Stock market: ఈ ట్రాప్‌లో పడకండి | Dont Fall into the Trading Psychology Trap | Sakshi
Sakshi News home page

Stock market: ఇలాంటి ట్రాప్‌లో పడ్డారో అంతే.. మీకూ ఇతని గతే..!

Published Wed, Dec 11 2024 9:26 AM | Last Updated on Wed, Dec 11 2024 9:56 AM

Dont Fall into the Trading Psychology Trap

స్టాక్ మార్కెట్లో ఏమాత్రం అనుభవం లేకుండా డబ్బులు సంపాదించేయాలి అనుకుంటే అంతకుమించిన బుద్ధి పొరపాటు మరోటి ఉండదు. మిమ్మల్ని ఎలా ట్రాప్ లో ఇరికించి పబ్బం గడుపుకొంటారో మీకు అర్ధమయ్యేలా చెబుతా.. దయచేసి ఇలాంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. నాకు తెల్సిన ఒక మిత్రుని కథ అనుకోండి... వ్యథ అనుకోండి... అదెలాగో చెబుతా...

నాకు బాగా కావాల్సిన మిత్రుడే... అతనికి అంతో ఇంతో స్టాక్ మార్కెట్ నాలెడ్జి ఉంది.. తన దగ్గరున్న డబ్బులతో కాస్తో కూస్తో బాగానే సంపాదించుకుంటున్నాడు. ఎప్పటినుంచో సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక.అందుకు తగ్గట్టే నాలుగు రూపాయలు రెడీ చేసుకుని... బ్యాంకు లోన్ కూడా తీసుకుని ఇంటి పనులు మొదలెట్టాడు. అవి చివరి దశకు వచ్చాయి.  ఓ 3 లక్షలు ఎక్సట్రా కావాల్సి వస్తే ఓ మిత్రుడి దగ్గర 3 రూపాయల వడ్డీకి చేబదులు తీసుకున్నాడు. అంటే నెలకు రూ.9,000 వడ్డీ.

కూలీల సమస్యో, తగిన మెటీరియల్ దొరక్కో మధ్యలో పనులు ఓ 15 రోజులు ఆగిపోయాయి. ఇదే అతని కొంప ముంచింది... ఇప్పుడతను... రూ. 4 వడ్డీకి (అంటే నెలకు రూ. 12,000) అప్పు తెచ్చి ఆ పాత బాకీ తీర్చి కొత్త బాకీ నెత్తికెత్తుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో తెలుసుకోవాలంటే...అసలేం జరిగి ఉంటుందో తెలియాలి.  

ముందే చెప్పానుగా...మనవాడికి స్టాక్ మార్కెట్ గురించి కాస్తో కూస్తో పరిజ్ఞానం ఉందని. ఇంటి పనులకు 15 రోజులు గ్యాప్ రావడం కూడా అతని బుర్రని ఖరాబు చేసింది. ఆ 3 లక్షలు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టాడు. కనీసం ఓ పాతిక వేలు అయినా సంపాదించుకుందామని. అతని ప్లాన్ బాగానే పనిచేసింది.కేవలం పది రోజుల్లోనే పాతిక కాదు... 50 వేలు పైనే సంపాదించాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంతలో... ఓ ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాడు. అవతలివైపు నుంచి...

హలో సర్..
చెప్పండి..
మేము xyz ట్రేడింగ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామండీ ... మీరు మార్కెట్లో ట్రేడింగ్ చేస్తారా...? అవతలి వ్యక్తి ప్రశ్న. 
మనవాడు కూడా మార్కెట్ పండితుడిగా... వాళ్ళేం చెబుతారో విందామని...
అవునండీ చేస్తున్నా...
ఎందులో చేస్తారు... ఇండెక్స్ లోనా... స్టాక్స్ లోనా...
రెండూ..
మీ క్యాపిటల్ ఎంతో తెలుసుకోవచ్చా...
3 లక్షలు..
ట్రేడింగ్ లో రోజుకెంత సంపాదిస్తారు...?
4000 -5000 దాకా...
అంత తక్కువా...? మీదగ్గరున్న క్యాపిటల్ కి రోజుకు పాతిక వేలు అయినా సంపాదించొచ్చు... మీరు మంచి అవకాశం వదులుకుంటున్నారన్న మాట...
(అవతలి వ్యక్తి అన్న మాటకి మనవాడిలో ఎక్కడో అహం దెబ్బతింది. మరోపక్క రోజుకు పాతిక వేలు సంపాదించొచ్చు అన్న మాట ఎక్కడో సూటిగా గుచ్చుకుంది. ఆ క్షణం లోనే అతని మనసు రకరకాల ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది. అసలే ఫ్రెండ్ దగ్గర అప్పుచేసి ఉన్నాడు.. రోజుకు పాతిక వేలు అంటే 15 రోజులు తిరిగేసరికి అప్పు మొత్తం తీర్చేయొచ్చు. ఇప్పుడు చేతిలో ఉన్న మూడు లక్షలు ఎటూ ఉండనే ఉంటాయి... ఇలా ఆనుకుంటూనే...
అంత ఆశ లేదులెండి... నాకు వచ్చేది చాలు అని చెప్పబోయాడు..
అదేంటి సర్... అలా అంటారు.. మార్కెట్ గురించి మీకు నేను చెప్పాలా...? రోజుకి కనీసం పాతిక వేలు దాకా సంపాదించొచ్చు... మీరు సరేనంటే అదెలాగో చెబుతా..
(మనవాడిలో ఆశ బలపడింది.) 
అయితే చెప్పండి..
మీరు ఏ బ్రోకరేజ్ సంస్థలో ట్రేడింగ్ చేస్తారు...?
ఫలానా దాంట్లో...
మీరు మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తే చాలు... మేము ఇక్కడ మా సిస్టం నుంచి లాగిన్ అవుతాం. మీ తరపున మేం ట్రేడ్ చేస్తాం. మీ సిస్టం లో లాగిన్ అయ్యి ట్రేడింగ్ ను మీరు కూడా గమనించొచ్చు.  వచ్చే లాభాల్లో 30% మాకు, 70% మీకు.. ఏమంటారు?
ఇలా అనేసరికి కాస్త ఆలోచనలో పడ్డాడు.  యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇమ్మంటున్నారు... దానివల్ల ప్రమాదం ఏమీ లేదులే... ఎందుకంటే మన ఫండ్స్ మన అకౌంట్ లోనే ఉంటాయి. ఒకవేళ వాడు విత్ డ్రా  పెట్టినా... పడేది నా అకౌంట్ లోనే... వాడు చేసే మోసమేమీ లేదు.. పైగా ఇక్కడ నేను కూడా చూసుకుంటూనే ఉంటానుగా.. అని అనుకుంటూనే... ఎందుకైనా మంచిదని... 
మీ ఆఫీస్ ఎక్కడ ? అని అడిగాడు...
హైదరాబాద్ లో సర్.. కూకట్ పల్లి.
అడ్రస్ చెబుతారా...? అని అడిగితే అతను అడ్రస్ కూడా చెప్పాడు.

అన్నీ బాగానే ఉన్నాయి కదా అనుకుంటూ... అవతలి వ్యక్తి ఇచ్చిన బంపర్ ఆఫర్ కు ఒప్పుకున్నాడు. వెంటనే ఆ డీటెయిల్స్ అవతలివాని చేతిలో పెట్టాడు. అప్పటికి అతని డీమ్యాట్ అకౌంట్ లో ఉన్న మొత్తం రూ.. 3,55,000. ఫోన్ కట్ అయింది.. ట్రేడింగ్ మొదలైంది. ఆరోజు రూ. 10,000  దాకా ప్రాఫిట్ వచ్చింది. బాగానే ఉంది అనిపించింది. సాయంత్రం అవతలి వ్యక్తి మళ్ళీ ఫోన్ చేశాడు.

చూశారుగా మా ట్రేడింగ్... మొదటిరోజు కదా ఎక్కువ చేయలేదు.. రేపటి నుంచి మనం టార్గెట్ తో పనిచేద్దాం సర్... అని చెప్పేసరికి.. మనవాడు ఆనందం తో సరే అంటూ ఫోన్ పెట్టేశాడు.

తెల్లారింది.. ట్రేడింగ్ మొదలైంది. కొన్న షేర్లలో లాభాలు వస్తున్నట్లే కనిపించింది.. అంతలోనే నష్టాల్లోకి జారుతున్నట్లు అనిపించింది. ఫర్వాలేదులే అనుకున్నాడు. అలా... అలా... 30,000... 40,000 .... నష్టాల్లోకి కూరుకుపోతున్నట్లే ఉంది.. అవతలివాళ్ళకు ఫోన్ చేస్తే... 
కంగారుపడకండి సర్... మేమున్నాముగా.. అని చెప్పేసరికి కాస్త ధైర్యం వచ్చింది...

ఆ షేర్ కాస్త కోలుకున్నట్లు అనిపించినా.. మళ్ళీ అంతలోనే భారీగా పడిపోయింది. కట్ చేస్తే... సాయంత్రానికి మొత్తం అకౌంట్ ఖాళీ అయిపోయింది.. మధ్యమధ్యలో ఫోన్ చేస్తున్నా... కంగారు పడకండి అన్న సమాధానమే...పోనీ అకౌంట్ తన చేతిలోనే ఉందిగా.. ఇక్కడితో లాస్ బుక్ చేసేసి బయటకు వచ్చేద్దామన్న సాహసం చేయలేకపోయాడు. పైగా అవతలివాళ్ళు ఎక్స్పర్ట్స్. వాళ్లకు తెలుసులే... అని చూస్తూ ఉండిపోయాడు. ఇక ఆ తర్వాత ఎన్ని ఫోన్లు చేసినా అవతలినుంచి సమాధానమే లేదు.. మర్నాడు కూకట్ పల్లి లో వాడి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తే అలాంటి సంస్థే లేదు. పిచ్చెక్కి పోయింది. ఈ షాక్ నుంచి తేరుకునేసరికి దాదాపు ఆరు నెళ్ళు పట్టింది. మరిన్ని వివరాల్లోకి వెళ్లట్లేదు కానీ... ఇదీ మావాడి విషాదాధ్యాయం.

పొరపాటున కూడా ఇలాంటి ట్రాప్ లో చిక్కుకోకండి..మిమ్మల్ని మీరు నమ్ముకోండి... ీకు తెలిస్తే ట్రేడింగ్ చేయండి... లేదంటే నేర్చుకునే ప్రయత్నం చేయండి.. అంతవరకు మంచి షేర్లు సెలెక్ట్ చేసుకుని దీర్ఘకాలానికి పెట్టుబడులపై దృష్టి పెట్టండి. ఇవే మీకు భవిష్యత్ లో లాభాలు పూయిస్తాయి.

-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ నిపుణులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement