kannada actress ramya
-
అమ్మానాన్న తర్వాత నాకు రాహుల్ గాంధీయే..: కన్నడ నటి
దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ అభి సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు రమ్య (దివ్య స్పందన). ఆ మరుసటి ఏడాదే కుట్టు చిత్రంతో తమిళ్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో బోలెడన్ని అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. అలా తమిళ, కన్నడ, హిందీలో సినిమాలు చేశారు. తెలుగులో అభిమన్యు అనే ఒకే ఒక్క సినిమాలో నటించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చారు. 'నా తల్లిదండ్రులే నా ప్రాణం. నాన్న చనిపోయిన రెండు వారాలకే నేను పార్లమెంటులో అడుగుపెట్టాల్సి వచ్చింది. కానీ పార్లమెంటు కార్యకలాపాల గురించి నాకు ఏమీ తెలియదు. అయినా ప్రతీదీ నేర్చుకున్నాను. నేను నా బాధను పనివైపు మళ్లించాను. అంతటి శక్తిని నాకు మాండ్యా ప్రజలే ఇచ్చారు. జీవితంలో నన్ను ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అమ్మానాన్నల తర్వాత రాహుల్ గాంధీ ఉన్నారు. నాన్న మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయాను. అలాంటి కష్ట సమయంలో రాహుల్ గాంధీ నాకు అండగా నిలబడి సహాయం చేశారు. మానసికంగా ధైర్యాన్ని నూరిపోసి సపోర్ట్ చేశారు' అని చెప్పుకొచ్చారు. కాగా 2012లో రాజకీయాల్లో ప్రవేశించిన ఆమె 2013లో మాండ్య లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షురాలిగా పని చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె ఇటీవలే ఉత్తరకాండతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. -
చేతన రాజ్ మరణం.. అందం కోసం ఎంత మూల్యం చెల్లించాలి?
మనం నటులం. సోషల్ మీడియాల్లో చేస్తున్న పోస్టుల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిం చాలి. నిజాయితీగా, వాస్తవికంగా ఆలోచిద్దాం. మనం సన్నగా, తెల్లగా ఉండాలన్న ప్రయత్నంలో ఉండొద్దు. ఈ విషయాలపై నిర్ద్వంద్వంగా మన మనసులోని భావాలను వ్యక్తం చేయాలి. మౌనంగా ఉండటం ఇంకో ప్రాణాన్ని బలి తీసుకోవచ్చు. నిజానికి ప్లాస్టిక్ సర్జరీ కారణంగా వినోద పరిశ్రమలో ప్రాణాలు కోల్పోయిన తొలి వ్యక్తి చేతన రాజ్ కానేకాదు. కొన్నేళ్ల క్రితం కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక నటీమణి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. లైపోసక్షన్ శస్త్ర చికిత్స కాస్తా వికటించడంతో ఆమె అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలాంటి దుర్విధిని ఎదుర్కొన్న చేతన రాజ్ ప్రస్తుత వినోద పరిశ్రమ వాస్తవాలను మరోసారి మన కళ్లముందు ఉంచుతోంది. ఈ వినోద ప్రపంచంలో ‘అందం’ అనేదానికి అసాధా రణమైన, వాస్తవ దూరమైన నిర్వచనాలు ఉన్నాయి. ఇది మహిళల విషయంలో చాలా ఎక్కువ. అయితే ఇదేదో పరిశ్రమ నుంచి వస్తున్న డిమాండ్ మాత్రమే అనుకునేందుకు వీల్లేదు. అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని చిన్నప్పటి నుంచి ఆడపిల్ల లపై తల్లిదండ్రులు, సమాజం పెట్టే తీవ్రమైన ఒత్తిడి పరిణామం ఇది అని నేను నమ్ముతున్నాను. ఫ్యాషన్, రీటైల్ వస్త్ర వ్యాపారాన్నే ఉదాహరణలుగా తీసుకుందాం. అందంగా కనిపించడం మహిళల బాధ్యత అన్నట్టుగా ఉంటుంది. ఇలా ఉండటం కోసం శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు ఎందరో నాకు తెలుసు. వీరిలో చాలామంది శరీరంపైని వెంట్రుకలను తొలగించుకునేందుకు లేజర్, రసాయన చికిత్సలు తీసుకున్నవారే. శరీరంపై వెంట్రుకలు ఉన్న మహిళలను ‘సెక్సీ’ అని పరిగణించరు మరి! ఈ సూత్రం మహిళలకు మాత్రమే. పురుషుల విషయానికి వస్తే అన్నీ నడిచిపోతాయి. లేజర్ ట్రీట్మెంట్లు, చర్మపు రంగును తేలిక చేసే ప్రయత్నాలు, రసాయ నాలతో చర్మాన్ని శుద్ధి చేయడం, పెదవులు బొద్దుగా కనిపించేందుకు కృత్రిమ రసాయనాలను నింపుకోవడం, బొటాక్స్, లైపోసక్షన్... ఇలాంటివన్నీ మహిళలు ఎందుకు చేయించుకుంటారంటే... అందం తాలూకూ ‘ప్రమాణాలు’ అందుకునే ప్రయత్నమే అని చెప్పాలి. కేన్సర్ కణితిని తొలగించిన తరువాత నాకూ బరువుకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యాయి. సులువైన చిట్కాలూ బోలెడన్ని ఉన్నాయి. వాటి మాయలో పడటం పెద్ద కష్టం కాదు. కానీ తగిన ఆహారం తీసుకోవడం, నిర్దిష్టమైన అలవాట్లు పెంచుకోవడం, మార్చుకోవడం అవసరం. ఒకరకంగా చూస్తే సినిమాలు ఈ సమాజానికి దర్పణమని చెప్పాలి. దురదృష్టవశాత్తూ వాస్తవం మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. ఏ సినిమా లోనైనా హీరోయిన్ మన పక్కింటి పిల్ల మాదిరిగానో లేదంటే రోడ్లో వెళు తూంటే తారసపడే అమ్మాయిలానో కనిపించిందా చెప్పండి? చాలా చాలా అరుదు. హీరోయిన్ల మాదిరిగా డ్రస్సులు నిజ జీవితంలో ఎవరూ వేసుకోరు. మేకప్పూ అలా చేసుకోరు. కానీ నెమ్మదిగా తెరపై హీరోయిన్లా కనిపించడం అనేది అందరి ఆశయమైపోయింది. ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ల మాదిరిగా అన్ని విషయాల్లోనూ అందరూ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇదంతా మహిళల గురించే. పురుషుల విషయానికి వస్తే అంటే.. హీరో బానపొట్ట వేసుకుని 65 ఏళ్ల వయసున్నా చెల్లిపోతోంది. పొరబాటునగానీ ఓ మహిళా కళాకారిణి కొంచెం ఒళ్లు చేసిందంటే చాలు... నానారకాల ఏడుపులతో సోషల్ మీడియా నిండి పోతుంది. వినోద పరిశ్రమలో ఓ మహిళ వయసు 30లు దాటుతున్నాయంటే... అందరి దృష్టిలోంచి కూడా జారిపోతున్నట్లు లెక్క. మలయాళం పరిశ్రమ ఆదర్శం వినోద పరిశ్రమలో లింగ వివక్షను కొద్దోగొప్పో సరిచేసే ప్రయత్నం చేస్తున్నది మలయాళ సినిమా పరిశ్రమ అని చెప్పవచ్చు. మేకప్ లేకుండా, శరీరాకృతి కనిపించేలా కాకుండా నటులను సాధారణ దుస్తుల్లోనే చూపిస్తున్నారు. కేశా లంకరణ విషయంలోనూ అన్నీ సాధారణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కృత్రిమ కనుబొమలు ధరించకుండా చూసుకుంటున్నారు. ఈ తేడాల ప్రభావం వారి నటనపై స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవికమైన, నిజాయితీతో కూడిన నటన ఆవిష్కృతమవుతోంది. దక్షిణాది సినీ పరిశ్రమలో సాధారణంగా హీరోల పారితోషికం కోట్లల్లో ఉంటుంది. మహిళలకు వచ్చే సరికి ఇది లక్షల్లో మాత్రమే. కేవలం కొద్దిమంది మాత్రమే ఈ స్థితిని మార్చ గలిగారు. అటు మహిళలూ, ఇటు పురుషుల మధ్య ఈ అంశాలపై చర్చ జరగా ల్సిన అవసరం ఉంది. సినిమాలు తీసేవాళ్లు, నిర్మాతలు, వినోద పరిశ్రమలో మార్పు తేగల సామర్థ్యం ఉన్న వారందరూ ఇకనైనా సమస్యలను కప్పిపుచ్చే ప్రయత్నాలు మానాలి. నటులు కూడా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నామో ఆలోచించి పెట్టాలి. చేతన రాజ్ ఫొటోలు చూస్తూంటే... నాకు ఆమెలో ఎలాంటి లోపాలూ కనిపించలేదు. మీ మాదిరి, నా మాదిరి, అందరి మాదిరిగా తనూ సాధారణంగానే కనిపించింది. కానీ మదిలో ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉంటుంది? కొన్ని సందర్భాల్లో ఇలాంటి యువతులపైనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. సినిమా పరిశ్రమలో ‘ప్రవేశానికి’ నిర్దిష్టమైన రీతిలో కనిపించా లన్న తాపత్రయం చేతనను లైపోసక్షన్ శస్త్రచికిత్స వైపు నడిపించి ఉండవచ్చు. ఎందుకలా చేసిందో నిర్ణ యించే అధికారం మనలో ఎవరికీ లేదు. వ్యక్తులు ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసుకుంటారు. కానీ ఒకటి మాత్రం కలుక్కుమంటూనే ఉంది. చేతన నిజంగా అంత మూల్యం చెల్లించాలా?.. - దివ్య స్పందన (రమ్య) కన్నడ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
మరోసారి చిక్కుల్లో పడ్డ హీరోయిన్
బెంగళూరు: కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. పాకిస్థాన్ నరకం కాదంటూ ఇటీవల రమ్య చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం చల్లారకముందే.. ఆమెపై క్రిమనల్ కేసు నమోదు చేయాలని స్థానిక కోర్టు..పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఆర్ఎస్ఎస్ బ్రిటీష్ వారికి సహకరించారంటూ రమ్య చేసిన వ్యాఖ్యలపై వసంత్ మరకడ అనే న్యాయవాది ప్రయివేట్ పిటిషన్ దాఖలు చేశారు. రమ్యపై చర్య తీసుకోవాలని ఆయన మంగళూరు సమీపంలోని బెల్తాన్ గడి కోర్టులో పిటిషన్లో కోరారు. అయితే అంతకు ముందు ఆయన రమ్యపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసేందుకు అంగీకరించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. వసంత్ స్టేట్మెంట్ను రికార్డు చేసిన కోర్టు రమ్యపై క్రిమినల్ కేసు నమోదు ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రమ్యకు సమన్లు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. మండ్య పట్టణంలో భారత రాష్ట్రీయ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘విద్యార్థిగళ నడె దేశద బెళవణిగె కడె’ ర్యాలీలో పాల్గొన్న రమ్య బీజేపీ, ఆర్ఎస్ఎస్ల వల్ల దేశానికి స్వాతంత్య్రం రాలేదని, కేవలం కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్ల మాత్రమే స్వాతంత్య్రం లభించిందని అన్నారు. అంతేకాకుండా బిజేపీ, ఆర్ఎస్ఎస్లు బ్రటీష్ వారికి సహకరించారని ఆరోపణలు చేశారు. ఇప్పటికే రమ్యపై దేశద్రోహం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్లో ఉన్న వారు కూడా మంచి వారేనంటూ వ్యాఖ్యలు చేసిన ఆమెపై కొడగు జిల్లా సోమవార పేటలోని జేఎంఎఫ్‌సీ కోర్టులో ప్రైవేటుగా దేశద్రోహం కేసు దాఖలైంది. న్యాయవాది విఠల్‌గౌడ ఈ ప్రైవేటు కేసును దాఖలు చేశారు. శత్రుదేశమైన పాకిస్తాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన రమ్యపై సెక్షన్ 124/ఎ, 334ల కింద కేసు నమోదు చేయడంతో పాటు, ఆమెపై తక్షణమే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలంటూ విఠల్‌గౌడ న్యాయస్థానాన్ని కోరిన విషయం విదితమే. -
సినీతారలతో రైతుల ఆత్మహత్యలకు చెక్!
ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు సినీ తారలను ప్రచార రంగంలోకి దింపి లబ్ధి పొందడం రివాజే. కానీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను ఆపేందుకు పార్టీకి చెందిన సినీ తారలను రంగంలోకి దింపింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల ఆత్మహత్య ఘటనలు పెరిగిపోతూ ప్రభుత్వం పరువు గంగలో కలిసిపోతున్న నేపథ్యంలో ఆర్థికంగా తీసుకోవాల్సిన చర్యలను పక్కనపెట్టి సినీ తారలను ఆశ్రయించింది. రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే తాము పార్టీకి చెందిన తారలను రైతుల వద్దకు పంపితే తప్పేంటని పాలకపక్ష కాంగ్రెస్ నేతలు బాహటంగానే తమ చర్యను సమర్థించుకుంటున్నారు. కన్నడ సూపర్ స్టార్, పార్టీ మాజీ ఎంపీ రమ్య పార్టీ వ్యూహంలో భాగంగా మాండ్యా జిల్లాలో పర్యటించి రైతులను కలుసుకున్నారు. ఆ జిల్లాలో గత రెండు నెలల్లో 25 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో ఎక్కువ మంది చెరుకు రైతులే. గతంలో మాండ్యా లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన రమ్యకు గ్లామర్ ఎంతున్నా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారన్న కారణంగా గత ఎన్నికల్లో ఓడిపోయారు. దాంతో ఉన్నత చదువుల కోసమని విదేశాలకు వెళ్లి ఇటీవలే తిరిగొచ్చారు. చక్కెర మిల్లులు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడం వల్లనే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆమె ఆరోపించారు. చెరకు సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా ధరను నిర్ణయించకపోవడమూ ఒక కారణమేనని అంగీకరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు కొంత ఆర్థిక సహాయం అందించి తన జిల్లా పర్యటనను ముగించారు. ఇప్పుడు ఆమె బాటలోనే మిగతా జిల్లాల్లో పర్యటించేందుకు సినీ తార, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ, గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్, మరో సినీతార, జవహర్ బాల భవన్ చైర్పర్సన్ భావన సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రైతుల్లో భరోసా కల్పించేందుకు రేడియా ద్వారా ప్రసంగించినా, స్వయంగా రైతులను కలుసుకున్నా రైతుల ఆత్మహత్యలు ఆగలేదని, అందుకే సినీ తారలను రంగంలోకి దింపాల్సి వచ్చిందని పేరు వెల్లడించేందుకు ఇష్టం లేని ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు.