Liposuction
-
ఇద్దరు బిడ్డల తల్లి : ఒకే రోజు ఆరు బ్యూటీ సర్జరీలు.. చివరికి!
ఐశ్వర్య అంత అందంగా కనిపించాలి, ఎత్తుపెరగాలి.. ఆరడుగులు డార్లింగ్‌గా మారిపోవాలి...ఆధునిక యువతలో ఇదో పెద్ద క్రేజ్. ఈ పిచ్చినే కొంతమంది స్వార్థపరులు క్యాష్ చేసుకుంటున్నారు. అందంకోసం ఆరాటపడి ప్రాణాలనే పొగొట్టుకున్న షాకింగ్ సంఘటన ఒకటి చైనాలో చోటు చేసుకుంది. దీంతో ఉన్నదానితో సంతృప్తి పడే కాలం పోయింది. లేని దాని కోసం అర్రులు చాచడం ఒక వేలం వెర్రిగా మారిపోయిందంటన్న నెటిజన్లు కామెంట్లు వైరల్‌గా మారాయి.దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌లోని గుయిగాంగ్లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళ 24 గంటల వ్యవధిలో ఆరు కాస్మెటిక్ సర్జరీలు చేసుకుంది. కానీ తన అందాన్ని తనివి తీరా చూసుకోకముందే తనువు చాలించింది. సుమారు రూ. 4.7 లక్షలు ( 40వేల యువాన్లు) అప్పు చేసి మరీ నన్నింగ్‌లోని ఒక క్లినిక్‌లో చేరింది.. ఒకే రోజు కళ్లు, ముక్కు, ఉదరం కోసం సర్జరీలు చేయించుకుంది. తరువాత ఆమె తొడలలోని కొవ్వును తీసి ముఖం, రొమ్ములలోకి ఇంజెక్ట్ చేసే లైపోసక్షన్ సర్జరీలు చేయించుకుంది. అయితే ఆ మహిళ డిశ్చార్జి కాగానే క్లినిక్‌లోని లిఫ్ట్ ముందేఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వైద్యులు చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. లైపోసక్షన్ తర్వాత పల్మనరీ ఎంబోలిజం కారణంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్య రావడంతో చనిపోయిందని పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. ఆమెకు ఎనిమిదేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.మరోవైపు మహిళ మరణంపై కుటుంబ సభ్యులు తమకు న్యాయం కావాలంటూ క్లినిక్‌పై కేసు వేశారు . అయితే 2 లక్షల యువాన్ల నష్టపరిహారం ఇవ్వడానికి అంగీకరించింది. అయితే, అతను కనీసం 10 లక్షల యువాన్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆమె భర్త కోర్టును ఆశ్రయించాడు. దీన్ని విచారించిన కోర్టు చివరికి సుమారు 70 లక్షల రూపాయలు (590,000 యువాన్ల ) నష్టపరిహారంచెల్లించాలని ఆసుపత్రిని ఆదేశించింది. పరిస్థితిని సరిగ్గా గమనించకుండా, కొన్ని వైద్యపరమైన తప్పులు చేసిందని న్యాయమూర్తి లి షాన్ వ్యాఖ్యానించారు. తపుడు వాగ్దానాలతో అప్పు చేసి మరీ ఆపరేషన్లు చేయించుకునేలా ప్రేరేపించిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.2020ల నాటి ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అందంకోసం అతిగా పోతే అనర్థం తప్పదంటూ కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానించగా , డబ్బులు కోసం ఎంతకైనా తెగిస్తారా అంటూ క్లినిక్‌పై కొందరు, ఒకే రోజులో ఆరు సర్జరీలు? క్లినిక్‌కి ఇంగితజ్ఞానం లేదా? ముఖ్యంగా రక్తం గడ్డకట్టడానికి దారితీసే లైపోసక్షన్‌తో సమస్యల ప్రమాదాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? అంటూ మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. (వైరల్ వీడియో: కీరవాణిగారూ.. ఒక్క ఛాన్స్ ప్లీజ్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్)చైనాలో లైపోసక్షన్ ఆపరేషన్లు చాలా సాధారణంగా మారిపోతున్నాయి. అందంగా, స్లిమ్‌గా ఉండాలనే కోరికతో మహిళలు కాస్మొటిక్ సర్జరీలవైపు మొగ్గు చూపుతున్నారు. చాలామంది చనిపోతున్నారు. మరికొంతమంది తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. -
నా బుగ్గల్లో ప్లాస్టిక్ ఏం లేదు!
అందమైన నయనాలే కాదు వాటికి పైన ఉండే కనుబొమలతోనూ ముఖ కవళికల్లో మార్పులు తీసుకురావడం సాధ్యమేనా?! అని అడిగితే సాధ్యమే అంటోంది నటి నయనతార. ముఖాకృతిలో మార్పులకు కనుబొమలు కీలకమైనవి అంటోందామె.జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి దేశవ్యాప్తంగా నయనతార ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. దీంతో ఆమెలో వచ్చిన మార్పును సూచిస్తూ పాత, కొత్త ఫోటోలు పెట్టి, నయన్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, సన్నబడటానికి లై పోసక్షన్ చేయించుకుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు కొందరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ పుకార్లకు స్పందించి, కనుబొమల తీరులో, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్లనే ఇది సాధిస్తున్నానని, ఇందుకు ΄్లాస్టిక్ సర్జరీ అవసరమే లేదని తెలిపింది. ‘ఇది నిజమైన గేమ్ ఛేంజర్. నా కనుబొమలలో మార్పులు తీసుకురావడం నాకు చాలా ఇష్టం. కొన్నేళ్లుగా విభిన్న రకాల కనుబొమలను ట్రై చేస్తూ వచ్చాను. అది ఇప్పుడు వర్క్ ఔట్ అయిందనుకుంటా! అలాగే సన్నగా కనిపించేందుకు లైపోసక్షన్ చేయించుకున్నాననే వార్తలు కూడా వచ్చాయి. కానీ, అది నిజం కాదు. ఆహారాన్ని బట్టి బరువు హెచ్చుతగ్గుల్లో చాలా మార్పులు తీసుకురావచ్చు. ఆ మార్పుల్లో భాగంగా ఒకసారి నా బుగ్గలు లోపలికి వెళ్లినట్టు, మరోసారి బయటికి వచ్చినట్టు కనిస్తాయి. కావాలంటే నా బుగ్గలను నొక్కి చూడవచ్చు, వీటిలో ΄్లాస్టిక్ లేదు’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది నయన్. -
చేతన రాజ్ మరణం.. అందం కోసం ఎంత మూల్యం చెల్లించాలి?
మనం నటులం. సోషల్ మీడియాల్లో చేస్తున్న పోస్టుల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిం చాలి. నిజాయితీగా, వాస్తవికంగా ఆలోచిద్దాం. మనం సన్నగా, తెల్లగా ఉండాలన్న ప్రయత్నంలో ఉండొద్దు. ఈ విషయాలపై నిర్ద్వంద్వంగా మన మనసులోని భావాలను వ్యక్తం చేయాలి. మౌనంగా ఉండటం ఇంకో ప్రాణాన్ని బలి తీసుకోవచ్చు. నిజానికి ప్లాస్టిక్ సర్జరీ కారణంగా వినోద పరిశ్రమలో ప్రాణాలు కోల్పోయిన తొలి వ్యక్తి చేతన రాజ్ కానేకాదు. కొన్నేళ్ల క్రితం కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక నటీమణి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. లైపోసక్షన్ శస్త్ర చికిత్స కాస్తా వికటించడంతో ఆమె అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలాంటి దుర్విధిని ఎదుర్కొన్న చేతన రాజ్ ప్రస్తుత వినోద పరిశ్రమ వాస్తవాలను మరోసారి మన కళ్లముందు ఉంచుతోంది. ఈ వినోద ప్రపంచంలో ‘అందం’ అనేదానికి అసాధా రణమైన, వాస్తవ దూరమైన నిర్వచనాలు ఉన్నాయి. ఇది మహిళల విషయంలో చాలా ఎక్కువ. అయితే ఇదేదో పరిశ్రమ నుంచి వస్తున్న డిమాండ్ మాత్రమే అనుకునేందుకు వీల్లేదు. అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని చిన్నప్పటి నుంచి ఆడపిల్ల లపై తల్లిదండ్రులు, సమాజం పెట్టే తీవ్రమైన ఒత్తిడి పరిణామం ఇది అని నేను నమ్ముతున్నాను. ఫ్యాషన్, రీటైల్ వస్త్ర వ్యాపారాన్నే ఉదాహరణలుగా తీసుకుందాం. అందంగా కనిపించడం మహిళల బాధ్యత అన్నట్టుగా ఉంటుంది. ఇలా ఉండటం కోసం శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు ఎందరో నాకు తెలుసు. వీరిలో చాలామంది శరీరంపైని వెంట్రుకలను తొలగించుకునేందుకు లేజర్, రసాయన చికిత్సలు తీసుకున్నవారే. శరీరంపై వెంట్రుకలు ఉన్న మహిళలను ‘సెక్సీ’ అని పరిగణించరు మరి! ఈ సూత్రం మహిళలకు మాత్రమే. పురుషుల విషయానికి వస్తే అన్నీ నడిచిపోతాయి. లేజర్ ట్రీట్మెంట్లు, చర్మపు రంగును తేలిక చేసే ప్రయత్నాలు, రసాయ నాలతో చర్మాన్ని శుద్ధి చేయడం, పెదవులు బొద్దుగా కనిపించేందుకు కృత్రిమ రసాయనాలను నింపుకోవడం, బొటాక్స్, లైపోసక్షన్... ఇలాంటివన్నీ మహిళలు ఎందుకు చేయించుకుంటారంటే... అందం తాలూకూ ‘ప్రమాణాలు’ అందుకునే ప్రయత్నమే అని చెప్పాలి. కేన్సర్ కణితిని తొలగించిన తరువాత నాకూ బరువుకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యాయి. సులువైన చిట్కాలూ బోలెడన్ని ఉన్నాయి. వాటి మాయలో పడటం పెద్ద కష్టం కాదు. కానీ తగిన ఆహారం తీసుకోవడం, నిర్దిష్టమైన అలవాట్లు పెంచుకోవడం, మార్చుకోవడం అవసరం. ఒకరకంగా చూస్తే సినిమాలు ఈ సమాజానికి దర్పణమని చెప్పాలి. దురదృష్టవశాత్తూ వాస్తవం మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. ఏ సినిమా లోనైనా హీరోయిన్ మన పక్కింటి పిల్ల మాదిరిగానో లేదంటే రోడ్లో వెళు తూంటే తారసపడే అమ్మాయిలానో కనిపించిందా చెప్పండి? చాలా చాలా అరుదు. హీరోయిన్ల మాదిరిగా డ్రస్సులు నిజ జీవితంలో ఎవరూ వేసుకోరు. మేకప్పూ అలా చేసుకోరు. కానీ నెమ్మదిగా తెరపై హీరోయిన్లా కనిపించడం అనేది అందరి ఆశయమైపోయింది. ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ల మాదిరిగా అన్ని విషయాల్లోనూ అందరూ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇదంతా మహిళల గురించే. పురుషుల విషయానికి వస్తే అంటే.. హీరో బానపొట్ట వేసుకుని 65 ఏళ్ల వయసున్నా చెల్లిపోతోంది. పొరబాటునగానీ ఓ మహిళా కళాకారిణి కొంచెం ఒళ్లు చేసిందంటే చాలు... నానారకాల ఏడుపులతో సోషల్ మీడియా నిండి పోతుంది. వినోద పరిశ్రమలో ఓ మహిళ వయసు 30లు దాటుతున్నాయంటే... అందరి దృష్టిలోంచి కూడా జారిపోతున్నట్లు లెక్క. మలయాళం పరిశ్రమ ఆదర్శం వినోద పరిశ్రమలో లింగ వివక్షను కొద్దోగొప్పో సరిచేసే ప్రయత్నం చేస్తున్నది మలయాళ సినిమా పరిశ్రమ అని చెప్పవచ్చు. మేకప్ లేకుండా, శరీరాకృతి కనిపించేలా కాకుండా నటులను సాధారణ దుస్తుల్లోనే చూపిస్తున్నారు. కేశా లంకరణ విషయంలోనూ అన్నీ సాధారణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కృత్రిమ కనుబొమలు ధరించకుండా చూసుకుంటున్నారు. ఈ తేడాల ప్రభావం వారి నటనపై స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవికమైన, నిజాయితీతో కూడిన నటన ఆవిష్కృతమవుతోంది. దక్షిణాది సినీ పరిశ్రమలో సాధారణంగా హీరోల పారితోషికం కోట్లల్లో ఉంటుంది. మహిళలకు వచ్చే సరికి ఇది లక్షల్లో మాత్రమే. కేవలం కొద్దిమంది మాత్రమే ఈ స్థితిని మార్చ గలిగారు. అటు మహిళలూ, ఇటు పురుషుల మధ్య ఈ అంశాలపై చర్చ జరగా ల్సిన అవసరం ఉంది. సినిమాలు తీసేవాళ్లు, నిర్మాతలు, వినోద పరిశ్రమలో మార్పు తేగల సామర్థ్యం ఉన్న వారందరూ ఇకనైనా సమస్యలను కప్పిపుచ్చే ప్రయత్నాలు మానాలి. నటులు కూడా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నామో ఆలోచించి పెట్టాలి. చేతన రాజ్ ఫొటోలు చూస్తూంటే... నాకు ఆమెలో ఎలాంటి లోపాలూ కనిపించలేదు. మీ మాదిరి, నా మాదిరి, అందరి మాదిరిగా తనూ సాధారణంగానే కనిపించింది. కానీ మదిలో ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉంటుంది? కొన్ని సందర్భాల్లో ఇలాంటి యువతులపైనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. సినిమా పరిశ్రమలో ‘ప్రవేశానికి’ నిర్దిష్టమైన రీతిలో కనిపించా లన్న తాపత్రయం చేతనను లైపోసక్షన్ శస్త్రచికిత్స వైపు నడిపించి ఉండవచ్చు. ఎందుకలా చేసిందో నిర్ణ యించే అధికారం మనలో ఎవరికీ లేదు. వ్యక్తులు ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసుకుంటారు. కానీ ఒకటి మాత్రం కలుక్కుమంటూనే ఉంది. చేతన నిజంగా అంత మూల్యం చెల్లించాలా?.. - దివ్య స్పందన (రమ్య) కన్నడ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
పాకిస్తాన్ భారీకాయుడికి సర్జరీ
లాహోర్: పాకిస్తాన్‌లోకెల్లా అత్యధిక బరువు కలిగిన వ్యక్తికి, బరువు తగ్గేందుకు చేసిన లైపోసక్షన్ సర్జరీ విజయవంతమైంది. దాదాపు 330 కేజీలకు పైగా బరువుతో కదల్లేని పరిస్థితిలో ఉన్న నూరుల్ హసన్ సోషల్‌మీడియా ద్వారా తన గోడును వెల్లబోసుకున్నాడు. దాన్నిగమనించిన పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమార్ జావెద్ సర్జరీకి ఏర్పాట్లు చేశారు. రెస్క్యూ 1122 దళ సభ్యులు అతడి ఇంటి గోడను కూల్చి మరీ సైనిక వాహనం ద్వారా మిలిటరీ ఆస్పత్రికి తరలించారు. గంటా నలభై నిమిషాలపాటు నిర్వహించిన ఆపరేషన్ కష్టతరమైనదే అయినప్పటికీ, విజయవంతంగా పూర్తయిందని డాక్టర్ మౌజ్ అల్ హసన్ తెలిపారు. రానున్న నాలుగు రోజుల పాటు నూరుల్ ఐసీయూలోనే ఉంటాడని అనంతరం ఆరునెలల్లో 200 కేజీల కంటే తక్కువ బరువుకు చేరుకుంటాడని అన్నారు. -
ఊ... కొడతారా?ఊహూ... అంటారా?
దూరపు కొండలు నునుపు అన్నట్లు దూరం నుంచి చూసేవాళ్లకి సినిమా తారల జీవితం చాలా విలాసవంతంగా అనిపిస్తుంది. కానీ, అందంగా కనిపించడానికి వాళ్లు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. బరువు పెరగకుండా కేలరీలు లెక్కపెట్టుకుని మరీ ఆహారం తీసుకుంటారు. ఒంట్లో నిల్వ ఉండే అదనపు కొవ్వుని తగ్గించడానికి, అవసరమైతే లైపో సక్షన్ కూడా చేయించుకుంటుంటారు. కానీ, ఒక్కోసారి లైపో వికటించి, ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఇటీవల ఆర్తీ అగర్వాల్ అలా బలైన విషయం తెలిసిందే. భారతీయ తారల్లో లైపో చేయించుకుంటున్న వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. విదేశీ తారల్లో ఈ చికిత్స చేయించుకున్నవాళ్ల సంఖ్య చాలానే ఉంది. వాళ్లల్లో కొంతమంది గురించి... అంత అవపరమా? గాయని మారియా కేరీ సన్నగానే ఉండేవారు. కానీ, నాలుగేళ్ల క్రితం కవలలకు జన్మనిచ్చిన తర్వాత ఆమె అమాంతంగా బరువు పెరిగారు. ఈ బరువు తగ్గించాలంటే ఇప్పట్లో అయ్యే పని కాదనుకున్నారేమో.. లైపో సక్షన్ చేయించుకోవడానికి నిర్ణయించుకున్నారు. దానివల్ల ప్రమాదం అని కొంతమంది స్నేహితులు వారించినా లెక్క చేయకుండా ఆపరేషన్ టేబుల్ ఎక్కేశారామె. ఫలితంగా తాను అనుకున్నట్లుగా సన్నబడిపోయారు. నాజూకు నడుము కోసం... నటి డెమీ మూర్‌కి చాలామంది అభిమానులు ఉన్నారు. ‘ఇంత స్లిమ్‌గా ఎలా ఉంటుందబ్బా’ అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయే రీతిలో ఆమె ఉండేవారు. కానీ, వయసు మీద పడుతున్నకొద్దీ వచ్చే మార్పుల్లో భాగంగా, ఆమె కొంచెం బరువు పెరిగారు. ముఖ్యంగా నడుము, భుజాల దగ్గర కొవ్వు పేరుకుంటున్నట్లుగా అనిపించిందట. అంతే.. లైపో చేయించేసుకున్నారు. అంతకు మించిన అందం కోసం! నటి కిమ్ కర్దాషియాన్ లైపో సక్షన్ చేయించుకోవాల్సినంత బొద్దుగా లేకపోయినా ఈ చికిత్స చేయించుకున్నారనే టాక్ ఉంది. మాజీ భర్త డామన్ థామస్ ఆజ్ఞ మేరకు ఆమె లైపో చేయించుకున్నారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. అయితే, శిల్పంలాంటి శరీరాకృతి కోసం ఆమే కావాలని లైపో చేయించుకున్నారన్నది కొంతమంది వాదన. ఏదేమైనా.. కిమ్ లైపో చేయించుకున్నారన్నది నిజం. ఇంకా హాలీవుడ్లో తారల్లో కతీ గ్రిఫ్ఫిన్, హీడీ మోంటాగ్, కైల్ రిచర్డ్స్.. వంటివాళ్లు లైపో సక్షన్ చేయించుకుని సన్నబడ్డారు. ఈ చికిత్స తర్వాత వాళ్లు స్లిమ్‌గా కనిపించినా, మునుపటి కళ లేదని కొంతమంది అంటున్నారు. సహజమైన అందం కోల్పోయారన్నది కూడా కొంతమంది అభిప్రాయం. లైపో కారణంగా ప్లస్సులూ, మైనస్సులూ ఉన్నాయి. ముఖ్యంగా లైపో కారణంగా ఆర్తీ ఆగర్వాల్ బలైన విషయం ప్రపంచవ్యాప్తంగా ప్రచారమైంది కాబట్టి, ఇక లైపో చేయించుకోవడానికి తారలు ఊ కొడతారో.. ఊహూ అంటారో...? -
ప్రాణాల మీదకు తెస్తున్న బరువు
వెయిట్ తగ్గడం, కొవ్వులు కరిగించుకోవడం కోసం క్యూ ♦ బేరియాట్రిక్, ప్లాస్టిక్ సర్జన్లను ఆశ్రయిస్తున్న వారు ఎక్కువే ♦ సినిమా, రాజకీయ రంగాల వారే అధికం ♦ శస్త్రచికిత్సల ఖరీదు ఏటా వెయ్యికోట్ల పైనే! సాక్షి, హైదరాబాద్: మొన్న ఆర్టీఏ అధికారి రాజేంద్ర... నేడు నటి ఆర్తి అగర్వాల్.. ఇద్దరూ బరువు తగ్గించుకోవడానికి డాక్టర్లను ఆశ్రయించి మృతి చెందిన వారే! ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలే కావచ్చు గానీ.. నయా ఫ్యాషన్ ట్రెండ్‌లో యువతీయువకులు తమ శరీర ఆకృతిని ఆకర్షణీయంగా మార్చుకునేందుకు పడేపాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న 8 మంది హీరోలు లైపోసక్షన్ చేయించుకున్న వారే. గత నాలుగేళ్లలో రాజకీయ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సుమారు 60 మంది బరువు తగ్గడానికి లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో నెలకు 150 బేరియాట్రిక్ సర్జరీలు జరుగుతుండగా, లైపోసక్షన్ సర్జరీలు 1,500 నుంచి 2 వేల వరకూ జరగుతున్నట్టు సమాచారం. ఇలా అధిక బరువును తగ్గించుకునేందుకు జరుగుతున్న శస్త్రచికిత్సల వ్యాపారం తెలుగు రాష్ట్రాల్లో వెయ్యి కోట్ల వరకూ ఉంటుందని అంచనా. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి పట్టణాల్లో బరువును తగ్గించుకునేందుకు బేరియాట్రిక్, లైపోసక్షన్ సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. అసలు ఈ రెండిటి మధ్య తేడా కూడా తెలియకుండానే శస్త్ర చికిత్సలకు సిద్ధపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ రెండు సర్జరీల మధ్య తేడా ఓసారి చూద్దాం. లైపోసక్షన్ ఇది పూర్తిగా కాస్మొటిక్ శస్త్రచికిత్స. శరీరంలో ఉన్న కొవ్వులను కరిగించి బయటకు తీయడం. మనిషి బరువును బట్టి కనిష్టంగా 5 లీటర్ల నుంచి గరిష్టంగా 14 లీటర్ల కొవ్వును బయటకు తీస్తారు. ప్రస్తుతం బరువు తగ్గడం కోసం, శరీరాకృతి మార్చుకోవడం కోసం వైద్యులను ఆశ్రయిస్తున్న వారిలో ఎక్కువ మంది లైపోసక్షన్ కోసం వస్తున్నవారే. వీరిలో 80 శాతం మంది 35 నుంచి 45 ఏళ్ల లోపు వారే కావడం విశేషం. ఇవిగాకుండా ముక్కు(రినోప్లాస్టీ), లాసిక్(కళ్లలో చిన్న పొరలాంటి అద్దాలు తగిలించుకోవడం), బ్రెస్ట్ ఇంప్లాంటేషన్స్ (వక్షోజాలు పెంచుకోవడం) చేయించుకునే వారూ ఎక్కువే. బేరియాట్రిక్ సర్జరీ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్ బైపాస్, డియోడినల్ స్విచ్ అనేవి వీటిలో రకాలు. ఇందులో ప్రధానంగా జీర్ణాశయాన్ని శస్త్రచికిత్స ద్వారా చిన్నదిగా చేసి, చిన్న పేగు మధ్య భాగాన్ని కత్తిరించి ఈ సంచికి కలిపేస్తారు. ఈ శస్త్రచికిత్స ద్వారా జీర్ణమయ్యే ఆహారం చిన్న పేగుల్లోని డియోడినల్లోకి కాకుండా నేరుగా పేగు మధ్యభాగంలోకి వెళుతుంది. అంటే మనం తినే ఆహారం పేగుల్లో ఇంకిపోవడం తగ్గిపోతుంది. దీనిద్వారా కొద్దిగా తినగానే కడుపు నిండుతుంది. ఇది పూర్తిగా హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపేలా చేస్తుంది. గుండె జబ్బులు, డయాబెటిక్ తదితర జబ్బులున్న వారు ఈ ప్రక్రియకు పూర్తిగా దూరంగా ఉండాలి. సర్జరీల ముందూ.. వెనుకా.. ♦ గుండె, కాలేయం, ఊపిరితిత్తులు వంటి అవయవాలతోపాటు ప్రధాన వైద్య పరీక్షలన్నీ చేసి, అంతా బాగుందన్న తర్వాతే బేరియాట్రిక్ లేదా లైపోసక్షన్ చేయాలి ♦ ఆపరేషన్ పూర్తయ్యాక 2 వారాల పాటు తరచూ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి ♦ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారు ఆకలైనప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి ♦ తినడానికి అరగంట ముందు, తిన్నాక అరగంట తర్వాత వరకూ నీళ్లు తీసుకోకూడదు ♦ బేరియాట్రిక్ చేయించుకున్న వారు పూర్తిగా ఆహారాన్ని నమిలి మింగాలి ♦ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు, గుండెజబ్బులు లేదా మధుమేహం ఉన్నవారికి బేరియాట్రిక్ లేదా లైపోసక్షన్ చెయ్యడం మంచిది కాదు ♦ లైపోసక్షన్ చేయించుకున్న వారు కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు తగ్గించాలి. క్రమశిక్షణతో కూడిన వ్యాయామం చెయ్యాలి. వీటి ద్వారా తగ్గొచ్చు.. ఆహార నియమాలు విధిగా పాటించడం. తక్కువ ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకోవడం. రోజూ కనీసం 45 నిముషాల నడక లేదా ఈత. యోగా, ఏరోబిక్స్ చేయడం. - డా.ఫణిమహేశ్వరరెడ్డి, ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల, విజయవాడ దుష్పరిణామాలు ఎన్నో... లైపోసక్షన్ ♦ లైపోసక్షన్ వల్ల చాలావరకూ తాత్కాలికంగా స్వల్ప సమస్యలు మాత్రమే తలెత్తుతాయి. ♦ అరుదుగా వివిధ కారణాల వల్ల తీవ్రమైన దుష్పరిణామాలు, చాలా అరుదుగా మరణం కలుగుతాయి. ♦ ఒకేసారి వేర్వేరు చోట్ల కొవ్వును తొలగించినా, ఎక్కువ మొత్తంలో తొలగించినా ప్రమాదం. ♦ లైపోసక్షన్‌తో పాటు ఇతర శస్త్రచికిత్సలు చేసినా ప్రమాదం ఎక్కువ. ♦ రక్తం, ద్రవాలు ఎక్కువగా తొలగిపోతే షాక్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. ♦ చర్మం కింద ద్రవాలు లేదా రక్తం లీక్ కావడంతో పాటు ఇన్ఫెక్షన్ల ముప్పు పెరగొచ్చు. ♦ పొరపాటుగా ప్లీహం, కాలేయం వంటి కీలక అవయవాలు ధ్వంసం అయ్యే ప్రమాదం ఉంటుంది. ♦ ఇంజెక్ట్ చేసిన ద్రావణం విషపూరితంగా మారి కూడా ముప్పు కలగవచ్చు. ♦ ఊపిరితిత్తుల్లో కొవ్వు లేదా రక్తం గడ్డలు ప్రాణాంతకం కావొచ్చు. బేరియాట్రిక్ ♦ ఈ శస్త్రచికిత్సలు చేసుకునే ప్రతి 20 మందిలో ఒకరు ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు. ♦ పౌష్టికాహార లోపం, పేగుల్లో అడ్డంకులు ఏర్పడవచ్చు. ♦ ప్రతి 100 మందిలో ఒకరికి కాళ్లలో లేదా ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు కట్టవచ్చు. ♦ గుండె వద్ద మంట, వాంతులు, వికారం కలుగుతాయి. ♦ శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం జరగొచ్చు. ♦ శస్త్రచికిత్స తర్వాత పది నెలలకు పిత్తాశయంలో రాళ్లు ఏర్పడవచ్చు. ♦ అరుదుగా గుండెపోటు వచ్చి మరణమూ సంభవించవచ్చు. -
అందాల కనువిందుకు కత్తి ఎందుకు?
(నాన్-సర్జికల్): ఆకర్షణీయంగా కనిపించాలనుకోవడం మానవ సహజం. కానీ అధిక కొవ్వు కారణంగా శరీర ఆకారం వికారంగా తయారవుతుంది. స్థూలకాయం ఒక శాపంగా పరిణమిస్తుంది. బరువును తగ్గించే ప్రక్రియల్లో లైపోసక్షన్ ప్రధానమైనది.దానికి సమానమైన ప్రభావాన్ని చూపిస్తున్నది శస్త్రచికిత్సేతర (నాన్-సర్జికల్) లైపోసక్షన్ విధానం. ఈ విధానం అత్యంత విప్లవాత్మక బాడీ మోడలింగ్ టెక్నిక్‌లలో ఒకటిగా పరిగణిస్తున్నారు నిపుణులు. శస్త్రచికిత్సకు సంబంధించి భయాందోళనలున్నవారికి ఈ విధానం వల్ల ఎంతో మేలు. దీనిలో మత్తుమందు (అనస్థీషియా) ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ విధానం ఎంతో సురక్షితమైనది. సైడ్ ఎఫెక్ట్లు ఏమీ ఉండవు. ఖర్చు కూడా చాలా తక్కువ. చికిత్స అనంతరం తిరిగి బరువు పెరగకపోవడం దీని ప్రత్యేకత. శరీరంలో కొవ్వును తగ్గించే ప్రక్రియ చికిత్స పూర్తి అయిన అనంతరం కూడా ఒక వారంపాటు కొనసాగుతుంది. ప్రప్రథమంగా 2005వ సంవత్సరంలో యూరప్‌లో అభివృద్ధి చెందిన ఈ విధానం, యుఎస్ఏలో కూడా ప్రాచుర్యం పొందింది. రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లోని హెల్దీ కర్వ్స్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ ద్వారా మనకు పరిచయమైంది. శరీరంలో కొవ్వు పేరుకుపోయిన భాగాల నుండి 40-60 శాతం కొవ్వును తగ్గించుకోవటానికి కేవలం 4-6 సందర్శనలు అవసరం. చాలా తక్కువ మొత్తంలో ఖర్చయ్యే ఈ చికిత్సను పొందేందుకు యు.ఎస్., యు.కె., యు.ఎ.ఇ.ల నుండి కూడా స్థూలకాయ సమస్య పీడితులు ఈ క్లినిక్‌ను సందర్శిస్తున్నారు. అధిక బరువును తగ్గించుకోవటానికి, ఆత్మవిశ్వాస్వాన్ని పెంచుకోవటానికీ నాన్-సర్జికల్ లైపోసక్షన్ ప్రక్రియను అందిస్తున్నది హెల్తీ కర్వ్స్ స్లిమ్మింగ్ క్లినిక్. చర్మం సక్రమ నిర్వహణ అనేది మన అంతర్గత ఆరోగ్యం, బయటకు కనిపించే ఆకృతికి సంబంధించిన ముఖ్యమైన అంశాల్లో ఒకటి. జీవితంలో దీని అవసరం మరింతగా పెరిగే దశలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు గర్భం ధరించి ఉన్న కాలంలోనూ, ఇతరత్రా కొన్ని కారణాల వల్ల ముఖం కుంగిపోయినట్లుగా కనిపిస్తుంది. కాన్పు అనంతరం, అసాధారణ ప్రాంతంలో చర్మం కుంగిపోవటం, బరువు తగ్గటం, ముఖంపై చర్మ కళను కోల్పోవటం తీవ్రమైన కాస్మెటిక్ సమస్యలకు దారితీస్తుంది. దీంతో వ్యక్తులు తమ వయస్సు కంటే పెద్దవాళ్ళుగా కనిపిస్తారు,‘‘అబ్లేటివ్ లేజర్ స్క్రిన్ రీసర్ఫేసింగ్’’ అనే ప్రక్రియ ద్వారా ముఖ సౌందర్యాన్ని తిరిగి తీసుకురావచ్చు. దీని కారణంగా సంక్రమించే ఇబ్బందులు, చర్మం రకాన్ని బట్టి ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశాలు పరిమితంగా ఉంటాయి కాబట్టి ఈ చికిత్సను పొందటానికి రోగులు సందేహించవచ్చు. ఈ మధ్యనే ‘‘మల్టీ పోలార్ టెక్నాలజీ’’గా పిలువబడే ఒక వైవిధ్యమైన విధానం అభివృద్ధి చేయబడినది. ఇందులో అన్ని రకాల చర్మాలకు చికిత్సను అందించే నిమిత్తం రేడియో ఫ్రీక్వెన్సీ(ఆర్.ఎఫ్.) ఎనర్జీస్‌ను ఉపయోగిస్తుంటారు. కొన్ని క్లినిక్‌లలో ఉపయోగించే మోనోపోలార్, బైపోలార్ విధానాల కంటే ప్రభావవంతమైనది. అన్నిరకాల చర్మాలకు, సరియైన ఆకృతిని కలిగించేందుకు, చర్మంపై ముడతలు లేకుండా బిగుతుగా చేసేందుకు మల్టీపొలార్ సాధనాన్ని చక్కగా, సురక్షితంగాను ఉపయోగించవచ్చు. ముఖంపై ముడతలను పోగొట్టటానికి ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు. ‘‘ప్రత్యేకమైన సదుపాయాలు, సాంకేతిక త మా సొంతం. దీని ఫలితాలు చాలా సానుకూలమైనవి. త్వరితగతిన ఏర్పడతాయి. అంతే కాకుండా, మా వైద్యుల బృందం వ్యక్తి సంక్షేమంపట్ల అంకితభావాన్ని కలిగి ఉంటారు. వ్యక్తికి, రోగ లక్షణాలకు సంబంధించిన ప్రతి అంశంపట్ల ఖచ్చితమైన రీతిలో దృష్టి పెడతాం.’’ అని అంటున్నారు లైపోసక్షన్ ప్రక్రియలో ఐదేళ్లకుపైబడిన అనుభవమున్న డాక్టర్ కిషోర్. అనేక చర్మసంబంధ రుగ్మతలు, ముఖ సౌందర్యం పెంపొందించడానికి విభిన్నమైన చికిత్సావిధానాలకు హైదరాబాద్‌లోని ‘‘హెల్దీ కర్వ్స్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ పేరుగాంచినది. ఈ విధానాన్ని ఉపయోగించటంలో ప్రత్యేకత కలిగింది. మీ చర్మ సంబంధిత సమస్యల నుండి పూర్తి మార్పు, ఉపశమనం కొరకు మమ్ములను సంప్రదించండి.