అమెరికన్స్ .. చైనీస్..
కంట్రీ కథ
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా... ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. పరిపాలన మొదలు.. ఆదా చేయడం, ఖర్చు పెట్టడం దాకా అన్నింటిలోనూ రెండింటిదీ పరస్పర భిన్నమైన విధానం. ఇలాంటి ఇరు దేశాల ప్రజల తీరుపై ఒక పిట్ట కథ లాంటిది ఇది.
మరణానంతరం చైనా మహిళ, అమెరికన్ మహిళ స్వర్గంలో కలుస్తారు. సొంత ఇల్లు కొనుక్కునేందుకు తీసుకున్న అప్పును దాదాపు 30 ఏళ్ల పాటు కష్టపడి తీర్చానంటూ అమెరికన్ మహిళ తన గురించి చెబుతుంది. నేను 30 ఏళ్ల పాటు కష్టపడి.. ఇల్లు కొనుక్కునేంత డబ్బును సంపాదించుకోగలిగానంటూ చైనా మహిళ వివరిస్తుంది. అంటే.. అమెరికన్ మహిళ ముఫ్ఫై ఏళ్ల పాటు స్వంత ఇంట్లోనే ఉంటూ.. ఆ అప్పు తీర్చేందుకు తన జీవితంలో సగభాగాన్ని వెచ్చించింది. మరోవైపు, చైనా మహిళ సగ జీవిత కాలం కష్టపడి.. ఇల్లు కొనుక్కునేంత కూడబెట్టుకుంది. కానీ, కొత్తగా కొనుక్కున్న ఇంట్లో ఒక్క రోజు కూడా నివసించకుండానే కన్ను మూసింది.
సారాంశం ఏమిటంటే.. అమెరికన్లు రేప్పొద్దున్న సంపాదించే డబ్బును ముందస్తుగానే ఖర్చు చేసేసి.. ముందస్తుగానే సుఖపడతారు. చైనీయులు డబ్బు ఆదా చేసి ఆ తర్వాత ఖర్చు పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తారు. జీవితాంతం కష్టపడినా.. ఆ ఫలాలు పూర్తిగా అనుభవించేందుకు వారికి తగినంత సమయం దొరకదు.
కథ ఇక్కడితో ఆగిపోలేదు..
అమెరికన్ మహిళ చనిపోయిన తర్వాత .. ఆమె సంతానం ‘ఇక ఈ ఇంటి పనైపోయింది. అమ్మ అంత్యక్రియలు పూర్తయ్యాక ఇంకో కొత్త ఇల్లు కొనుక్కోవడానికి మళ్లీ అప్పు తీసుకుందాం’ అంటూ ప్లానింగ్ వేసుకోవడం మొదలుపెట్టారు. మరోవైపు చైనా మహిళ పిల్లలు ‘అమ్మ నిజంగా చాలా గొప్పది. తను జీవితాంతం కష్టపడి మనకు ఇల్లు మిగిల్చింది. మనం కూడా మన పిల్లల కోసం ఇలాగే చేద్దాం’ అని అనుకున్నారు.
ఈ విధంగా అమెరికన్ మహిళ పిల్లలు కొత్త అప్పు తీసుకుని మరో కొత్త ఇల్లు తీసుకోగా.. చైనా మహిళ పిల్లలు మాత్రం ఆమె కొన్న ఇంట్లోనే ఉండసాగారు. ఇలా అమెరికన్ మహిళ పిల్లలు కొత్తగా అప్పు తీసుకుని, ఇల్లు కొనుక్కుని, కొత్తగా లైఫ్‌ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. చైనా మహిళ పిల్లలు కూడా కొత్త ఇంట్లో లైఫ్ ఎంజాయ్ చేయసాగారు. కానీ, తేడా అల్లా అది తమ తల్లి సంపాదించి ఇచ్చింది. బహుశా.. అందుకేనేమో అమెరికన్లు భోంచేసే ముందు దేవుణ్ని ప్రార్థిస్తే.. చైనీయులు తమ పూర్వీకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు.