పొదుపు, రిటైర్మెంట్ ఈ రెండే ముఖ్యం | Savings, retirement of these two important | Sakshi
Sakshi News home page

పొదుపు, రిటైర్మెంట్ ఈ రెండే ముఖ్యం

Published Fri, Feb 28 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

పొదుపు, రిటైర్మెంట్ ఈ రెండే ముఖ్యం

పొదుపు, రిటైర్మెంట్ ఈ రెండే ముఖ్యం

ప్రపంచానికి పెద్దన్న..
 ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ..
 అలాంటి అమెరికాలో ప్రజల ఆదాయ వ్యయాల తీరు ఎలా ఉంటుంది? పెట్టుబడుల విధానమేంటి? ఇవన్నీ తెలియజేసేదే ఈ వారం కంట్రీ కథ...

 
అమెరికా అంటే 50 సమాఖ్య రాష్ట్రాల కూటమి. వీటికి సమాఖ్య జిల్లా వాషింగ్టన్ డీసీ అదనం. అగ్రరాజ్యమే అయినా ఐదేళ్ల కిందట మాంద్యం చేసిన గాయం ప్రభావం మామూలుగా లేదు. దాన్నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఎంత సంపన్న దేశమైనా ప్రజా సంక్షేమ పథకాల విషయాల్లో దానికన్నా వర్ధమాన దేశాలే మెరుగ్గా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. సోషల్ సెక్యూరిటీ వ్యవస్థ కింద అమెరికా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే పింఛను అంతంత మాత్రంగానే ఉంటోంది. వైద్య బీమాకి సంబంధించి నిధుల్లో కొంత ప్రభుత్వం సమకూరిస్తే... మిగతాది ఉద్యోగులు, వారు పనిచేసే కంపెనీలు చెరికాస్త సమకూరుస్తున్నాయి.
 
పొదుపు: చూడటానికి కుబేరుల కంట్రీగానే కనిపిస్తున్నా అమెరికాలో మూడింట రెండొంతుల మందిది రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అక్కడి వారి జీతభత్యాల గురించి లెక్కలేసే అమెరికన్ పే రోల్ అసోసియేషన్ స్వయంగా చెప్పిన విషయమిది. మాంద్యం దరిమిలా అమెరికన్లు మెల్లగా పొదుపుపై దృష్టి సారిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం నాటి సంక్షోభానికి బ్యాంకులే కారణమైనా... ఇప్పటికీ డబ్బు దాచుకునేందుకు బ్యాంకులే సురక్షితమైనవని వారు విశ్వసిస్తున్నారు.
 
ఖర్చులు:
అమెరికన్లు తమ ఆదాయంలో 30-40 శాతాన్ని  హౌసింగ్‌పైన, 11-16 శాతాన్ని ఆహారంపైన వెచ్చిస్తుంటారు. అధికాదాయ వర్గాలు (ఏడాదికి 92,000 డాలర్లకు పైగా సంపాదించే వారు) మాత్రం వీటిపై ఇంతకన్నా తక్కువేఖర్చు చేస్తుంటారట. అధికాదాయ వర్గాలు వ్యక్తిగత బీమాకు, పింఛన్లకు అత్యధికంగా 16 శాతం మేర కేటాయిస్తుండగా.. అల్పాదాయ వర్గాలు (35,000 డాలర్ల కన్నా తక్కువ సంపాదించేవారు) 5.3 శాతం మాత్రమే వీటికి కేటాయించగలుగుతున్నారు.
 
పెట్టుబడులు: చాలా మంది అమెరికన్ల దగ్గర షేర్లు, బాండ్లు ఉంటాయి. రిటైర్మెంట్ పథకాల ద్వారా వీటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. గతేడాది లెక్కల ప్రకారం మ్యూచువల్ ఫండ్లలో అమెరికన్ల పెట్టుబడులు ఏకంగా 13.6 లక్షల కోట్ల డాలర్లు. అమెరికన్లలో అత్యధికులు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయటంతో పాటు మిగతా ప్రపంచ దేశాల ఫండ్లు కూడా అమెరికన్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అందుకే వీటి విలువ చాలా ఎక్కువ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement