
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 598 పాయింట్లు పెరిగి 24,607కు చేరింది. సెన్సెక్స్(Sensex) 1938 పాయింట్లు ఎగబాకి 81,389 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.57 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 64.22 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.4 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో గతంతో పోలిస్తే స్థిరంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.07 శాతం లాభపడింది. నాస్‌డాక్ 0.01 శాతం ఎగబాకింది.
భారత్, పాకిస్తాన్ మధ్య దాదాపు యుద్ధమేఘాలు అలుముకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో బలహీనపడ్డాయి. అయితే వారాంతాన కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినప్పటికీ సరిహద్దు పొడవునా పాక్ అతిక్రమణలకు పాల్పడినట్లు వెలువడిన వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. దీంతో మరోసారి అనిశ్చిత పరిస్థితులు తలెత్తినట్లు పేర్కొన్నారు. వెరసి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేవరకూ మార్కెట్లను నిశితంగా పరిశీలించాలని అభిప్రాయపడుతున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)