story of the country
-
అమెరికన్స్ .. చైనీస్..
కంట్రీ కథ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా... ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. పరిపాలన మొదలు.. ఆదా చేయడం, ఖర్చు పెట్టడం దాకా అన్నింటిలోనూ రెండింటిదీ పరస్పర భిన్నమైన విధానం. ఇలాంటి ఇరు దేశాల ప్రజల తీరుపై ఒక పిట్ట కథ లాంటిది ఇది. మరణానంతరం చైనా మహిళ, అమెరికన్ మహిళ స్వర్గంలో కలుస్తారు. సొంత ఇల్లు కొనుక్కునేందుకు తీసుకున్న అప్పును దాదాపు 30 ఏళ్ల పాటు కష్టపడి తీర్చానంటూ అమెరికన్ మహిళ తన గురించి చెబుతుంది. నేను 30 ఏళ్ల పాటు కష్టపడి.. ఇల్లు కొనుక్కునేంత డబ్బును సంపాదించుకోగలిగానంటూ చైనా మహిళ వివరిస్తుంది. అంటే.. అమెరికన్ మహిళ ముఫ్ఫై ఏళ్ల పాటు స్వంత ఇంట్లోనే ఉంటూ.. ఆ అప్పు తీర్చేందుకు తన జీవితంలో సగభాగాన్ని వెచ్చించింది. మరోవైపు, చైనా మహిళ సగ జీవిత కాలం కష్టపడి.. ఇల్లు కొనుక్కునేంత కూడబెట్టుకుంది. కానీ, కొత్తగా కొనుక్కున్న ఇంట్లో ఒక్క రోజు కూడా నివసించకుండానే కన్ను మూసింది. సారాంశం ఏమిటంటే.. అమెరికన్లు రేప్పొద్దున్న సంపాదించే డబ్బును ముందస్తుగానే ఖర్చు చేసేసి.. ముందస్తుగానే సుఖపడతారు. చైనీయులు డబ్బు ఆదా చేసి ఆ తర్వాత ఖర్చు పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తారు. జీవితాంతం కష్టపడినా.. ఆ ఫలాలు పూర్తిగా అనుభవించేందుకు వారికి తగినంత సమయం దొరకదు. కథ ఇక్కడితో ఆగిపోలేదు.. అమెరికన్ మహిళ చనిపోయిన తర్వాత .. ఆమె సంతానం ‘ఇక ఈ ఇంటి పనైపోయింది. అమ్మ అంత్యక్రియలు పూర్తయ్యాక ఇంకో కొత్త ఇల్లు కొనుక్కోవడానికి మళ్లీ అప్పు తీసుకుందాం’ అంటూ ప్లానింగ్ వేసుకోవడం మొదలుపెట్టారు. మరోవైపు చైనా మహిళ పిల్లలు ‘అమ్మ నిజంగా చాలా గొప్పది. తను జీవితాంతం కష్టపడి మనకు ఇల్లు మిగిల్చింది. మనం కూడా మన పిల్లల కోసం ఇలాగే చేద్దాం’ అని అనుకున్నారు. ఈ విధంగా అమెరికన్ మహిళ పిల్లలు కొత్త అప్పు తీసుకుని మరో కొత్త ఇల్లు తీసుకోగా.. చైనా మహిళ పిల్లలు మాత్రం ఆమె కొన్న ఇంట్లోనే ఉండసాగారు. ఇలా అమెరికన్ మహిళ పిల్లలు కొత్తగా అప్పు తీసుకుని, ఇల్లు కొనుక్కుని, కొత్తగా లైఫ్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. చైనా మహిళ పిల్లలు కూడా కొత్త ఇంట్లో లైఫ్ ఎంజాయ్ చేయసాగారు. కానీ, తేడా అల్లా అది తమ తల్లి సంపాదించి ఇచ్చింది. బహుశా.. అందుకేనేమో అమెరికన్లు భోంచేసే ముందు దేవుణ్ని ప్రార్థిస్తే.. చైనీయులు తమ పూర్వీకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. -
పొదుపు, రిటైర్మెంట్ ఈ రెండే ముఖ్యం
ప్రపంచానికి పెద్దన్న.. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ.. అలాంటి అమెరికాలో ప్రజల ఆదాయ వ్యయాల తీరు ఎలా ఉంటుంది? పెట్టుబడుల విధానమేంటి? ఇవన్నీ తెలియజేసేదే ఈ వారం కంట్రీ కథ... అమెరికా అంటే 50 సమాఖ్య రాష్ట్రాల కూటమి. వీటికి సమాఖ్య జిల్లా వాషింగ్టన్ డీసీ అదనం. అగ్రరాజ్యమే అయినా ఐదేళ్ల కిందట మాంద్యం చేసిన గాయం ప్రభావం మామూలుగా లేదు. దాన్నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఎంత సంపన్న దేశమైనా ప్రజా సంక్షేమ పథకాల విషయాల్లో దానికన్నా వర్ధమాన దేశాలే మెరుగ్గా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. సోషల్ సెక్యూరిటీ వ్యవస్థ కింద అమెరికా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే పింఛను అంతంత మాత్రంగానే ఉంటోంది. వైద్య బీమాకి సంబంధించి నిధుల్లో కొంత ప్రభుత్వం సమకూరిస్తే... మిగతాది ఉద్యోగులు, వారు పనిచేసే కంపెనీలు చెరికాస్త సమకూరుస్తున్నాయి. పొదుపు: చూడటానికి కుబేరుల కంట్రీగానే కనిపిస్తున్నా అమెరికాలో మూడింట రెండొంతుల మందిది రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అక్కడి వారి జీతభత్యాల గురించి లెక్కలేసే అమెరికన్ పే రోల్ అసోసియేషన్ స్వయంగా చెప్పిన విషయమిది. మాంద్యం దరిమిలా అమెరికన్లు మెల్లగా పొదుపుపై దృష్టి సారిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం నాటి సంక్షోభానికి బ్యాంకులే కారణమైనా... ఇప్పటికీ డబ్బు దాచుకునేందుకు బ్యాంకులే సురక్షితమైనవని వారు విశ్వసిస్తున్నారు. ఖర్చులు: అమెరికన్లు తమ ఆదాయంలో 30-40 శాతాన్ని హౌసింగ్పైన, 11-16 శాతాన్ని ఆహారంపైన వెచ్చిస్తుంటారు. అధికాదాయ వర్గాలు (ఏడాదికి 92,000 డాలర్లకు పైగా సంపాదించే వారు) మాత్రం వీటిపై ఇంతకన్నా తక్కువేఖర్చు చేస్తుంటారట. అధికాదాయ వర్గాలు వ్యక్తిగత బీమాకు, పింఛన్లకు అత్యధికంగా 16 శాతం మేర కేటాయిస్తుండగా.. అల్పాదాయ వర్గాలు (35,000 డాలర్ల కన్నా తక్కువ సంపాదించేవారు) 5.3 శాతం మాత్రమే వీటికి కేటాయించగలుగుతున్నారు. పెట్టుబడులు: చాలా మంది అమెరికన్ల దగ్గర షేర్లు, బాండ్లు ఉంటాయి. రిటైర్మెంట్ పథకాల ద్వారా వీటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. గతేడాది లెక్కల ప్రకారం మ్యూచువల్ ఫండ్లలో అమెరికన్ల పెట్టుబడులు ఏకంగా 13.6 లక్షల కోట్ల డాలర్లు. అమెరికన్లలో అత్యధికులు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయటంతో పాటు మిగతా ప్రపంచ దేశాల ఫండ్లు కూడా అమెరికన్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అందుకే వీటి విలువ చాలా ఎక్కువ.