ఐశ్వర్య అంత అందంగా కనిపించాలి, ఎత్తుపెరగాలి.. ఆరడుగులు డార్లింగ్‌గా మారిపోవాలి...ఆధునిక యువతలో ఇదో పెద్ద క్రేజ్. ఈ పిచ్చినే కొంతమంది స్వార్థపరులు క్యాష్ చేసుకుంటున్నారు. అందంకోసం ఆరాటపడి ప్రాణాలనే పొగొట్టుకున్న షాకింగ్ సంఘటన ఒకటి చైనాలో చోటు చేసుకుంది. దీంతో ఉన్నదానితో సంతృప్తి పడే కాలం పోయింది. లేని దాని కోసం అర్రులు చాచడం ఒక వేలం వెర్రిగా మారిపోయిందంటన్న నెటిజన్లు కామెంట్లు వైరల్‌గా మారాయి.
దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌లోని గుయిగాంగ్‌లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళ 24 గంటల వ్యవధిలో ఆరు కాస్మెటిక్ సర్జరీలు చేసుకుంది. కానీ తన అందాన్ని తనివి తీరా చూసుకోకముందే తనువు చాలించింది. సుమారు రూ. 4.7 లక్షలు ( 40వేల యువాన్లు) అప్పు చేసి మరీ నన్నింగ్‌లోని ఒక క్లినిక్‌లో చేరింది.. ఒకే రోజు కళ్లు, ముక్కు, ఉదరం కోసం సర్జరీలు చేయించుకుంది. తరువాత ఆమె తొడలలోని కొవ్వును తీసి ముఖం, రొమ్ములలోకి ఇంజెక్ట్ చేసే లైపోసక్షన్ సర్జరీలు చేయించుకుంది. అయితే ఆ మహిళ డిశ్చార్జి కాగానే క్లినిక్‌లోని లిఫ్ట్ ముందేఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వైద్యులు చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. లైపోసక్షన్ తర్వాత పల్మనరీ ఎంబోలిజం కారణంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్య రావడంతో చనిపోయిందని పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. ఆమెకు ఎనిమిదేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.
మరోవైపు మహిళ మరణంపై కుటుంబ సభ్యులు తమకు న్యాయం కావాలంటూ క్లినిక్‌పై కేసు వేశారు . అయితే 2 లక్షల యువాన్‌ల నష్టపరిహారం ఇవ్వడానికి అంగీకరించింది. అయితే, అతను కనీసం 10 లక్షల యువాన్‌లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆమె భర్త కోర్టును ఆశ్రయించాడు. దీన్ని విచారించిన కోర్టు చివరికి సుమారు 70 లక్షల రూపాయలు (590,000 యువాన్‌ల ) నష్టపరిహారంచెల్లించాలని ఆసుపత్రిని ఆదేశించింది. పరిస్థితిని సరిగ్గా గమనించకుండా, కొన్ని వైద్యపరమైన తప్పులు చేసిందని న్యాయమూర్తి లి షాన్ వ్యాఖ్యానించారు. తపుడు వాగ్దానాలతో అప్పు చేసి మరీ ఆపరేషన్లు చేయించుకునేలా ప్రేరేపించిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
2020ల నాటి ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అందంకోసం అతిగా పోతే అనర్థం తప్పదంటూ కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానించగా , డబ్బులు కోసం ఎంతకైనా తెగిస్తారా అంటూ క్లినిక్‌పై కొందరు, ఒకే రోజులో ఆరు సర్జరీలు? క్లినిక్‌కి ఇంగితజ్ఞానం లేదా? ముఖ్యంగా రక్తం గడ్డకట్టడానికి దారితీసే లైపోసక్షన్‌తో సమస్యల ప్రమాదాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? అంటూ మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. (వైరల్ వీడియో: కీరవాణిగారూ.. ఒక్క ఛాన్స్ ప్లీజ్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్)
చైనాలో లైపోసక్షన్ ఆపరేషన్లు చాలా సాధారణంగా మారిపోతున్నాయి. అందంగా, స్లిమ్‌గా ఉండాలనే కోరికతో మహిళలు కాస్మొటిక్ సర్జరీలవైపు మొగ్గు చూపుతున్నారు. చాలామంది చనిపోతున్నారు. మరికొంతమంది తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment