిచినా.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న మాదిరి మీ జీవితం ఎదుగూ బొదుగూ ఉండదు.

తాము చేసే పొదుపు బాగా పెరగాలని, రెట్టింపు అవ్వాలని ఎవరు అనుకోరు చెప్పండి. మీరూ ఇందుకు మినహాయింపు కాదంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే... కాస్త రిస్క్‌ తీసుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉండటం. కొద్దిగా రిస్క్‌ తీసుకోగలిగి... దీర్ఘకాలంపాటు వేచిఉండేవాళ్ళకు అనువైన పెట్టుబడి సాధనంగా మ్యూచువల్‌ ఫండ్స్ అని చెప్పొచ్చు.

స్టాక్‌ మార్కెట్లో 100% రిస్క్ తీసుకోలేనివాళ్లకు ఉపయుక్తమైన పెట్టుబడి మార్గం మ్యూచువల్‌ ఫండ్స్. మనం ఈ ఫండ్స్‌లో  సరైన వాటిని ఎంచుకుని పెట్టుబడి పెడితే కొన్నాళ్ళకు అవి మంచి రాబడి అందిస్తాయి. ఇందులో రెండు రకాలు ఉంటాయి.
1. సిప్స్
2. పెద్దమొత్తంలో ఒకేసారి పెట్టుబడి

మీరు ఒక మ్యూచువల్‌ ఫండ్‌ స్కీను ఎంచుకుని నెలకు కొంత మొత్తం చొప్పున పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు. ఇదే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్ (సిప్). అధిక మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టలేని వాళ్లకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఇక మీచేతిలో తగినంత మొత్తం ఉండి పెద్దమొత్తంలో పెట్టి దీర్ఘకాలం వేచి ఉంటే మంచి రాబడి పొందడం రెండో మార్గం.

ఎలాంటి ఫండ్స్ ఎంచుకోవాలి?
మ్యూచువల్‌ ఫండ్స్‌ను వివిధ టాటా, బిర్లా, రిలయన్స్, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రముఖ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. అయితే మనపెట్టుబడికి తగ్గట్టు, స్థిరంగా రాబడి అందివ్వగల ఫండ్స్‌ను ఎంచుకోవాలి. యాంఫి (AMFI) వెబ్సైటులో ఫండ్స్ కు సంబంధించిన యావత​ సమాచారం దొరుకుతుంది.

ప్రస్తుతం దేశంలో వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు అందిస్తున్న స్కీంల్లో ప్రధానమైనవాటిగా ఈకింది వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు.  

» ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌  ఫోకస్డ్‌ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్
» ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ స్మాల్‌ & మిడ్‌ క్యాప్‌ ఫండ్
» టాటా ఈక్విటీ పీఈ ఫండ్
» హెచ్‌డీఎఫ్‌సీ మంత్లీ ఇన్‌కమ్‌ ప్లాన్
» ఎల్&టీ టాక్స్ అడ్వాంటేజ్‌ ఫండ్
» ఎస్బీఐ నిఫ్టీ ఇండెక్స్‌ ఫండ్
» కోటక్‌ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్
» కెనరా రోబెకో గిల్టీ పీజీఎస్
» డీఎస్పీ బ్లాక్‌రాక్‌ బ్యాలెన్స్‌డ్‌ ఫండ్
» యాక్సిస్‌ లిక్విడ్‌ ఫండ్

వీటికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా పరిశీలించి ఎంతెంత రాబడి అందిస్తున్నాయి, రిస్క్ ఏ స్థాయిలో ఉంటుంది, పెట్టుబడి ఎలా పెట్టాలి, కాలావధి, వివిధ రేటింగ్ సంస్థలు ఇచ్చిన రేటింగ్, గతకాలపు పనితీరు.... ఇత్యాది అంశాలు సంపూర్ణంగా విశ్లేషించుకుని పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.

ఇక అధిక రిస్క్‌తోపాటు అధికరాబడి ఇస్తున్న ఫండ్స్‌ విషయానికొస్తే...  

» హెచ్ఎస్‌బీసీ మిడ్‌ ​క్యాప్‌ ఫండ్
» కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్
» ఐసీఐసీఐ ప్రూడెన్షియల్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్
» యాక్సిస్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్
» ఎస్బీఐ స్మాల్‌ క్యాప్‌ ఫండ్
» మిరే అసెట్‌ మిడ్‌ క్యాప్‌ ఫండ్
» టాటా మిడ్‌ క్యాప్‌ గ్రోత్‌ ఫండ్‌

పై వాటిని ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు, ఇక మహీంద్రా మేన్యూ లైఫ్‌ మిడ్‌ క్యాప్‌ ఫండ్‌, సుందరం మిడ్‌ క్యాప్ ఫండ్‌ లు 30 శాతంపైగా వార్షిక రిటర్న్ లు అందిస్తున్నాయి. సిప్‌ పెట్టుబడుల విషయానికొస్తే... గత అయిదేళ్లుగా ఇన్వెస్కో ఇండియా మిడ్‌ క్యాప్‌ ఫండ్ 30 శాతంపైగా రాబడి ఇస్తోంది.

మ్యూచువల్‌ ఫండ్స్ ఏం చేస్తాయి?
మ్యూచువల్‌ ఫండ్స్‌ మీ దగ్గర సమీకరించిన సొమ్ముల్ని స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. అలాచేయడానికి ముందే మీ రిస్క్ కెపాసిటీ, మీ ఆలోచనలు, రాబడి అంచనాలు... వంటి సమాచారాన్ని మీ దగ్గర నుంచి సేకరిస్తాయి. తదనుగుణంగా మీ సొమ్ముల్ని వివిధ పెట్టుబడి మార్గాల్లోకి మళ్లిస్తాయి.

» సెక్టోరియల్‌ ఫండ్స్
» టాక్స్‌ సేవింగ్‌ ఫండ్స్
» ఇండెక్స్‌ ఫండ్స్
» డెట్‌ ఫండ్స్
» స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్
» మిడ్‌ క్యాప్‌ ఫండ్స్
» లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్

ఇలా భిన్నమైన మార్గాల్లో మీ సొమ్ములను ఇన్వెస్ట్‌ చేస్తాయి. తద్వారా వచ్చే రాబడిని మీకు బదిలీ చేస్తాయి (ట్యాక్స్‌లు, కమీషన్లు, చార్జీలు వసూలు చేసుకుని).

స్టాక్‌ మార్కెట్‌తో  పోలిస్తే మ్యూచువల్‌ ఫండ్స్‌లో  పెట్టుబడులు పెట్టే వారికి రిస్క్‌ తక్కువే ఉంటుంది. కానీ రాబడి కూడా అదేస్థాయిలో ఉంటుంది. కాబట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా ఫండ్ స్కీంలకు సంబంధించిన సమాచారాన్ని మదింపు చేసిన తర్వాతే ముందడుగు వేయడం మంచిది. వివిధ ఫండ్‌లకు సంబంధించి విశ్లేషణాత్మక సమాచారాన్ని రాబోయే రోజుల్లో తెలుసుకుందాం.

-బెహరా శ్రీనివాసరావు, స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement