చేతన రాజ్
మనం నటులం. సోషల్ మీడియాల్లో చేస్తున్న పోస్టుల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిం చాలి. నిజాయితీగా, వాస్తవికంగా ఆలోచిద్దాం. మనం సన్నగా, తెల్లగా ఉండాలన్న ప్రయత్నంలో ఉండొద్దు. ఈ విషయాలపై నిర్ద్వంద్వంగా మన మనసులోని భావాలను వ్యక్తం చేయాలి. మౌనంగా ఉండటం ఇంకో ప్రాణాన్ని బలి తీసుకోవచ్చు.
నిజానికి ప్లాస్టిక్ సర్జరీ కారణంగా వినోద పరిశ్రమలో ప్రాణాలు కోల్పోయిన తొలి వ్యక్తి చేతన రాజ్ కానేకాదు. కొన్నేళ్ల క్రితం కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక నటీమణి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. లైపోసక్షన్ శస్త్ర చికిత్స కాస్తా వికటించడంతో ఆమె అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలాంటి దుర్విధిని ఎదుర్కొన్న చేతన రాజ్ ప్రస్తుత వినోద పరిశ్రమ వాస్తవాలను మరోసారి మన కళ్లముందు ఉంచుతోంది.
ఈ వినోద ప్రపంచంలో ‘అందం’ అనేదానికి అసాధా రణమైన, వాస్తవ దూరమైన నిర్వచనాలు ఉన్నాయి. ఇది మహిళల విషయంలో చాలా ఎక్కువ. అయితే ఇదేదో పరిశ్రమ నుంచి వస్తున్న డిమాండ్ మాత్రమే అనుకునేందుకు వీల్లేదు. అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని చిన్నప్పటి నుంచి ఆడపిల్ల లపై తల్లిదండ్రులు, సమాజం పెట్టే తీవ్రమైన ఒత్తిడి పరిణామం ఇది అని నేను నమ్ముతున్నాను. ఫ్యాషన్, రీటైల్ వస్త్ర వ్యాపారాన్నే ఉదాహరణలుగా తీసుకుందాం. అందంగా కనిపించడం మహిళల బాధ్యత అన్నట్టుగా ఉంటుంది. ఇలా ఉండటం కోసం శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు ఎందరో నాకు తెలుసు. వీరిలో చాలామంది శరీరంపైని వెంట్రుకలను తొలగించుకునేందుకు లేజర్, రసాయన చికిత్సలు తీసుకున్నవారే. శరీరంపై వెంట్రుకలు ఉన్న మహిళలను ‘సెక్సీ’ అని పరిగణించరు మరి! ఈ సూత్రం మహిళలకు మాత్రమే. పురుషుల విషయానికి వస్తే అన్నీ నడిచిపోతాయి. లేజర్ ట్రీట్‌మెంట్లు, చర్మపు రంగును తేలిక చేసే ప్రయత్నాలు, రసాయ నాలతో చర్మాన్ని శుద్ధి చేయడం, పెదవులు బొద్దుగా కనిపించేందుకు కృత్రిమ రసాయనాలను నింపుకోవడం, బొటాక్స్, లైపోసక్షన్... ఇలాంటివన్నీ మహిళలు ఎందుకు చేయించుకుంటారంటే... అందం తాలూకూ ‘ప్రమాణాలు’ అందుకునే ప్రయత్నమే అని చెప్పాలి.
కేన్సర్ కణితిని తొలగించిన తరువాత నాకూ బరువుకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యాయి. సులువైన చిట్కాలూ బోలెడన్ని ఉన్నాయి. వాటి మాయలో పడటం పెద్ద కష్టం కాదు. కానీ తగిన ఆహారం తీసుకోవడం, నిర్దిష్టమైన అలవాట్లు పెంచుకోవడం, మార్చుకోవడం అవసరం.
ఒకరకంగా చూస్తే సినిమాలు ఈ సమాజానికి దర్పణమని చెప్పాలి. దురదృష్టవశాత్తూ వాస్తవం మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. ఏ సినిమా లోనైనా హీరోయిన్ మన పక్కింటి పిల్ల మాదిరిగానో లేదంటే రోడ్లో వెళు తూంటే తారసపడే అమ్మాయిలానో కనిపించిందా చెప్పండి? చాలా చాలా అరుదు. హీరోయిన్ల మాదిరిగా డ్రస్సులు నిజ జీవితంలో ఎవరూ వేసుకోరు. మేకప్పూ అలా చేసుకోరు. కానీ నెమ్మదిగా తెరపై హీరోయిన్‌లా కనిపించడం అనేది అందరి ఆశయమైపోయింది. ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్ల మాదిరిగా అన్ని విషయాల్లోనూ అందరూ పర్‌ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇదంతా మహిళల గురించే. పురుషుల విషయానికి వస్తే అంటే.. హీరో బానపొట్ట వేసుకుని 65 ఏళ్ల వయసున్నా చెల్లిపోతోంది. పొరబాటునగానీ ఓ మహిళా కళాకారిణి కొంచెం ఒళ్లు చేసిందంటే చాలు... నానారకాల ఏడుపులతో సోషల్ మీడియా నిండి పోతుంది. వినోద పరిశ్రమలో ఓ మహిళ వయసు 30లు దాటుతున్నాయంటే... అందరి దృష్టిలోంచి కూడా జారిపోతున్నట్లు లెక్క.
మలయాళం పరిశ్రమ ఆదర్శం
వినోద పరిశ్రమలో లింగ వివక్షను కొద్దోగొప్పో సరిచేసే ప్రయత్నం చేస్తున్నది మలయాళ సినిమా పరిశ్రమ అని చెప్పవచ్చు. మేకప్ లేకుండా, శరీరాకృతి కనిపించేలా కాకుండా నటులను సాధారణ దుస్తుల్లోనే చూపిస్తున్నారు. కేశా లంకరణ విషయంలోనూ అన్నీ సాధారణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కృత్రిమ కనుబొమలు ధరించకుండా చూసుకుంటున్నారు. ఈ తేడాల ప్రభావం వారి నటనపై స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవికమైన, నిజాయితీతో కూడిన నటన ఆవిష్కృతమవుతోంది. దక్షిణాది సినీ పరిశ్రమలో సాధారణంగా హీరోల పారితోషికం కోట్లల్లో ఉంటుంది. మహిళలకు వచ్చే సరికి ఇది లక్షల్లో మాత్రమే. కేవలం కొద్దిమంది మాత్రమే ఈ స్థితిని మార్చ గలిగారు.
అటు మహిళలూ, ఇటు పురుషుల మధ్య ఈ అంశాలపై చర్చ జరగా ల్సిన అవసరం ఉంది. సినిమాలు తీసేవాళ్లు, నిర్మాతలు, వినోద పరిశ్రమలో మార్పు తేగల సామర్థ్యం ఉన్న వారందరూ ఇకనైనా సమస్యలను కప్పిపుచ్చే ప్రయత్నాలు మానాలి. నటులు కూడా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నామో ఆలోచించి పెట్టాలి. చేతన రాజ్ ఫొటోలు చూస్తూంటే... నాకు ఆమెలో ఎలాంటి లోపాలూ కనిపించలేదు. మీ మాదిరి, నా మాదిరి, అందరి మాదిరిగా తనూ సాధారణంగానే కనిపించింది. కానీ మదిలో ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉంటుంది? కొన్ని సందర్భాల్లో ఇలాంటి యువతులపైనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. సినిమా పరిశ్రమలో ‘ప్రవేశానికి’ నిర్దిష్టమైన రీతిలో కనిపించా లన్న తాపత్రయం చేతనను లైపోసక్షన్ శస్త్రచికిత్స వైపు నడిపించి ఉండవచ్చు. ఎందుకలా చేసిందో నిర్ణ యించే అధికారం మనలో ఎవరికీ లేదు. వ్యక్తులు ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసుకుంటారు. కానీ ఒకటి మాత్రం కలుక్కుమంటూనే ఉంది. చేతన నిజంగా అంత మూల్యం చెల్లించాలా?..
- దివ్య స్పందన (రమ్య)
కన్నడ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు
(‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment