ట్రేడింగ్‌లో ఫ్యూచర్స్ & ఆప్షన్స్: ఏది బెస్ట్ అంటే.. | Future and Options Which is The Best in Stock Market | Sakshi
Sakshi News home page

ట్రేడింగ్‌లో ఫ్యూచర్స్ & ఆప్షన్స్: ఏది బెస్ట్ అంటే..

Published Sun, Jan 5 2025 9:26 AM | Last Updated on Sun, Jan 5 2025 9:38 AM

Future and Options Which is The Best in Stock Market

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఈమధ్య ఎక్కువ మంది అనుసరిస్తున్న మార్గం ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (ఎఫ్ & ఓ). వీటినే డెరివేటివ్స్ అంటారు. ఈక్విటీలకు మరో ప్రత్యామ్నాయ రూపమే ఈ డెరివేటివ్స్ అన్నమాట. ఈ రెండిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఫ్యూచర్స్ ట్రేడింగ్
▸ఈక్విటీల్లో షేర్లు ఎలా కొంటామో ఫ్యూచర్స్‌లోనూ అదే మాదిరి కొనుక్కోవచ్చు. 
▸ఈక్విటీల్లో ఒక్క షేర్ సైతం కొనుక్కునే వెసులుబాటు ఉంటే ఫ్యూచర్స్‌లో మాత్రం తప్పనిసరిగా ఒక లాట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 
▸ఆయా కంపెనీల షేర్లు  స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే ధరలను బట్టి లాట్ పరిమాణం నిర్ణయమవుతుంది.
▸గతంలో ఫ్యూచర్స్‌లో షేర్లు కొనేటప్పుడు అతి తక్కువ పెట్టుబడి అవసరమయ్యేది. కానీ నిబంధనలు మారిన తర్వాత కొంచెం ఎక్కువ పెట్టుబడి అవసరమవుతోంది.

ఉదా: రిలయన్స్ షేర్లు ఫ్యూచర్స్‌లో కొనాలని అనుకున్నాం. లాట్ సైజు 500. ఇంతే మొత్తం షేర్లను ఈక్విటీల్లో కొనాలంటే రూ. 6,25,000 కావాలి. అదే ఫ్యూచర్స్‌లో అయితే రూ.1,10,836 సరిపోతుంది.

▸ఈక్విటీలు, ఫ్యూచర్స్‌కి తేడా ఏమిటంటే.. ఈక్విటీల రూపంలో కొన్న షేర్లు మనం ఎన్నాళ్లయినా మన దగ్గర ఉంచుకోవచ్చు. 
▸అవి ఒక రకంగా పెట్టుబడి. షేర్ ధర పడిపోయినా ఆందోళన చెందనక్కర్లేదు.
▸డబ్బులు అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు, డబ్బులు ఉన్నప్పుడు ధర పడినా/పెరిగినా మరిన్ని షేర్లు కొనుక్కుంటూ మన పోర్ట్‌ఫోలియోను పెంచుకోవచ్చు. మంచి లాభాలు వచ్చేవరకూ ఎన్నాళ్లయినా ఎదురుచూడొచ్చు.
▸ఫ్యూచర్స్‌లో ఈ వెసులుబాటు ఉండదు. ఫ్యూచర్స్‌లో కొనే షేర్లను కాంట్రాక్టులుగా పరిగణిస్తారు. ఆ కాంట్రాక్టు నెల రోజుల వ్యవధికే  పరిమితమవుతుంది. 
▸దీన్ని పెట్టుబడిగా కాక స్వల్పకాలిక ట్రేడింగ్ వనరుగా మాత్రమే పరిగణించాలి.
▸నెల రోజుల వ్యవధిలో కాంట్రాక్టు ధర ఎప్పుడు పెరిగినా తగిన ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయాలి.
▸కాంట్రాక్టు ధర పడిపోతే మళ్ళీ పెరిగే వరకు అంటే ఆ నెల చివరిదాకా కూడా ఆగొచ్చు. అప్పటికీ పెరక్కపోతే అమ్ముకుని నష్టాన్ని బుక్ చేయాల్సిందే.
▸ప్రస్తుతానికి పడినా.. మళ్ళీ పెరుగుతుందనే నమ్మకం ఉంటే నెలాఖరులో ప్రస్తుత కాంట్రాక్టు వదిలించుకుని తరువాతి నెల కాంట్రాక్టు తీసుకోవచ్చు. ఆ నెలలో కూడా కొన్న రేటు రాక ఇంకా పడిపోతే.. మరింత నష్టాన్ని భరించక తప్పదు. లేదంటే ఆ తరవాతి నెలకు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది.
▸ఇది కాంట్రాక్టు కాబట్టి మొత్తం డబ్బులు పెట్టక్కర్లేకుండా నాలుగో వంతు ధరకే కొనుక్కునే అవకాశం ఉంటుంది. పైన చెప్పుకున్న రిలయన్స్ ఉదాహరణ చూడండి. ఎక్కువమంది స్వల్పకాలిక అవసరాలు, తక్కువ పెట్టుబడిని దృష్టిలో ఉంచుకుని ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు.

ఆప్షన్స్ ట్రేడింగ్
ఈక్విటీలకు మరో డెరివేటివ్ రూపమే ఆప్షన్స్. ఫ్యూచర్స్‌తో పోలిస్తే చాలా చాలా తక్కువ పెట్టుబడికి ట్రేడింగ్ చేసుకునే సౌలభ్యం ఇందులో ఉంది. అందుకే ట్రేడర్లలో నూటికి 90 మంది ఈ మార్గాన్ని అనుసరిస్తారు. ఈ 90లో 85 మంది నష్టపోయేవాళ్లే. డబ్బుల సంపాదనకు చాలా సులువైన మార్గంగా కనిపించే ఈ ఆప్షన్స్ అనేవి రిటైల్ ట్రేడర్ల కోట్ల సొమ్ము మింగేస్తున్నాయి. అదెలాగో తర్వాత తెలుసుకుందాం.

➜ఆప్షన్స్‌లోనూ ఫ్యూచర్స్ మాదిరిగానే, అదే పరిమాణంలో లాట్లలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అది కూడా నెలవారీ కాంట్రాక్టుల్లోనే  చేయాలి. ఆప్షన్స్‌లో కొనేవాటికి ప్రీమియం ఉంటుంది. ఆ రేటు పెట్టి కొనుక్కోవచ్చు.

దీనికి కూడా పై ఉదాహరణనే పరిశీలిద్దాం.
రిలయన్స్ షేర్లు (500) ఈక్విటీల్లో కొంటే.. రూ. 6,25,000 అవసరమవుతాయి. ఫ్యూచర్స్‌లో కొంటే రూ. 1,10,000 కావాలి. ఆప్షన్స్‌లో రూ.1250 కాల్ రూ. 27 ఉంది. పెట్టుబడి 27X500 = 13,500 ఉంటే చాలు.

అందరూ ఎగబడేది ఇందుకోసమే. ఇంత తక్కువ పెట్టుబడితో కూడా ట్రేడ్ చేసుకునే సదుపాయం ఆప్షన్స్‌లో ఉంటుంది. షేర్ ధర మారే దాన్ని బట్టి ఈ ప్రీమియం లోనూ మార్పులు జరుగుతాయి.

రిలయన్స్ షేర్ ధర ప్రస్తుతం రూ.1,250 వద్ద ఉంది. కాబట్టి రూ.1,250 కాంట్రాక్టు కొన్నాం అనుకుందాం. షేర్ ధర కేవలం 2,3 రోజుల వ్యవధిలోనే రూ. 1,300 కి వెళ్తే ప్రీమియం కూడా దాదాపు రూ. 40  దాకా పెరుగుతుంది. అంటే అదంతా మీకొచ్చే లాభమేనన్న మాట. రూ.40X500 = రూ.20,000.  

కేవలం రూ. 13,500 పెట్టుబడితో రెండే రెండు రోజుల్లో రూ.20,000 సంపాదించినట్లు అవుతుంది. ఈ షేర్ ధర ఎంత పెరుగుతూ ఉంటే ప్రీమియం కూడా అంత పెరుగుతూ ఆమేరకు లాభాలను అందిస్తూ ఉంటుంది. అదే షేర్ ధర 50 రూపాయలు పెరిగినప్పటికీ... అలా పెరగడానికి పట్టే కాలం ఎక్కువగా ఉంటే... వచ్చే లాభం తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటాం.

➜ట్రేడర్లలో అత్యధికులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల్ని.. అది కూడా కేవలం స్వల్ప వ్యవధిలోనే సంపాదించేయాలనే ఉద్దేశంతో ఈ ఆప్షన్స్ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు.
➜మార్కెట్ పడుతున్నా.. షేర్ ధర క్షీణిస్తున్నా కూడా ఆప్షన్స్‌లో లాభాలు సంపాదించవచ్చు. 
➜ఆప్షన్స్‌లో మనకొచ్చే లాభాలు అపరిమితం. ఒక్కోసారి కేవలం రూ. 5,000 పెట్టుబడి కూడా ఒక్క నెల రోజుల వ్యవధిలోనే రూ.5 లక్షలు అయిపోవచ్చు. నష్టం వస్తే మాత్రం పోయేది ఆ రూ. 5,000 మాత్రమే. ఇదేదో బానే ఉంది.. బాగా సంపాదించేయవచ్చు అనుకుంటున్నారు కదూ. లక్షలు లక్షలు ఊరికే వచ్చేయవు. ఇందులో వచ్చే దానికంటే పోయేదే ఎక్కువ ఉంటుంది.

ఎందుకలా జరుగుతుంది.. షేర్ ధర పెరిగినా ఆప్షన్స్ ఎందుకు పడిపోతాయి. మన పెట్టుబడి ఎందుకు సున్నా అయిపోతుంది... ఆప్షన్స్‌లో కాల్స్, పుట్స్ పాత్ర ఏమిటి.. ఆప్షన్స్‌లో ఉండే 'ఆప్షన్స్' ఏమిటి.. వంటి విషయాలను కూలంకషంగా తదుపరి కథనంలో తెలుసుకుందాం. 
   
-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement